జనం వైపు జగన్‌ అడుగులు

9 Jan, 2021 07:59 IST|Sakshi

జనం గుండె చప్పుడు వింటూ.. దగా పడ్డ ప్రజల కన్నీళ్లు తుడుస్తూ.. నేటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి నేటికి రెండేళ్లు. తెలుగుదేశం కర్కశ పాలనలో బరువెక్కిన హృదయ ఘోష వింటానంటూ.. పేదల పక్షాన నేనున్నానంటూ వైఎస్‌ జగన్‌ 2017 నవంబర్‌ 6వ తేదీన వరుణ దేవుడు ఆశీర్వదించగా ఇడుపులపాయ నుంచి తొలి అడుగు వేశారు. అవ్వాతాతల ఆశీస్సులు.. అమ్మల దీవెనలు, అన్నార్తుల ఆశీర్వాదాలే కొండంత అండగా ప్రజా క్షేత్రంలోకి పాదయాత్ర ద్వారా దూసుకెళ్లారు. టీడీపీ ప్రజా కంఠక పాలనలో ప్రజల సమస్యలే జగన్‌కు స్వాగత తోరణాలయ్యాయి. ఊరూరా బతుకు భారమైన పేదల ఆవేదనలు, కంట తడి పెట్టించిన సన్నివేశాలు, ప్రజల దీన పరిస్థితుల మధ్య సరిగ్గా 2019 జనవరి 9న జగన్‌ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించారు. ‘మీ కష్టాలన్నీ విన్నాను.. నేనున్నాను..’ అంటూ జగన్‌ చెప్పిన ఒక్కమాట చితికిపోయిన రాష్ట్ర ప్రజలకు కొండంత గుండె ధైర్యాన్నిచ్చింది. 

అడుగడుగున ఆవేదనలే..
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకొచ్చిన టీడీపీ అరాచకాలకు అంతులేకుండా ఉండేది. కటిక పేదవాడైనా పైసలిస్తే తప్ప పనులు జరగని చీకటి పాలన అది. పెన్షన్ల కోసం పడిగాపులు గాసే అవ్వా తాతల గోడు వినే నాధుడే లేడు. బువ్వపెట్టే రైతన్న పురుగుల మందు తాగే దయనీయ స్థితి. పెన్షన్‌కు లంచం... రేషన్‌ కార్డుకు లంచం.. ఇంటి స్థలానికి లంచం.. జన్మభూమి కమిటీల పేరుతో పచ్చ చొక్కా రాయుళ్ల అరాచకమే ఆనాటి పాలనగా సాగింది. అసెంబ్లీలో నిలదీసిన విపక్ష నేతపై టీడీపీ ఎమ్మెల్యేల దిగజారుడు మాటల దాడి. విపక్ష నేత గొంతునొక్కి వ్యవస్థలను ఖూనీ చేసిన దారుణమైన స్థితి. సంతలో బజారు సరుకుగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనేసిన టీడీపీ అవినీతి పాలనను జనం అసహ్యించుకునే రోజులవి. ఈ తరుణంలో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత వైఎస్‌ జగన్‌ తన భుజస్కంధాలకెత్తుకున్నారు. నేనున్నానంటూ జనం మధ్యకు వెళ్లారు.

జనం మధ్యే ఆవాసం..
ఒకటి కాదు.. రెండు కాదు... 3,648 కిలోమీటర్లు సాగింది జగన్‌ పాదయాత్ర. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆయన ప్రజల్లోనే ఉన్నారు. మండువేసవి.. కుండపోత వర్షాలు.. ఎముకలు కొరికే చలి.. మూడు కాలాల్లో.. ప్రతికూల పరిస్థితుల్లోనూ జనంతోనే ఉండి జననేత అన్పించుకున్నారు. తమ కోసం తరలి వచ్చిన జగన్‌ను ప్రజలూ ఆ స్థాయిలోనే ఆదరించారు. ఊరూరా ముగ్గులేశారు. ఊరంతా సంబరాలు చేసుకున్నారు. 70 ఏళ్లకు పైబడిన అవ్వాతాతలు సైతం పొన్నుగర్ర పట్టుకుని తరలివచ్చి జననేతకు తమ దీన గాథలు చెప్పుకున్నారు. కూడులేక, గూడులేక, పిల్లలను చదివించే దిక్కులేక అవస్థలు పడే ప్రతీ అక్క, చెల్లెమ్మ.. పాదయాత్రకు తరలివచ్చారు. బతుకే భారమైన ప్రతి ఒక్కరి హృదయ ఘోషను ఆయన విన్నారు. ‘మన ప్రభుత్వం వస్తుంది.. ఓపిక పట్టండి.. అన్నీ నేను పరిష్కరిస్తాను’ అంటూ ఇచ్చిన భరోసా పేదవాడికి ఎంతో ఆనందాన్నిచ్చింది. 

