మంత్రి మేరుగ న్యాయసలహాదారుగా కృష్ణ

25 Mar, 2023 02:06 IST|Sakshi

తెనాలి: ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జున న్యాయ సలహాదారుగా తెనాలి న్యాయవాది గుంటూరు కృష్ణ నియమితులయ్యారు. శుక్రవారం సాయంత్రం మంత్రి చేతులమీదుగా ఆ జీవోను కృష్ణ స్వీకరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో మంత్రి డాక్టర్‌ నాగార్జున సహకారంతో తన నియామకం జరిగిందని కృష్ణ తెలిపారు. సంవత్సర కాలం ఈ పదవిలో కొనసాగుతారు. గుంటూరు కృష్ణ స్వస్థలం వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం గ్రామం గుంటూరుగూడెం. 20 ఏళ్లుగా తెనాలిలో న్యాయవాదిగా ఉన్నారు. అంతకుముందు తెనాలి కేంద్రంగా పత్రికా విలేకరిగా చేశారు. జర్నలిస్టు అనుభవంతో 2004–09లో డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పరిపాలనపై ‘లక్ష్యం–సాక్ష్యం’ పుస్తకాన్ని రచించి, వారితోనే ఆవిష్కరింపజేశారు. 2010లో ‘నాయకుడు–వైఎస్‌ జగన్‌ పేరుతో డైరీని తీసుకొచ్చారు. మోదుకూరి జాన్సన్‌పై ‘చెరగని జ్ఞాపకాలు’ రచించారు.

ఐదుగురు విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీసు కేసులు

107 ఇంటర్‌ పరీక్షా కేంద్రాల్లో విస్తృత తనిఖీలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: సీనియర్‌ ఇంటర్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీసుకు పాల్పడిన ఐదుగురు విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్‌ పేపర్‌–2బీ, జువాలజీ, హిస్టరీ పేపర్‌–2 పరీక్షలు జరిగాయి. గుంటూరు గోరంట్లలోని శ్రీచైతన్య జూనియర్‌ పరీక్షా కేంద్రంలో ముగ్గురు విద్యార్థులతో పాటు చిలకలూరిపేటలోని ఏఎంజీ జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడిన ఒక విద్యార్థిని గుర్తించిన అధికారులు మాల్‌ ప్రాక్టీసు కేసులు నమోదు చేశారు. గుంటూరు నవభారత్‌నగర్‌లోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రాన్ని డీవీఈవో జె.పద్మ ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ఒక విద్యార్థి స్లిప్పులను కలిగిఉండటాన్ని గుర్తించారు. దీంతో సదరు విద్యార్థిపై మాల్‌ ప్రాక్టీసు కేసు నమోదుతో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. శుక్రవారం జరిగిన పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 134 కేంద్రాల పరిధిలో కేటాయించిన 40,764 మంది విద్యార్థుల్లో 39,839 మంది హాజరయ్యారు. అత్యధికంగా 107 పరీక్షా కేంద్రాల్లో వివిధ శాఖల అధికారులతో పాటు పరిశీలకులు, స్క్వాడ్స్‌ విస్తృత తనిఖీలు నిర్వహించారు.

యార్డులో 87,530

బస్తాల మిర్చి విక్రయం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు శుక్రవారం 81,449 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 87,530 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.25,000 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.9,500 నుంచి రూ.27,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,200 నుంచి రూ.13,000 వరకు ధర దక్కింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 79,416 బస్తాలు మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

ప్రవీణ్‌ ప్రకాష్‌

సత్తెనపల్లి: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ అన్నారు. సత్తెనపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, రఘురాంనగర్‌లోని బీసీ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి ఆయన సందర్శించారు. సిలబస్‌ ఎక్కడ వరకు పూర్తయింది, నోట్‌ పుస్తకాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. సత్తెనపల్లి ఆర్డీవో బీఎల్‌ఎన్‌ రాజకుమారి, తహసీల్దార్‌ కె.నగేష్‌, మండల విద్యాశాఖ అధికారి ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు