YS Jagan: బడుగుల హృదయాల్లో శాశ్వత స్థానం

17 Aug, 2021 12:39 IST|Sakshi

సామాజిక విప్లవాలు కేవలం నినాదాలు, డిమాండ్లు, డిక్లరేషన్లలతో ఉద్భవించవని.. పాలకుడి చిత్తశుద్ధితోనే సాధ్యం అవుతాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి తాజాగా రుజువు పరిచారు. సుదీర్ఘకసరత్తు చేసి అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం 135 రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్‌ పదవులను,  ఇతర కీలక పదవులను భర్తీ చేసి అందులో 57% పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని నియమించడం ద్వారా ఓ నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని ఓ గొప్ప సామాజిక విప్లవానికి అంకురార్పణ చేశారు. ఈ గౌరవాభి మానాలకు బడుగువర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆనందంతో వారు సంబరాలు జరుపుకున్నారు.

అయితే, సామాజిక న్యాయానికి నిజమైన అర్థం తెలియని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయనకు వంత పాడుతున్న కొన్ని మీడియా సంస్థలు.. ఇందులో కూడా మంచిని గ్రహించలేకపోయాయి. కువిమర్శలకు పాల్పడ్డారు. నిధులు లేని కార్పొరేషన్లను బలహీనవర్గాలకిచ్చారని సత్యదూర ప్రచారం చేశారు. 2007లో టీడీపీ అధినేత చంద్రబాబు వరంగల్‌లో బీసీల సదస్సు నిర్వహించి.. 2009 సాధారణ ఎన్నికలలో తమ పార్టీ తరఫున బీసీలకు 100 టికెట్లు ఇస్తామని ఓ డిక్లరేషన్‌ ప్రకటించారు. బీసీల్లో పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించారు. ఆ వర్గాలను తన చుట్టూ తిప్పుకొన్నారు. తీరా ఎన్నికలొచ్చేసరికి.. తన సహజ ప్రవత్తిని చాటుకొంటూ బీసీలకు మొండిచేయి చూపించారు. బీసీలకు కనీసం 60 పార్టీ టిక్కెట్లు కూడా ఇవ్వలేదు. పైగా, 100 సీట్లు బీసీలకు ఇస్తే వారు గెలవలేరంటూ ఓ కుంటి సాకు చెప్పారు. మాట తప్పినందుకు చంద్రబాబు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. బీసీలకు క్షమాపణ చెప్పలేదు.

ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు, విభజిత రాష్ట్రంలో 5 ఏళ్లు.. మొత్తం 14 ఏళ్లపాటు అధికారం అనుభవించిన చంద్రబాబు ఏనాడూ సమాజంలో దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురౌతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రభుత్వంలో సముచిత భాగస్వామ్యం కల్పించిన దాఖలాలులేవు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన క్యాబినెట్‌లో దాదాపు 4 ఏళ్లకుపైగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు భాగస్వామ్యం కల్పించకుండా అవమాన పరి చారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్‌ పదవులను భర్తీచేస్తే అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకు భాగస్వామ్యం కల్పించాల్సి వస్తుందనే దుర్బుద్ధితో.. అనేక పదవులను భర్తీ చేయకుండా ఖాళీగా వదిలేశారు. 

బడుగులకు సముచిత భాగస్వామ్యం 
వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండగానే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ‘బీసీ డిక్లరేషన్‌’ ప్రకటించారు. అధికారంలోకి వస్తే వివిధ బీసీ వర్గాలకు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ‘నవరత్నాలు’గా పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. బలహీన వర్గాలకు సముచిత రాజకీయ భాగస్వామ్యం కల్పించడానికి 2019 ఎన్నికలలో 175 అసెంబ్లీ స్థానాలలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన వాటిల్లో 41 సీట్లు బీసీ వర్గాలకు కేటాయించారు. ఎన్నికల సమయంలోనే రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్‌ పదవులలో 50% బలహీన వర్గాలకు కేటాయిస్తామని చెప్పారు. నామినేటెడ్‌ పదవులలో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది.

