మంగళగిరిలో వైఎస్సార్‌ సీపీదే విజయం

14 Jan, 2024 10:26 IST|Sakshi
ఎంపీ విజయసాయిరెడ్డిని సత్కరిస్తున్న వేమారెడ్డి తదితరులు

తాడేపల్లి రూరల్‌ : మంగళగిరిలో వైఎస్సార్‌ సీపీదే విజయం అని, మరింత మెజార్టీ వచ్చే విధంగా నాయకులు, కార్యకర్తలు ఒక లక్ష్యంగా పని చేయాలని రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శనివారం ఎంటీఎంసీ అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి అధ్యక్షతన దుగ్గిరాల మండలంలోని వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. ఇక్కడ పెత్తందార్లు ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి బీసీ వర్గానికే సీటు కేటాయించాలని నిర్ణయించి వారినే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు మరోసారి విజయం సాధించడమే కాకుండా అత్యధిక మెజార్టీ వచ్చే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

గతంలో కొంతమంది పార్టీ నాయకులకు న్యాయం జరగలేదని, వారిని సైతం కలుపుకోవాలని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కార్యాచరణ రూపొందించుకుని రాబోయే మూడు నెలల్లో పార్టీని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వడ్డేశ్వరపు రజనీకాంత్‌, జిల్లా డైరెక్టర్‌ పిల్లి రాఘవులు, జమ్ముల లోకేష్‌, దుగ్గిరాల వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆళ్ల మహేష్‌, సర్పంచులు గంగాధరరావు, యస్‌కె. బాషా, కార్యకర్తలు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు