రైతు ఉద్యమం భావి దార్శనికతా పత్రం

18 Feb, 2021 00:41 IST|Sakshi

విశ్లేషణ

వ్యవసాయంపై సంవత్సరాలుగా అకడమిక్, రాజకీయ స్థాయిల్లో సాగిస్తూ వచ్చిన చర్చలు సాధించలేని ఫలితాన్ని రైతు ఉద్యమం సాధించింది. రైతుల మీదికి మీరు కత్తి ఝళిపించలేరని ఈ ఉద్యమం చాటి చెప్పింది. యూరప్, ఉత్తర అమెరికా జనాభాకు ఎన్నో రెట్లు మించిన జనాభాకు మన వ్యవసాయం ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలి. గ్రామీణ భారతం జాతీయ భవిష్యత్తుకు కీలకమైనది. భారత రైతాంగంపై నమ్మకాన్ని ప్రోది చేసే ఒక తీర్మానం చాలు.. వ్యవసాయ విధాన రూపకల్పనలో ఒక సరికొత్త పంథాను అది ఆవిష్కరిస్తుంది. ఈ రాజకీయ సంకల్పాన్ని సృష్టించి పెట్టడమే.. ప్రస్తుత రైతు ఉద్యమం విజయానికి నిజమైన కొలబద్ద అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రైతు ఉద్యమం భారత భావి దార్శనికతా పత్రం.

కేంద్ర ప్రభుత్వ సాగుచట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత డిమాండుతో భారతీయ రైతాంగం గత రెండున్నర నెలలుగా సాగిస్తున్న చారిత్రక ఉద్యమం.. భవిష్యత్తుకు ఒక దార్శనికతను ఏర్పర్చింది. రైతులకూ, వ్యవసాయానికే కాకుండా గ్రామీణ భారతానికి, నిజానికి భారత భవిష్యత్తుకు కూడా ఈ ఉద్యమం ఒక విజన్‌ని నిర్దేశిస్తోంది. రైతాంగ ఉద్యమం ఇప్పటికే చరిత్ర సృష్టించింది. రైతులను ఒక్కసారిగా ఇది జాతీయ ప్రాధాన్యతలోకి తీసుకొచ్చింది. ఉద్యమం ఉనికిలో లేదని మీరు నటించవచ్చు. కాని వాస్తవానికి మన రాజకీయ వర్గానికి దేవుడి మీద భయంకంటే ఎక్కువగా ఓటు మీద భయాన్ని ఈ ఉద్యమం సమర్థవంతంగా కలిగించిందనే చెప్పాలి. రైతుల మీదికి మీరు కత్తి ఝళి పించలేరని ఈ ఉద్యమం చాటి చెప్పింది. అధికారంలో ఉన్నవారు తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలను మరీ తెలివిగా సమర్థిస్తున్న మార్కెట్‌ మౌలికవాదుల నోళ్లు మూయించిందీ ఉద్యమం. మార్కెట్‌ అనుకూల పండితులు ప్రబోధించే.. సంస్కరణలను వేగంగా అమలు చేయాలనే భాషను ఇకపై కార్పొరేట్‌ దగాకోర్లు మునుపటిలా ఉచ్చరించలేరు. కనీసం కొంతకాలమైనా ఈ పరిస్థితి కొనసాగుతుంది. 

అయితే రైతాంగ ఉద్యమం సాధించిన విజయం ఊహలకే పరి మితం అవుతుందంటే అంతకు మించిన విషాదం మరొకటి లేదు. వ్యవసాయ సంస్కరణలను విజయవంతంగా నిలిపివేయటమనేది ప్రస్తుత యథాతథ స్థితిని కొనసాగించేందుకు మాత్రమే పరిమితమైతే అదే పెద్ద విషాదమవుతుంది. కార్పొరేట్‌ వ్యవసాయ వాణిజ్య విధానాన్ని వెనక్కు నెట్టివేయడం అనేది రైతుల్లో ట్రేడ్‌ యూనియన్‌ తత్వాన్ని మాత్రమే ముందుకు తీసుకువస్తే అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు భారతీయ రైతులు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న పలువిధాల సంక్షోభాన్ని జాతి ముందుకు తీసుకొచ్చాయి. ఈ చట్టాలు భారతీయ రైతులు అనుభవిస్తున్న వ్యథలకు నాందీవాచకం మాత్రం కాదు. అలాగని సాగుచట్టాల రద్దు అనేది రైతుల అవసరాలను తీర్చే వరం కూడా కాదు. భారత్‌ భవిష్యత్తుకు గుండెకాయ రైతులే అనే భావనను ఈ మహోద్యమం మరింత ముందుకు తీసుకుపోయింది.