విన్నాడు.. చేస్తున్నాడు..
తుది ఘట్టానికి చేరిన పాదయాత్రలో జననేత ఏం చెబుతాడనే ఉత్కంఠతో రాష్ట్రం నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. ఇచ్ఛాపురం ఆ రోజు జన సంద్రమైంది. అనుకున్నట్టే ఆ రోజు జననేత జగన్‌ తన ఉద్విగ్న ప్రసంగంలో అంధకారమైన రాష్ట్ర భవితవ్యాన్ని ఆవిష్కరించారు. తానొస్తే పేదవాడి కన్నీళ్లు తుడుస్తానని భరోసా ఇచ్చారు. ఫలితంగా 175 అసెంబ్లీ స్థానాలకు 151... 25 పార్లమెంట్‌ స్థానాలకు 22 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీతో అధికారంలోకొచ్చారు. మాట తప్పని, మడమ తిప్పని వైఎస్‌ వారసుడిగా, ఇచ్ఛాపురం సాక్షిగా చేసిన ప్రతిజ్ఞను ముఖ్యమంత్రిగా నెరవేర్చారు. మేనిఫెస్టోనే ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి ప్రతీ ఒక్కరి సంక్షేమానికి బాటలు వేశారు. మేడిపట్టిన నాడే రైతన్నకు మేలు చేస్తానన్న హామీ నిలబెట్టారు. పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లోకి డబ్బులేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆరోగ్యశ్రీ ఇప్పుడు పేదవాడికి బీమా కల్పించే అస్త్రమైంది. చదువుకునే చెల్లెళ్లు, తమ్ముళ్ల ఫీజు కడుతూ యువత మనసులో ‘జగనన్న’గా చెరగని ముద్ర వేసుకున్నారు. 

పాదయాత్రలో మైలు రాళ్లు ఎన్నెన్నో..

  • 13 జిల్లాల మీదుగా, 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 2,516 గ్రామాలను తాకుతూ ప్రజా సంకల్పయాత్ర 341 రోజులు కొనసాగింది. వైఎస్‌ జగన్‌ 124 బహిరంగ సభల్లో మాట్లాడారు. 55 చోట్ల పలు సంఘాల (కమ్యూనిటీ మీటింగ్స్‌)తో సమావేశం నిర్వహించారు. లక్షల మంది ప్రజలను కలిశారు. వేలాది ప్రజా వినతులను స్వీకరించారు. 
  • 2017 డిసెంబర్‌ 16: అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్టూరు వద్ద 500 కి.మీ.
  • 2018 జనవరి 29: నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో 1,000 కి.మీ.
  •  2018 మార్చి 14: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురులో 1,500 కి.మీ.
  • 2018 మే 14: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం వెంకటాపురంలో 2,000 కి.మీ. 
  • 2018 జూలై 8: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పసలపూడిలో 2,500 కి.మీ. 
  • 2018 ఆగస్టు 24: విజయనగరం జిల్లా దేశపాత్రుని పాలెం వద్ద 3,000 కి.మీ. 
  • 2018 డిసెంబర్‌ 22: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రావి వలసలో 3,500 కి.మీ. 
  • 2019 జనవరి 9: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద 3,648 కి.మీ   

- వనం దుర్గా ప్రసాద్‌ 

మరిన్ని వార్తలు