YSR: అఖిల భారతావనికి అడుగుజాడ

2 Sep, 2022 12:39 IST|Sakshi

వ్యక్తిత్వాన్ని రాజకీయాలకు బలిపెట్టని నాయకుడు వైఎస్సార్‌. నవ్వులో స్వచ్ఛత, పిలుపులో ఆత్మీయత ఉట్టిపడేవి. మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. మాట తప్పని, మడమ తిప్పని ఆయన గుణమే ప్రజల కోసం ఎంతదూరమైనా వెళ్లేటట్టు చేసింది. ఆత్మహత్య తప్ప గత్యంతరం లేని స్థితిలో ఉన్న రైతాంగానికి జీవశక్తిని అందించారు. వ్యవసాయ పునరుజ్జీవనానికి బాటలు పరిచారు. నిరుపేదలకు సైతం కార్పొరేట్‌ వైద్యం దక్కేలా చూశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో నిరుపేద పిల్లలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు. అధోగతిలో ఉన్న సహకార వ్యవస్థను ఆదుకున్నారు. పల్లెలు మళ్లీ కళకళలాడేలా చేశారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన మహోన్నత నాయకుడు వైఎస్సార్‌.


కపటం లేని ఆ మందహాసం... 

సరిగ్గా పదమూడేళ్ల క్రితం, 2009 సెప్టెంబరు రెండో తేదీన యావత్‌ తెలుగు ప్రజానీకం పడిన ఆందోళన ఇంకా గుండెల్లో పచ్చిగానే ఉంది. కార్చిన కన్నీటి తడి ఇంకా చెమ్మగానే ఉంది. ఆ విషాద ఘడియల్లో దేశ వ్యాప్తంగా మీడియాలో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ  పదం ‘వైఎస్సార్‌’. ఆ పేరు ఇక ముందు కూడా వినబడు తూనే ఉంటుంది కానీ, ఆ రూపం సజీవంగా కనబడే అవకాశమే లేదు కదా. ఒక వ్యక్తి గుణ గణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసు కునేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖర రెడ్డిగారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.

‘రాజశేఖరా! నీపై మోజు తీరలేదురా!’ అని తెలుగు ప్రజానీకం రెండో పర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీ నిండగానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం. ‘రాజసాన ఏలరా!’ అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం. అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్‌ అరవై ఏళ్ళు రాగానే రిటైర్‌ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్‌ కావడం అన్నది, ఆయన పథకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం.

1978 నుంచి ఒక జర్నలిస్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. విలేఖరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా ఉండేది. బిగుసుకుపోయినట్టు ఉండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. నవ్వులో స్వచ్ఛత, పిలుపులో అత్మీయత ఉట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం ఎంత దూరమైనా వెళ్ళడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్నా కీడే ఎక్కువగా జరిగిన సందర్భాలున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్‌కు రాష్త్రవ్యాప్తంగా అభిమానులను తయారుచేసి పెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరఫున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.


1975లో నేను రేడియో విలేఖరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి తొలిసారి శాసనసభకు ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళిన వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది. వైఎస్సార్‌ను నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లో సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న సరోవర్‌ హోటల్‌ (ఇప్పుడు మెడిసిటీ హాస్పిటల్‌) టెర్రేస్‌ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భమది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించేవారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్‌. 

ఇటు హైదరాబాదు లోనూ, అటు ఢిల్లీ లోనూ వైఎస్సార్‌ నివాసాలు జర్నలిస్టులతో కళకళ లాడుతూ ఉండేవి. వేళాపాళాతో నిమిత్తం లేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు ఉండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిస్టు స్నేహితులు ఆయనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉండడం సహజమే. 2004లో ఆయన తొలిసారి సీఎం కాగానే, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్‌లో నేను రిటైర్‌ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకు వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఒక విలేఖరికీ, ఒక రాజకీయ నాయకుడికీ నడుమ సహజంగా ఉండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పెన వేసుకున్న ఈ బంధం శాశ్వతంగా తెగిపోయిందే అన్న బాధతో, ఆ మహోన్నత వ్యక్తిత్వానికి నివాళి అర్పిస్తూ, ‘రెండు కన్నీటి బొట్లు’ రాల్చడం మినహా ఏమీ చేయలేని చేతకానితనం నాది. 


