పెద్దల సభలో బలమైన బీసీ వాణి!

25 May, 2022 12:14 IST|Sakshi

సాహు మహరాజ్‌ లాగా ఏపీ సీఎం జగన్‌ కూడా బలహీనవర్గాల ప్రజలను ఆదరిస్తున్న తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. అత్యున్నత పదవుల్లో అణగారిన, బలహీన వర్గాలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం శ్లాఘనీయం. వారి సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయి. అందుకే ‘మనకాలపు సాహు మహరాజ్‌ జగన్‌’ అంటాను. 

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ హయాంలో బీసీల కోటా నుంచి ఒక మంత్రి లేదా ఇద్దరు మంత్రులు ఉండేవారు. ఇంకా ఉంటే ఒకటో రెండో కార్పొరేషన్‌ ఛైర్మన్లు! అంతే బీసీలు, ఎస్సీలకు గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇచ్చిన ప్రాధాన్యం! ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్‌ పోస్టుల్లో అసలు బీసీలు, ఎస్సీ, ఎస్టీల ఊసే లేదు. కానీ, జగన్‌ ప్రభుత్వం ఇదివరకు ప్రభుత్వాలకు భిన్నంగా బీసీలకు పెద్ద ఎత్తున స్థానం కల్పించడం గమనార్హం. బీసీ సమాజం, సంఘాలు, సోకాల్డు బీసీ లీడర్లను కూడా ఈ పరిమాణం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.

గతంలో సాహు మహరాజ్‌ వల్లనే అప్పటి అణగారిన సమాజం రిజర్వేషన్లు పొందిందని చరిత్ర చెబుతున్నది. ఆయన సాయంతోనే బీఆర్‌ అంబేడ్కర్‌ చదువుకొని భారత రాజ్యాంగ రూపకర్తగా మారారు. సీఎం జగన్‌ ప్రోత్సా హంతో ఇప్పుడు రాజకీయ అధికార పదవుల్లోకి వచ్చిన వారు ముందు ముందు మరిన్ని కీలక పదవులు పొంది తమ వర్గాల సాధికారత కోసం కృషిచేసే అవకాశం ఉంది.

బీసీ ఉద్యమంలో ఆర్‌. కృష్ణయ్య నిర్వహిస్తున్న పాత్ర చాలా ముఖ్యమైనది. బీసీల కోసం గత నాలుగు దశాబ్దాలకు పైగా ‘బీసీ సంక్షేమ సంఘం’ ద్వారా అలుపెరగని, అవిశ్రాంత పోరాటం చేస్తూన్న పోరాట యోధుడాయన. రెండు తెలుగు రాష్ట్రాలలోని వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణకు ఆర్‌. కృష్ణయ్య కృషి చిరస్మరణీయం. సుదీర్ఘ కాల ఉద్యమ నేపథ్యాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆర్‌. కృష్ణయ్యకు ఇటీవల వైసీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి రాజ్యసభలో సభ్యునిగా స్థానం కల్పించే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఒక విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని 136 బీసీ కులాలకు దక్కిన అరుదైన గౌరవంగా భావించవచ్చు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజ్యసభలోకి ప్రవేశిస్తున్న బీసీ ఉద్యమనేత ఆర్‌. కృష్ణయ్యపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నేతలు పలు రకాల విమర్శలు చేస్తుండటం దురదృష్టకరం. 

బీసీల సంక్షేమ పార్టీగా చెప్పుకొని టీడీపీ ఈ అంశంలో జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి, విమర్శించడం దారుణం. 2014లో రాష్ట్ర విభజన తరువాత జరిగిన సాధారణ ఎన్నికలలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్‌. కృష్ణయ్యను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికలలో నారా చంద్రబాబు బీసీ ముఖ్య మంత్రి అభ్యర్థిగా ఆర్‌. కృష్ణయ్యను ప్రయోగించినందునే తెలుగుదేశం పార్టీకి నామమాత్రంగానైనా అసెంబ్లీ సీట్లు లభించాయని చెప్పవచ్చు. (👉🏾చదవండి: వైపరీత్య ఘటనల్లో రాజకీయమా?)

ఇక ఆర్‌. కృష్ణయ్య తెలంగాణ వాడు కదా... ఆయనకు ఏ విధంగా రాజ్యసభ సీటు ఇస్తారని టీడీపీ అనుంగు అనుచరులు విమర్శలు చేయడం శోచనీయం. కృష్ణయ్య లాంటి జాతీయ స్థాయి బీసీ ఉద్యమ నేతను కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేస్తూ విమర్శలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అదే విధంగా బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు, బీసీ కులాల గణాంకాలు లాంటి అనేక డిమాండ్లు బీసీలకు దశాబ్దాల తరబడి ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి. బీసీల పార్టీలుగా ఈ సమస్యలపై ఎప్పటినుంచో ఉద్యమిస్తూ ఉన్న ఆర్‌. కృష్ణయ్య పార్లమెంట్‌లో ఉంటే బీసీల వాణి మరింత స్పష్టంగా, ప్రభావవంతంగా వినిపించవచ్చు. బీసీల సమస్యలపై చిత్తశుద్ధితో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అందుకే ఆర్‌. కృష్ణయ్యను పెద్దల సభకు పంపడానికి నిర్ణయించింది. (👉🏾చదవండి: ఇది ఎదురుకాల్పుల కనికట్టు కథ!)


- మన్నారం నాగరాజు 
తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు

మరిన్ని వార్తలు