బీసీవర్గాలకు గతంలో రాష్ట్ర స్థాయిలో ఒకే ఒక కార్పొరేషన్‌ ఉంటే.. వైఎస్‌ జగన్‌ తొలిదశలో 57 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వాటన్నింటికి పాలకవర్గాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పాలకవర్గాల కూర్పులో 50 శాతం రిజర్వేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు దాదాపు 1.80 లక్షల మంది ఉండగా అందులో 80 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారితోనే భర్తీ చేశారు. నేతన్నలు, మత్స్యకారులు, నాయిబ్రాహ్మణులు, యాదవులు, విశ్వబ్రాహ్మణులు, వడ్రంగులు.. ఇలా ప్రతి బడుగు వర్గానికి ప్రత్యేక పథకాలు ఏర్పరిచి వారిని ఆర్థికంగా, సామాజికంగా ఆదుకొంటున్నారు. 

బీసీలను హేళన చేసిన చంద్రబాబు
అమరావతి ప్రాంతంలో పేదలైన బహుజన వర్గాలవారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అక్కడి సామాజిక జీవనంలో సమతుల్యత దెబ్బతింటుందని.. సంపన్నులు నివాసం ఉండేచోట బహుజనులు ఉండరాదన్న ఫ్యూడల్‌ మనస్తత్వంతో.. స్వయంగా జీవో జారీచేసిన దారుణ చరిత్ర చంద్రబాబుది. ‘న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారు’ అంటూ సుప్రీంకోర్టుకు అధికార హోదాలో చంద్రబాబు లేఖలు రాసిన సంఘటనను ‘ది ఎకనమిక్స్‌ టైమ్స్‌’ అనే జాతీయ పత్రిక బయటపెట్టింది. చంద్రబాబులో పడగవిప్పిన అగ్రకుల దురంహంకారం బీసీలను ఎంతో బాధించింది. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు చంద్రబాబును ఎన్నటికీ క్షమించబోమని వారు ఆనాడే శపథం చేశారు. ఇక, తమ సమస్యలను చెప్పుకోవడానికి సచివాలయానికి వెళ్లిన పేద బీసీ కుల వృత్తులవారిని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వేలు చూపిస్తూ బెదిరించిన సంఘటన మరో చీకటి అధ్యాయం. 

అధికారంలో ఉన్నప్పుడు అడుగడుగునా కుల, ప్రాంత, ఆర్థిక వివక్షను చూపించిన చంద్రబాబును బీసీలు ఇకపై ఎందుకు నమ్మాలి? నమ్మించి గొంతు కోసినందుకా? రాజ్యసభ పదవులను ఎస్సీ నేతలకు ఇస్తానని చెప్పి చివరి క్షణం వరకు ఊరించి.. సొంత వారికి ఇచ్చుకున్న చంద్రబాబును ఎస్సీలు ఇకపై నమ్ముతారా? క్రిందటేదాడి 4 రాజ్యసభ సీట్లు ఖాళీకాగా సీఎం జగన్‌ అందులో రెండింటిని పార్టీలోని సీనియర్‌ బీసీ నేతలకు ఇచ్చారు. ఇది సామాజిక న్యాయం చేయడం కాదా?  

గతాన్ని మరింత తవ్వితే చంద్రబాబు చేసిన తప్పులు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారికి న్యాయంగా దక్కాల్సిన ఫలాలను ఏవిధంగా అందకుండా చేశారో బయటపడతాయి. మరోపక్క అవకాశం వచ్చినప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ వర్గాల వారి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా చంద్రబాబు, టీడీపీ నాయకులు సామాజిక న్యాయానికి కట్టుబడిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారాన్ని సాగించినంత మాత్రాన ప్రజలకు నిజాలు తెలియకుండాపోతాయా? 


- డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 

వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి

మరిన్ని వార్తలు