- భండారు శ్రీనివాసరావు 
సీనియర్‌ జర్నలిస్ట్‌

సంక్షేమానికి చెదరని చిరునామా
నాలుగేళ్లక్రితం చెన్నై వెళ్లినప్పుడు మా బంధువొకాయన దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గురించి ఒక ప్రశ్న వేశారు. ‘వైఎస్‌కు ముందు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన నేతలు న్నారు కదా, కానీ ఆ పథకాలు ప్రస్తావనకు వచ్చి నప్పుడు వైఎస్‌నే అందరూ ఎందుకు గుర్తు చేసు కుంటార’న్నది ఆ ప్రశ్న సారాంశం. నిజమే... ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి నిరుపేదలకు సైతం రోజూ గుక్కెడు బువ్వ అందుబాటులోకి వచ్చేలా చేశారు. అంతకు చాన్నాళ్ల ముందే ‘గరీబీ హఠావో’ అంటూ ఇందిరాగాంధీ కూడా ఎన్నో పథకాలు తెచ్చారు. తమిళనాట అధికారంలోకి రాగానే నిరుపేదలకు కలర్‌ టీవీలు, మిక్సీలు, గ్రైండర్‌లు పంచిపెట్టిన ప్రభుత్వాలున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే పోటీలుపడి ఇలాంటి వాగ్దానాలు చేసేవి. అయితే వైఎస్‌ తీరు వేరు. ఆయన అమలు చేసిన పథకాల ఒరవడే వేరు. ఆ పథకాలు జనసంక్షేమానికి అసలు సిసలైన నిర్వచనంగా నిలిచాయి. అందుకు కారణముంది. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్‌ దిగే సమ యానికి రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా నిస్తేజం అలుముకుంది. అప్పటికి ఏడెనిమిదేళ్ల క్రితం వచ్చిపడిన ఉదారవాద ఆర్థిక విధానాల పర్యవసానంగా సమస్త చేతివృత్తులూ దెబ్బతిన్నాయి. వరస కరవులతో, అకాల వర్షాలతో రైతాంగం అల్లాడు తోంది. అప్పుల ఊబిలో దిగబడి ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదనుకుంటోంది. అప్పటికే ఉన్న ధనిక, పేద; పట్టణ, గ్రామీణ అంతరాలు మరింత పెరిగాయి. కొనుక్కునే స్థోమత ఉంటే తప్ప నాణ్యమైన చదువుకు దిక్కు లేకుండా పోయింది. రోగం వచ్చి ఆసుపత్రులకు వెళ్లినవారికి యూజర్‌ ఛార్జీల బాదుడు మొదలైంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారయావతో ఇతర సీఎంల కన్నా అత్యుత్సాహంగా సంస్కరణలు అమలు చేయడం వల్ల ఏపీ మరింత దుర్భరంగా మారిందేమో గానీ దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ‘ఏదీ వూరికే రాద’ని పాలకులు ఉపన్యాసాలు దంచే పాడుకాలమది. నేలవిడిచి సాముచేసే నాయకులను తమ ముఖపత్రాలపై అచ్చోసే అంతర్జాతీయ పత్రికలకు అప్పుడు కొదవలేదు. 

సరిగ్గా ఆ సమ యంలో వైఎస్సార్‌ పాద యాత్ర నిర్వహించి ప్రజల దుర్భర స్థితిగతులను దగ్గర నుంచి చూశారు. 1,400 కిలోమీటర్ల పొడ వునా సామాన్యుల గుండె ఘోషను అతిదగ్గర నుంచి వినగలిగారు. వీరందరి జీవితాల మెరుగుదలకు ఏం చేయగలమన్న మథనం ఆయనలో ఆనాడే మొదలైంది. తర్వాత కాలంలో ఆయనే చెప్పుకున్నట్టు ఆ పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది. రాగల అయిదేళ్లకూ పాలనా ప్రణాళికను నిర్దేశించింది. వ్యక్తిగా కూడా ఆయనను ఆ పాదయాత్ర ఎంతో మార్చింది.

రాయలసీమ ప్రాంత నేతగా సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యంపై ఆయనకు మొదటి నుంచీ అవగాహన ఉంది. కానీ అది ‘జలయజ్ఞం’గా రూపుదిద్దుకున్నది జనం మధ్యనే! అన్ని ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలన్న ఆ లక్ష్యం వేల కోట్ల వ్యయంతో ముడిపడి ఉంటుంది గనుక అది అసాధ్యమనుకున్నారంతా! కానీ భర్తృహరి చెప్పినట్టు ఎన్ని అడ్డంకులెదురైనా వెరవక తుదికంటా శ్రమించడమే కార్యసాధకుల నైజమని వైఎస్‌ భావించారు. ఈ అనితర సాధ్యమైన ప్రయత్నానికి సమాంతరంగా ఉచిత విద్యుత్‌ జీవోపై తొలి సంతకం చేసి అన్నివిధాలా చితికిపోయి ఉన్న రైతాంగానికి తక్షణ జీవశక్తిని అందించారు. బాబు పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయాన్ని మళ్లీ పట్టాలెక్కించి, దాని పునరుజ్జీవానికి బాటలు పరిచారు.  అంతేకాదు... అంతవరకూ ఆకాశపు దారుల్లో హడావిడిగా పోయే ఆరోగ్య సిరిని భూమార్గం పట్టించి నిరుపేదలకు సైతం ఖరీదైన కార్పొరేట్‌ వైద్యం దక్కేలా చూశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో నిరుపేద వర్గాల పిల్లలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు. అధోగతిలో ఉన్న సహకార వ్యవస్థను ఆదుకున్నారు. పల్లెలు మళ్లీ కళకళలాడేలా చేశారు.

ప్రపంచీకరణ విధానాల యుగంలో అభి వృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన సాహసిగా, తనకు తెలిసినవారైనా కాకున్నా, తన పార్టీవారు అయినా కాకున్నా సాయం కోరివచ్చిన వారందరి పట్లా ఒకేలా స్పందించిన సహృదయుడిగా వైఎస్‌ చిరస్థాయిగా నిలుస్తారు. పీవీ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసి, ఆర్థిక సంస్కరణలను అమలు చేసిన ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వంటి నేతను దేశవ్యాప్త రైతాంగానికి రుణమాఫీ తక్షణావసరమని ఒప్పించడంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డిది కీలకపాత్ర. ఇలాంటి నాయకుడు సంక్షేమానికి శాశ్వత చిరునామా కావడంలో, ఆ విషయంలో అఖిల భారతావనికి అడుగుజాడ కావడంలో ఆశ్చర్యమేముంది?


-టి. వేణుగోపాలరావు
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు