‘ఉద్యాన’ రైతన్నకు బాసట!

25 Mar, 2023 02:06 IST|Sakshi
కొల్లిపరలో నిర్మాణం పూర్తయిన కలెక్షన్‌ సెంటర్‌

కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ రంగం అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. పెట్టుబడి సాయం అందజేస్తున్న ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, ఉచిత పంటల బీమా తదితర పథకాలు అందజేస్తోంది. లాభసాటి సాగుపై ఆర్‌బీకేల సిబ్బంది రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తూ చైతన్య పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యాన సాగును ప్రోత్సహిస్తూ రైతన్నకు బాసటగా నిలుస్తోంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పండ్లు, కూరగాయలు గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ చేసుకునేందుకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కలెక్షన్‌ సెంటర్‌ (పంట సేకరణ కేంద్రాలు) ఏర్పాటు చేస్తోంది. గుంటూరు జిల్లాకు 12 కలెక్షన్‌ సెంటర్లు మంజూరు కాగా ఇప్పటి వరకు కొల్లిపర, నందివెలుగు, కొత్తమల్లాయపాలెం, నుదురుపాడులో నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రత్తిపాడులో నిర్మాణం పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన ఏడు చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు యూనిట్లు పొందే అర్హత కల్పించారు. అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌తో కలెక్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి ఉద్యాన శాఖ నిధులు మంజూరు చేస్తుంది. ఒక్కో యూనిట్‌ వ్యయం రూ.15 లక్షలు కాగా రైతుల వాటా కేవలం రూ.3.75 లక్షలు మాత్రమే చెల్లించాల్సిఉంటుంది. మిగిలిన రూ.11.25 లక్షలు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుంది. ఒక్కో రైతు ఉత్పత్తిదారుల సంఘంలో 100 నుంచి 500 మంది సభ్యులుగా ఉన్నారు.

తీరనున్న ఇబ్బందులు..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏడాదికేడాది ఉద్యాన పంటల సాగు పెరుగుతోంది. మిరప, అరటి, పసుపు, పండ్లు, కూరగాయల పంటల సాగు పెరుగుతోంది. జిల్లాలో మిరప 20 వేల హెక్టార్లు, పసుపు 1,600 హెక్టార్లు, పండ్లు 3,600 హెక్టార్లు, పూలు 500 హెక్టార్లు సాగు చేస్తున్నట్లు అధికారుల అంచనా. కూరగాయల పంటలు 3,500 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. పంటల దిగుబడి సమయంలో సరైన ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. దిగుబడులు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో నష్టాలు చవిచూడాల్సివచ్చేది. ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. కలెక్షన్‌ సెంటర్లలో రైతులు పండించిన కూరగాయలు, పండ్లు తదితరాల వాటిని నిల్వ చేసుకొని ధర లభించిన సమయంలో మార్కెటింగ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. దిగుబడులు గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ చేసుకొని మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించుకోవచ్చు. దీంతో గతంలో పడిన ఇబ్బందులు తొలగనున్నాయి. 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో షెడ్‌ నిర్మించి రైతులకు అనువుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు