అవగాహనతో క్షయ నివారణ సులభం

25 Mar, 2023 02:06 IST|Sakshi

గుంటూరు మెడికల్‌: క్షయ వ్యాధిపై అవగాహన కలిగిఉండటం ద్వారా చాలా సులభంగా వ్యాధిని నివారించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు అన్నారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జిల్లా టీబీ నివారణ కేంద్రం ఆధ్వర్యంలో నగర ప్రజలకు టీబీపై అవగాహన కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ర్యాలీని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణ్‌బాబు మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా చేస్తున్నామన్నారు. వైద్య పరీక్షలతో పాటు వైద్య సేవలు, మందులు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రతి నెల టీబీ రోగులకు రూ.500 నగదుతో పాటు, పోహకాహార కిట్‌ను అందిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ బండారు సుబ్బారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి రోగికి నెలకు సుమారు రూ.700 విలువచేసే పోషక ఆహార పదార్థాల కిట్‌లను అందిస్తున్నామని తెలిపారు. ర్యాలీలో జిల్లా న్యూక్లియస్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భూక్య లక్ష్మానాయక్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ డీపీఎంఓ డాక్టర్‌ చుక్కా రత్నమన్మోహన్‌, మలేరియా సబ్‌యూనిట్‌ ఆఫీసర్‌ ఆలపాటి శ్రీమన్నారాయణ, నగరపాలక సంస్థ బయాలజిస్ట్‌ మధుసూదన్‌రావు, జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ లంకపల్లి మధుసూదన్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు నగరంలోని నర్సింగ్‌ కళాశాలల యజమానులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రశంసా పత్రాలు అందజేత..

గుంటూరు జీజీహెచ్‌లో వరల్డ్‌ టీబీ డే సందర్భంగా జరిగిన సదస్సులో జిల్లాలో క్షయ నివారణ కోసం విశేషంగా కృషి చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సైతం బహుమతులు అందించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందన్నారు. వారు జాగ్రత్తగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. క్షయకు సంబంధించిన లక్షణాలు గుర్తించిన వెంటనే తగు వైద్య సలహాలు తీసుకొని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేటట్లు తగుప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. సీనియ ర్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ జి.బాబురావు మాట్లా డుతూ గతంలో పోలిస్తే ఇప్పుడు క్షయ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయను నివారించడం చాలా సులభమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణ్‌బాబు, డాక్టర్‌ సుబ్బారావు, డాక్టర్‌ లక్ష్మానాయక్‌, డాక్టర్‌ అందే వెంకటేశ్వరరావు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఆవుల శ్రీనివాసరావు, ఐఎంఏ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వి.మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణ్‌బాబు

మరిన్ని వార్తలు