భారతీయ వ్యవసాయం మూడు పరస్పరాధారిత సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం వ్యవసాయరంగంలో ఆర్థిక సంక్షోభంపై అందరూ దృష్టి పెడుతున్నప్పటికీ, మనందరినీ భయపెడుతున్న పర్యావరణ సంక్షోభాన్ని మర్చిపోకూడదు. ఈ రెండు సంక్షోభాలు కలిసి రైతులను మనుగడ సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఈ మూడు సంక్షోభాలను ఏకకాలంలో పరిష్కరించగల కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం రైతులకు ఇప్పుడు చాలా అవసరం. ఈ కొత్త ఒప్పందాన్ని రూపొందించడానికి మన ఆదర్శాలు, విధానాలు, రాజకీయాలు కలిసి ముందుకు రావల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఆర్థిక సంక్షోభాన్ని సులువుగానే వర్ణించవచ్చు. దాదాపుగా మన జనాభాలో సగం వరకు (58 శాతం గ్రామీణ రైతు కుటుంబాలు) వ్యవసాయంలో మునిగితేలుతున్నప్పటికీ వ్యవసాయం ఆర్థికంగా చెల్లుబాటు కావడం లేదు. 86 శాతం రైతులు 5 ఎకరాల కంటే తక్కువ భూములను కలిగి ఉన్నారు. తలసరి దిగుబడి చాలా తక్కువ. పైగా పంట చేతికి రావడం కూడా అనిశ్చితంగానే ఉంటుంది. పంటలకు ధరలు చాలా తక్కువ. వ్యవస్థాగతంగానే ఇలా తగ్గిస్తూ వస్తున్నారు. రైతుల అన్ని రకాల ఆదాయ మార్గాలను కలిపి చూస్తే వారి సగటు నెల ఆదాయం రూ. 8 వేలకు మించడం లేదు. రైతు కుటుంబాల్లో సగం కంటే ఎక్కువగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు.

ఇప్పుడు మన ఆర్థిక వేత్తలు చెబుతున్నదేమిటంటే వ్యవసాయంపై ఆధారపడుతున్న జనాభాను తగ్గించాలనే. అయితే వ్యవసాయరంగం నుంచి తప్పించిన ఈ అదనపు జనాభాను ఏ ఖండానికి తరలించాలి అనే విషయం మాత్రం వీరు మర్చిపోతారు. లేదా ఇప్పటికే దేశం మొత్తంగా నిరుద్యోగం తాండవిస్తున్న నేపథ్యాన్ని పక్కనబెట్టి మన ఆర్థిక వ్యవస్థ లక్షలాది అదనపు ఉద్యోగాలకోసం వేచి ఉంటోం దని ప్రగల్భాలు పలుకుతుంటారు. కష్టపడి పనిచేసేవారికి గౌరవప్రదమైన ఆదాయాన్ని ఎక్కడ వెదుక్కోవాలి అనేదే అసలు సమస్య. మరోవైపున పర్యావరణ సంక్షోభాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. హరిత విప్లవం ఒక ముగింపుకొచ్చేసింది. సేంద్రియ వ్యవసాయం అద్బుతం గురించి, నీటి అధిక వినియోగంపై మనలో బలపడిపోయిన గుడ్డి విశ్వాసం వల్ల భీతిల్లే స్థాయిలో నేల సారం కోల్పోయి, భూగర్భ జలం దిగజారిపోతూ ఉంది. దీనికి జీవవైవిధ్య క్షీణత, విభిన్న రకాల విత్తనాలు తగ్గిపోవడం, జొన్నలు వంటి చిరుధాన్యాల పంటలు తగ్గిపోవడం, కూలీలను, పశుసంపదను కోల్పోవడం, అడవుల నిర్మూలన వంటివి పరిశీలిస్తే పర్యావరణ సంక్షోభం కొంతమంది పర్యావరణవాదులు ఆడే జూద క్రీడ కాదని అర్థమవుతుంది.

