రైతుకు మద్దతు ధర అసాధ్యమా?

23 Jan, 2021 00:32 IST|Sakshi

విశ్లేషణ

ఎమ్‌ఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సు చేసినట్లుగా కనీస మధ్దతు ధరను ప్రభుత్వం 50 శాతం మేర పెంచినట్లయితే ప్రభుత్వం మీద పడే అదనపు భారం రూ. 2,28,000 కోట్లు అవుతుంది. ఇది మొత్తం జీడీపీలో 1.3 శాతం మాత్రమే. అంటే కేంద్ర బడ్జెట్‌లో 8 శాతం అన్నమాట. ప్రభుత్వం తల్చుకుంటే ఇది అసాధ్యం కాదు. పైగా ఈ అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు పంచుకోగలవు. మరి మనదేశం రైతులకు ఈ మాత్రం చేయలేదా? మన దేశాన్ని, అన్నదాతలను మీరు ఏ దృష్టితో చూస్తున్నారు అనేదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇది మన దేశ రాజకీయ సంకల్పానికి సంబంధించిన ప్రశ్న. దేశంలోని కోట్లాది మంది రైతులు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఇదే.

మన దేశ రైతులకు హామీ ఇచ్చిన మేరకు వారి పంటలకు ప్రోత్సాహక ధరను ఇస్తామని ఎవరైనా ప్రతిపాదించగలరా? ప్రభుత్వం, కొందరు ఆర్థికవేత్తలు, మీడియా కూడా గణాంకాల రీత్యాకానీ, ఆర్థికపరంగా కానీ ఇది అసాధ్యమని మనల్ని నమ్మిం చాలని చూస్తుంటారు. కానీ వారి అంచనాలు తప్పు. రైతులు ఏం డిమాండ్‌ చేస్తున్నారో వారు అర్థం చేసుకోవడం లేదు. లేదా రైతులు పండిస్తున్న పంటలకు అవుతున్న ఖర్చులను వారు లెక్కించడం లేదు. లేదా వారు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తుండాలి. ఈ కల్పనను, భ్రమను చెదరగొట్టే సమయం ఉంది అంటే రిపబ్లిక్‌ డే నాడు దేశ రాజధానిలో లక్షలాది రైతులు జరుపనున్న ర్యాలీకి మించిన సందర్భం మరొకటి ఉండదు.

అదృష్టవశాత్తూ మనం శిధిలాల నుంచి మొదలుపెట్టాల్సిన పనిలేదు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 23 పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పి) ప్రకటిస్తుంటుంది. కాబట్టి సూత్ర రీత్యానే రైతుల పంటలకు కనీస ధర అవసరమని దానికి వారు అర్హులని భారత ప్రభుత్వమే గుర్తిస్తోందన్నమాట. అది ఎంత లోపభూయిష్టంగా లేదా వివాదాస్పదంగా ఉండినా సరే రైతుల పంటకు ధరను లెక్కించే, ప్రకటించే ఒక యంత్రాంగం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నమాట. పైగా చట్టపరంగా కాకున్నా, పంటల ధరల రూపంలో  తాను మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కేంద్రం గుర్తిస్తోందన్నమాటే.

సమస్య ఏమిటంటే ఈ మద్దతుని ఇచ్చే విషయంలో కేంద్రప్రభుత్వం తనవంతుగా చేస్తున్నది పెద్దగా లేదనే చెప్పాలి. నిజానికి దేశంలో అయిదింట ఒక వంతుకంటే తక్కువమంది రైతులు మాత్రమే కేంద్రం నుంచి ఈ మద్దతు పొందుతున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో  రెండు లేదా మూడు పంటలకు మాత్రమే ప్రభుత్వం మద్దతును ఇస్తోంది. మరోవైపున చాలామంది రైతులకు భద్రత కల్పించే కనీస మద్దతు ధర అనేది వారి కలలకు మాత్రమే పరిమితం అవుతోంది. ప్రస్తుత పంట సీజన్‌లో మొక్కజొన్నపంటను చూస్తే క్వింటాలుకు రూ. 1,850లు కనీస మద్దతు ధరను కేంద్రం ప్రతిపాదించింది. అయితే గత మూడు నెలలుగా రైతులు మొక్కజొన్న పంటను రూ. 1,100 నుంచి రూ. 1,300లకు మాత్రమే అమ్ముకోగలిగారు.

