బెంగాల్‌ రాజకీయాల్లో సమూలమార్పు 

30 Apr, 2021 00:43 IST|Sakshi

విశ్లేషణ

బెంగాల్‌లో రాజకీయ నేతలు, కేడర్లు పాత తరహా ఎన్నికల నిర్వహణవైపు మళ్లడం ఇక అసాధ్యం. భారత రాజకీయాల్లో అనేక ధోరణులకు బెంగాల్‌ మినహాయింపుగా ఉండేది. ఇక్కడ పార్టీల మధ్య స్పర్థ విశిష్టంగా ఉండేది. రాజకీయ కేడర్‌ సిద్ధాంతపరమైన భాషలో ప్రచారం సాగించేవారు. కులం, కమ్యూనిటీ, డబ్బు ప్రసక్తి లేకుండా ఎన్నికలు జరిగేవి. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న బెంగాల్‌కి ఈ ఎన్నికలు ముగింపు పలకవచ్చు. బెంగాల్‌ ఒకవైపు, దేశమంతా మరోవైపు అన్నట్లుగా ఉన్న పరిస్థితిని అమెరికన్‌ శైలి రాజకీయ నిర్వహణగా ఈ ఎన్నికలు మార్చివేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే బెంగాల్‌ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే మరింత ఘోరంగా తయారయ్యాయి.

పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది దశల్లో సుదీ ర్ఘంగా సాగుతున్న శాసనసభ ఎన్నికల ముగింపు సందర్భంగా ఒక విషయం మాత్రం తేటతెల్లమైంది. అదేమిటంటే బెంగాల్‌ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే మరింత ఘోరంగా తయారయ్యాయి.. నేను ఇక్కడ ఎన్నికల ఫలితం గురించి జోస్యం చెప్పబోవడం లేదు. త్వరలోనే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు కూడా రానున్నాయి. అప్పుడు బెంగాల్‌ రాజకీయ రణరంగంలో జరిగిన సంకుల సమరం ఎలా ముగుస్తుందో మనకు స్పష్టత కలగవచ్చు. నా అభిప్రాయం ప్రకారం ఈ ఎన్నికలు టీఎంసీ, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీగానే జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీతో, ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌తో కూటమి గట్టిన వామపక్ష కూటమి బెంగాల్‌ రాజకీయ రంగస్థలంపై మరోసారి ప్రభావం చూపవచ్చన్న అంచనా తేలిపోయినట్లే చెప్పవచ్చు. బెంగాల్‌ మూడో శక్తిగా చెబుతున్న ఈ కూటమి 10 శాతం పాపులర్‌ ఓట్లతో అధికారానికి ఆమడదూరంలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది ఓట్లు ప్రతిఫలించనప్పటికీ బెంగా>ల్‌లో అత్యంత తీవ్రమైన ఎన్నికల పోటీ ఈసారి మాత్రమే చోటు చేసుకుందని నా అంచనా. టీఎంసీ, బీజేపీలు మొత్తం ఓట్లలో 80 శాతం వరకు కైవసం చేసుకోనున్నాయి. ఈ రెండు పార్టీలకు చెరొక 40:40 నిష్పత్తిలో ఓట్లు వచ్చినట్లయితే బెంగాల్‌ రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. మమతకు అనుకూలంగా 42:38 నిష్పత్తిలో ఓట్లు వస్తే ఆమె నాయకత్వం గురించి, ప్రశాంత్‌ కిషోర్‌ మైక్రో మేనేజ్‌మెంట్‌ ఘనత గురించి మీడియా విజయగీతాలు మొదలెడతాయి. దీనికి భిన్నంగా బీజేపీకి అనుకూలంగా ఇదే నిష్పత్తిలో ఓట్లు వస్తే మోదీ– అమిత్‌ షా ద్వయం సృష్టించిన మహా కాషాయ దళ ప్రభంజనం గురించి టీవీ స్టూడియోలు చెక్కభజన మొదలెడతాయి.

