వినికిడి సమస్య లేని బాల్యాన్ని అందించాలి

25 Mar, 2023 02:06 IST|Sakshi
వినికిడి యంత్రాలను బాలుడికి అందిస్తున్న డాక్టర్‌ శ్రావణ్‌బాబు

గుంటూరు మెడికల్‌: వినికిడి సమస్యల వల్ల చిన్నారులు సామాజిక రుగ్మతలను ఎదుర్కొంటారని, చదువుతోపాటు అన్ని విషయాల్లోనూ వెనుకబడతారని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు అన్నారు. ప్రతి ఒక్కరు పుట్టుక తోనే పిల్లల్లో వినికిడి సమస్యలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా వినికిడి సమస్యలు లేని బాల్యాన్ని అందించవచ్చన్నారు. శుక్రవారం గుంటూరులోని ఏపీఎన్జీవో హాలులో జిల్లా సత్వర చికిత్స కేంద్రం, అలియవర్‌ జంగ్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ డిజేబుల్టీస్‌ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచితంగా వినికిడి యంత్రాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణ్‌బాబు మాట్లా డుతూ పిల్లలకు ఉచితంగా వినికిడి యంత్రాలు అందజేయడం బృహత్తరమైన కార్యక్రమని పేర్కొన్నారు. సుమారు రూ. 30 లక్షలు ఖరీదు చేసే వినికిడి యంత్రాలను 80 మంది చిన్నారు లకు ఉచితంగా అందజేయడం అభినందనీయమని, ఉచిత వైద్య శిబిర నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఏ ఒక్క పిల్లవాడు కూడా వినికిడి సమస్యతో బాధపడకూడదని, చిన్నారులకు గుంటూరు జీజీహెచ్‌ డైక్‌ సెంటర్‌ సిబ్బంది ముందస్తుగా స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి వినికిడి యంత్రాలు ఉచితంగా అందజేయడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు సదరు వినికిడి యంత్రాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని పిల్లలు వినికిడి సమస్య లేకుండా ఆడుతూ పాడుతుండేలా చూడాలన్నారు. సకాలంలో వినికిడి సమస్యను గుర్తిస్తే ప్రభుత్వం ఉచితంగా సుమారు రూ. 16 లక్షల ఖరీదు చేసే కాక్లియర్‌ ఆపరేషన్లు సైతం చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఎడిప్‌ స్కీమ్‌ ద్వారా ఉచితంగా వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడిప్‌ స్కీంకు చెందిన డాక్టర్‌ గౌరీశంకర్‌ పాటిల్‌, వారి బృందం, గుంటూరు డైక్‌ సెంటర్‌కు చెందిన ఆడియాలజిస్ట్‌ నవ్య, పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్‌ ప్రియాంక, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కీర్తి, మేనేజర్‌ శిరీష, ఆప్తోమెట్రీషియన్‌ ప్రతాప్‌, తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు

రెండేళ్లుగా వినికిడి సమస్య

మాది మాచవరం మండలం కొత్తపాలెం గ్రామం. మా అబ్బాయి గద్దె భార్గవ్‌కు ఎనిమిది సంవత్సరాలు. రెండేళ్లుగా వినికిడి సమస్యతో బాధపడుతున్నాడు. జీజీహెచ్‌ డైక్‌ సెంటర్‌కు తీసుకు రాగా, ఉచితంగా అన్ని పరీక్షలు చేసి నేడు సుమారు రూ.50 వేలు ఖరీదు చేసే వినికిడి యంత్రాలు అందజేయడం చాలా సంతోషంగా ఉంది.

–గద్దె భార్గవ్‌తో తండ్రి వెంకటేశ్వరరావు

మరిన్ని వార్తలు