ఇక దేశంలోనే రాగులు ఎక్కువగా పండించే రాజస్తాన్‌లో దాని కనీస ధర జనవరిలో రూ. 1340లు మాత్రమే పలికింది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ. 2,150లు. ఇక మినుములు, పెసలు వంటి తృణధాన్యాల ధరల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర అని స్వయంగా ప్రకటించిన మొత్తాన్నయినా తమకు కచ్చితంగా దక్కేలా చూడాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కనీస మద్దతుధరకు తప్పనిసరిగా హామీ ఇచ్చేలా ఇప్పుడు ఒక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఇది సాధ్యమేనా? ముందుగా మద్దతు ధర అంటే ఏమిటి అనే విషయంలో ప్రచారంలో ఉన్న తప్పుడు భావనను సరిచేద్దాం. హామీ ఇచ్చిన మేరకు కనీస మద్దతు ధర అంటే ప్రతి క్వింటాల్‌ పంటనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కాదు. ఇది అసాధ్యం, ప్రభుత్వం భరించలేని డిమాండ్‌ ఇది. పైగా అది అనవసరం కూడా. కనీసమద్దతు ధర వద్ద ప్రభుత్వం సేకరిస్తున్న పంటల సంఖ్య ప్రస్తుత స్థాయినుంచి బాగా పెరగాల్సి ఉంది. రైతులకు మద్దతుగా నిలిచే అనేక యంత్రాం గాల్లో కనీస మద్దతు ధర ఒకటి మాత్రమే. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం సేకరించే ఆహార ధాన్యాల జాబితాను చిరుధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలకు కూడా విస్తరించాలి. ఈ ఒక్క చర్య చేపట్టినా చాలు దేశంలోని కోట్లాది కుటుంబాల పోషకాహర అవసరం తీరుతుంది. దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగమైన 75 కోట్లమందికి ఒక్కొక్క కిలో మినుములు లేదా కాయధాన్యాలను ఇవ్వగలిగితే ఏటా పండిస్తున్న కోటీ 30 లక్షల టన్నుల కాయధాన్యాల పంటలకు ఎంతో డిమాండ్‌ ఏర్పడుతుంది. దీనివల్ల కాయధాన్యాల ఉత్పత్తికి ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది.

ఇక రెండో యంత్రాంగం ఏమిటంటే, కనీస మద్దతు ధరకంటే తక్కువకు మార్కెట్‌ ధరలు పడిపోయిన ప్రతిసారీ సకాలంలో, వేగంగా ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడమే. మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ వంటి ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఏజెన్సీలలో మెరుగైన ఫండింగ్, నిల్వ, మార్కెటింగ్‌ సామర్థ్యాలను మరింతగా విస్తరింపజేయాలని దీనర్థం. ఇవన్నీ కలిసి మొత్తం పంటలో 10 నుంచి 20 శాతం భాగాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మాత్రం సహాయం చేసినా, ఇతర మార్కెట్లో రైతుల పంటకు గిట్టుబాటు ధరలు కాస్త లభించే అవకాశం ఉంటుంది. అలాంటి పథకం ఉనికిలో ఉన్నట్లయితే ఆ పథకానికి వెచ్చించే నిధులను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. దీంట్లో విఫలమైనట్లయితే, ప్రభుత్వం లోటు చెల్లింపు ద్వారా ముడో యంత్రాంగాన్ని ఉపయోగించగలదు. కనీస మద్దతుధరకు, వాస్తవంగా రైతుల నుంచి సేకరిస్తున్న మొత్తానికి మధ్య వ్యత్యాసాన్ని రైతులకు నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం భవాంతర్‌ పథకం పేరుతో మధ్యప్రదేశ్‌లో గతంలోనే ప్రయత్నిం చారు. అయితే పేలవమైన రూపకల్పన కారణంగా ఆ ప్రయోగం విఫలమైంది. ఈ పథకాన్ని మళ్లీ కొత్తగా రూపొందించి తగిన నిధులు కేటాయించి కేంద్రప్రభుత్వం అమలు చేయడానికి పూనుకోవాలి.

ఇక నాలుగో యంత్రాంగం ఏమిటంటే కనీస మద్దతు ధరకన్నా తక్కువకు వ్యాపారులు కొనడాన్ని చట్టవిరుద్ధంగా ప్రభుత్వం ప్రకటించాలి. అయితే ఇది అనుకున్న వెంటనే కుదిరే పరిష్కారంలాంటిది కాదు. మొదటి మూడు యంత్రాంగాలు మద్దతు ఇవ్వకపోతే చివరిదైన నాలుగో యంత్రాంగం కుప్పకూలిపోతుంది. నాలుగో యంత్రాంగాన్ని ఉల్లంఘించేవారిపై చట్టపరమైన నిబంధనలు అమలు చేసినప్పుడే మార్కెట్‌ అధికారులు ఈ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలు కలుగుతుంది. చివరకు ఇది కేంద్ర ప్రభుత్వం భరించగలిగినదేనా? కనీస మద్దతు ధర విషయంలో ఈ ఒక్క మార్పు చేసినట్లయితే కేంద్రంపై 17 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందని ప్రభుత్వ ప్రతినిధులు సన్నాయి నొక్కులు మొదలెడుతున్నారు. ఇది కేంద్ర బడ్జెట్‌లో సగానికంటే ఎక్కువేనని వీరి భావం. అయితే ఇది వాస్తవాన్ని ఏమార్చే సంఖ్య. కనీస మద్దతు ధర వద్ద దేశంలోని అన్ని రకాల పంటలను ప్రభుత్వం కొనుగోలుచేస్తే దానికయ్యే మొత్తం ఖర్చు ఇది. ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వం పంట లను కొంటే దాన్ని హిందూ మహాసముద్రంలో విసిరిపారేయడం తప్ప మరేమీ చేయలేరు. వాస్తవానికి కొనుగోలు చేస్తున్న పంటలకు ఈ తరహా లెక్కలు అసలు విలువను ఇవ్వడం లేదు.

మరోవైపున నిజమైన అంచనా కోసం, మనం కనీస మద్దతు ధరకు, సగటు వాస్తవ మార్కెట్‌ ధరకు మధ్య వ్యత్యాసాన్ని లెక్కిం చాల్సి ఉంటుంది. సగటు మార్కెట్‌ ధరను, మార్కెట్లో రోజువారీ ధరలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా లెక్కించినప్పుడు రోజువారీ కొనుగోళ్లలో రైతు పంటలకు ఎంత ధర వస్తుందన్నది తేలిపోతుంది. ఉదాహరణకు 2017–18 సంవత్సరానికి మొక్క జొన్న పంటకు కనీస మద్దతు ధరను రూ. 1,425లుగా నిర్ణయించారు. కానీ మార్కెట్లో సగటున రూ. 1,159లు మాత్రమే పలికింది. ఆ సంవత్సరం అంచనా వేసిన మార్కెట్లోకి వచ్చిన అదనపు ఉత్పత్తితో పోలిస్తే, రైతులు అదనంగా పొందిన పంట నష్టం రూ.6,727 కోట్లుగా తేలింది. మొత్తం 13 పంటల్లో 10 పంటలకు సగటు మార్కెట్‌ ధర కనీస మద్దతు ధరకంటే తక్కువగా నమోదైంది. 2017–18 సంవత్సరానికి మొత్తం 13 పంటలకు గాను రైతులు నష్టపోయిన ధరల లోటుకు ప్రభుత్వంపై పడే అదనపు భారం రూ. 47,764 కోట్లు మాత్రమే. మరో పది చిన్న పంటల బిల్లును కూడా దీనికి కలిపితే అయ్యే మొత్తం రూ. 50 వేల కోట్లు మాత్రమే. ఇది ఆ సంవత్సరం జాతీయ పనికి ఆహార పథకం కింద వెచ్చించిన ఖర్చు కంటే తక్కువే మరి. అయితే మార్కెట్లో జోక్యం చేసుకోవడం, తక్కువ ధరలకు కొంటే చట్ట పరంగా చర్యలు తీసుకోవడం అనేవి సమర్థంగా అమలైతే ప్రభుత్వంపై పడే అదనపు భారం తక్కువే.

ఎమ్‌ఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సు చేసినట్లుగా కనీస మధ్దతు ధరను ప్రభుత్వం 50 శాతం మేర పెంచినట్లయితే ప్రభుత్వం మీద పడే అదనపు భారం రూ. 2,28,000 కోట్లు అవుతుంది. ఇది మొత్తం జీడీపీలో 1.3 శాతం మాత్రమే. అంటే కేంద్ర బడ్జెట్‌లో 8 శాతం అన్నమాట. ప్రభుత్వం తల్చుకుంటే ఇది అసాధ్యం కాదు. పైగా ఈ అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు పంచుకోగలవు. మరి మనదేశం రైతులకు ఈ మాత్రం చేయలేదా? మన దేశాన్ని, అన్నదాతలను మీరు ఏ దృష్టితో చూస్తున్నారు అనేదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇది మన దేశ రాజకీయ సంకల్పానికి సంబంధించిన ప్రశ్న. దేశంలోని కోట్లాది మంది రైతులు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఇదే.

వ్యాసకర్తలు
యోగేంద్ర యాదవ్‌ (కిసాన్‌ స్వరాజ్‌)
కిరణ్‌ కుమార్‌ విస్సా (రైతు స్వరాజ్య వేదిక) 

మరిన్ని వార్తలు