నూతన రాజకీయ కూటములకు నాంది
మే 2న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేదానితో నిమిత్తం లేకుండానే, పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం మౌలికంగానే రాజకీయ పునరేకీకరణ చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ సాధించిన అసాధారణ విజయం ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. 2011 ఎన్నికల్లో కూడా బీజేపీకి బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో 4.1 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2016లో 10.2 శాతం ఓట్లు సాధించినప్పటికీ బీజేపీకి అదనంగా 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కడం గమనార్హం. అంటే ఇటీవలి కాలం వరకు బెంగాల్‌లో బీజీపీ ఉనికి కనీసమాత్రంగానే కనిపించేది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి నాటకీయంగా మారిపోయింది. బెంగాల్‌లోని 42 ఎంపీ స్థానాలకుగాను 18 సీట్లతో, 40.2 శాతం ఓట్లు కొల్లగొట్టిన బీజేపీ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రజాదరణ కారణంగా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కి ప్రధాన పోటీదారుగా సవాల్‌ చేసే స్థాయికి ఎగబాకింది. స్పష్టంగానే టీఎమ్‌సీ, బీజేపీల మధ్య రాజకీయ స్పర్థ కొంత కాలంపాటు కొనసాగనుంది. కొన్నేళ్ల క్రితం వరకు ఇలాంటిది బెంగాల్‌లో సంభవిస్తుందని ఊహామాత్రంగా కూడా భావించేవారు కాదు.

కొత్త సామాజిక ఏకీకరణ
ఈ పరిస్థితి బెంగాల్‌లో సామాజిక శక్తుల పునరేకీకరణకు చోటు కల్పించింది. ప్రధానంగా వెనుకబడిన ప్రాంతాలు, సామాజిక బృందాలను తన వైపునకు తిప్పుకోవడం ద్వారా బీజేపీ బెంగాల్‌ రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఉత్తర బెంగాల్, పశ్చిమ బెంగాల్‌లోని జంగిల్‌ మహల్‌ లోని వెనుకబడిన ప్రాంతాలలో బీజేపీ ప్రారంభ విజయాలను సాధించింది. దళితులు, ఆదివాసీలు, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన హిందువులు, పట్టణ ప్రాంతాల్లోని హిందీ మాట్లాడే వారిని ఆకర్షిం చడం ద్వారా బీజేపీ బెంగాల్‌లో తనదైన పునాదిని సృష్టించుకుంది. 2019 నుంచి ఈ సెక్షన్లను దాటి బీజేపీ తన పరిధిని విస్తరించుకుంది. ఈసారి అది గ్రామీణ దక్షిణ బెంగాల్‌ కేంద్ర స్థానంలోకి చొచ్చుకుపోయింది. పైగా బెంగాల్‌ మధ్యతరగతి భద్రలోక్‌ ప్రజల్లో కాస్త చోటు సంపాదించుకుంది. చాలాకాలంగా పశ్చిమబెంగాల్‌లో అణ చిపెట్టిన కుల రాజకీయాలను ప్రేరేపించడం ద్వారా బీజేపీ ఈసారి కొత్త తరహా అస్తిత్వ రాజకీయాలను సృష్టించవచ్చు. ఈ తరహా రాజకీయాలకు ఆధారం హిందూ సమీకరణే కావచ్చు. పాపులర్‌ ఓటు ఎక్కడైనా సరే 40 శాతానికి దగ్గరగా వచ్చిందంటే దానర్థం.. రాష్ట్రంలో 70 శాతంగా ఉన్న హిందూ ఓటర్లలో మూడింట రెండు వంతుల మందిని తనవైపునకు తిప్పుకోవడంలో బీజేపీ విజయం సాధించిందనే. 30 శాతం మేరకు ముస్లిం ఓటర్లు ఉన్న రాష్ట్రంలో హిందువులను తారస్థాయిలో సంఘటితం పర్చుకోవలసిన అవసరం బీజేపీకి ఉంది. 1940లలో హిందూ–ముస్లిం హింసకు కేంద్రబిందువుగా ఉన్న మతపరమైన గతంలోకి బెంగాల్‌ మరో సారి వెళ్లిపోనుందని దీనర్థం.