ఇప్పుడు వాతావరణ మార్పు అనే సరికొత్త సవాలు గురించి ఆలోచిద్దాం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చితంగా వస్తున్న వర్షరుతువు కారణంగా భారత వ్యవసాయం విధ్వంసం వైపు సాగిపోతోంది. వాతావరణ మార్పు ప్రభావం వల్లే మెట్టప్రాంతాల రైతుల ఆదాయాలు దారుణంగా పడిపోతున్నాయి. చివరగా రైతులు తమ ఉనికికి సంబంధించిన సంక్షోభంపట్ల స్పందించాల్సి ఉంది. గత రెండు దశాబ్దాల్లో 3.5 లక్షల మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. జాతీయ ఆర్థిక వ్యవస్థలో రైతు స్థానం క్షీణించిపోవడం, రైతుల స్థాయి రానురాను పడిపోవడం వారి గౌరవానికి భంగం కలిగిస్తోంది. రైతు రోజుకూలీగా మారిపోవడం, త్వరలోనే వలస కార్మికుడిగా ఆవతారమెత్తడం వంటి కారణాలతో తమ తదుపరి తరం వ్యవసాయాన్ని చేపట్టకూడదని భావించేలా చేస్తున్నాయి.

నేడు రైతు ఉద్యమ లక్ష్యం కేవలం మూడు సాగుచట్టాల ప్రమాదాన్ని తప్పించుకోవడం లేదా కొన్ని ఆర్థిక లాభాలను రైతులపరం చేయడానికి మాత్రమే పరిమితమై లేదు. భారత వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఆర్థిక, పర్యావరణ, మనుగడ సంక్షోభాలను ఎలా అరికట్టాలనే దిశగానే ప్రస్తుత ఉద్యమం పయనించగలగాలి. దీని కోసం ఒక ఊహాత్మకమైన ముందజ వేయడం ఎంతైనా అవసరం. భారతీయ వ్యవసాయం భారతీయ పంధాలోనే సాగుతుంది. భారతీయ రైతులు గతం తాలూకా శిథిలాలు కాదు. వారు ఇక్కడ ఉండి జీవించగలగాలి. యూరప్, ఉత్తర అమెరికా జనాభాకు ఎన్నో రెట్లు మించిన జనాభాకు మన వ్యవసాయం ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలి. అందిస్తుంది కూడా. జ్ఞానం, టెక్నాలజీలను ఒడిసిపట్టడంలో భారత రైతులకు సాటి లేదు. భారతీయ గ్రామం చరిత్ర పెంట కుప్ప కాదు. గ్రామీణ భారతం అనేక అవకాశాల గడ్డ. మన జాతీయ భవిష్యత్తుకు అది కీలకమైనది.

భారత రైతాంగంపై, వ్యవసాయరంగంపై నమ్మకాన్ని ప్రోది చేసే ఒక తీర్మానం చాలు.. వ్యవసాయ విధాన రూపకల్పనలో ఒక సరికొత్త పంథాను అది ఆవిష్కరిస్తుంది. దీనికి ప్రభుత్వం తన వంతుగా వ్యవసాయానికి మరింత అదనంగా బడ్జెట్‌లో కేటాయించాలి. వ్యవసాయ రంగానికి ఇంతవరకు ఇస్తున్న సబ్సిడీలు చాలా తక్కువ కావడంతో రైతులకు భవిష్యత్తులో సబ్సిడీలు పెంచాలి. సార్వత్రిక పంటల బీమా, రుణ  ఉపశమనం, పునర్మిర్మాణం వంటి సమగ్ర చర్యలపైపు మన వనరులను మళ్లించాలి. వ్యవసాయంలో ప్రైవేట్‌ చొరవ మరింత అవసరమే కానీ అది ప్రభుత్వ మద్దతు, చొరవ కంటే తక్కువగా ఉండాలి.బడ్జెట్‌లో మరో 3 లేదా 4 లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి మళ్లిస్తే గ్రామీణ భారత్‌ కోసం ఒక సరికొత్త డీల్‌ సాకారమైనట్లే. జాతి మొత్తంగా దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇది మన రాజ కీయ నాయకత్వ సంకల్పానికి సంబంధించిన ప్రశ్న. ఈ రాజకీయ సంకల్పాన్ని సృష్టించి పెట్టడమే.. ప్రస్తుత రైతు ఉద్యమం విజయానికి నిజమైన కొలబద్ద అవుతుంది.


యోగేంద్ర యాదవ్‌
స్వరాజ్‌ ఇండియా సంస్థాపకులు‌

మరిన్ని వార్తలు