మనీ, మెషిన్‌ సరికొత్త పాత్ర
బెంగాల్‌ రాజకీయాల్లో పార్టీల భుజబల ప్రదర్శనకు ఈసారి డబ్బు, ఎన్నికల యంత్రాంగం తోడై నిలిచాయి. భుజబల ప్రదర్శన బెంగాల్‌ రాజకీయాలకు కొత్త కాదు. 1960లలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య ఘర్షణలు, ఆ తర్వాత కమ్యూనిస్టుల మధ్య అంతర్గత ఘర్షణలలో దీని పునాదులు మనకు కనిపిస్తాయి. తన రాజకీయ ప్రత్యర్థులపై వామపక్ష కూటమి పాలన సాగించిన హింసా ప్రయోగం బహిరంగ రహస్యమే. ఈ వారసత్వాన్ని మమతా బెనర్జీ కొనసాగించడమే కాకుండా మరింత వేగవంతం చేసింది. 2018 పంచాయితీ ఎన్నికల్లో టీఎంసీ నాయకులు సాగించిన మితిమీరిన హింసాకాండ పాలకపార్టీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇప్పుడు వామపక్ష సానుభూతిపరుల్లో బలమైన వర్గం తమ విధేయతను బీజేపీవైపు మళ్లించడంతో బీజేపీ ఇప్పుడు అదే హింసను కొనసాగిస్తోంది. ఇకపోతే, రాష్ట్ర చరిత్రలో ఇంత అత్యధికంగా డబ్బు వెదజల్లిన ఎన్నిక ఇదేనని స్పష్టమవుతోంది. బెంగాల్‌ మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో డబ్బు వెదజల్లుతున్నారు. ఒకసారి ఈ ధోరణి మొదలైందంటే ఇక వెనక్కు పోవడం ఉండదు. పైగా బెంగాల్‌ చరిత్రలో ఎన్నడూ లేనంత పక్షపాత దృష్టిని ఎన్నికల కమిషన్‌ ప్రదర్శించడం గమనార్హం. కేంద్రంలోని అధికార పార్టీకి సహాయపడటంతో ఎన్నికల కమిషన్‌ హద్దులు మీరిపోయింది.

చివరగా ఎన్నికల విషయంలో ప్రొఫెషనల్‌ మేనేజ్‌మెంట్‌ అనేది రాష్ట్ర చరిత్రలో కొత్త మలుపుగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో షాక్‌ తిన్న మమత ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ని ఆహ్వానిం చింది. పీకే టీఎంసీ పార్టీలో సమాంతర వ్యవస్థను సృష్టించారు. కొత్త, పాపులర్‌ విధానాల రూపకల్పనతో పార్టీకి సరికొత్త ఇమేజీ తేవడంలో పీకే టీమ్‌ తోడ్పడింది. ఇది మమతను మూడో సారి కూడా అధికార పీఠంపై నిలబెడుతుందా అనేది చెప్పలేం కానీ, బెంగాల్‌లో రాజకీయ నేతలు, కేడర్లు పాత తరహా ఎన్నికల నిర్వహణవైపు మళ్లడం ఇక అసాధ్యం. 

భారత రాజకీయాల్లో అనేక ధోరణులకు బెంగాల్‌ మినహాయింపుగా ఉండేది. ఇక్కడ పార్టీల మధ్య స్పర్థ విశిష్టంగా ఉండేది. రాజకీయ కేడర్‌ సిద్ధాంతపరమైన భాషలో ప్రచారం సాగించేవారు. కులం, కమ్యూనిటీ, డబ్బు ప్రసక్తి లేకుండా ఎన్నికలు జరిగేవి. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న బెంగాల్‌కి ఈ ఎన్నికలు ముగింపు పలకవచ్చు. బెంగాల్‌ ఒకవైపు, దేశమంతా మరోవైపు అన్నట్లుగా ఉన్న పరిస్థితిని అమెరికన్‌ శైలి రాజకీయ నిర్వహణగా ఈ ఎన్నికలు మార్చివేయవచ్చు.

వ్యాసకర్త: యోగేంద్ర యాదవ్‌
 స్వరాజ్‌ ఇండియా సంస్థాపకులు

మరిన్ని వార్తలు