ముంపు ముప్పు

17 Jul, 2023 01:24 IST|Sakshi
హనుమకొండలోని నయీంనగర్‌ వద్ద నాలా

హా నగరంలోని చాలా కాలనీలు వర్షాకా లంలో జలమయమవుతున్నాయి. వరదనీరు సాఫీ గా వెళ్లిపోవడానికి అనేక అవరోధాలున్నాయి. కాకతీయుల కాలం నాటి సహజ సిద్ధమైన గొలుసుకట్టు చెరువులు, నాలాలన్నీ ఆక్రమణలతో కుచించుకుపోయాయి. కొందరు ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మించుకున్నారు. మరికొందరు స్థలాలకు ప్రహరీ లు కట్టుకున్నారు. ఇలా ఎవరికి వారు నాలాల నామరూపాలు లేకుండా చేస్తుంటే.. చిన్న పాటి వర్షానికే నగరంలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇళ్లల్లోని సరుకులు, వస్తువులు కొట్టుకుపోయి రోజు ల తరబడి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు కడుపు మాడ్చుకుంటూ మనోవేదనకు గురవుతున్నారు.

ఆదేశాలకు విలువలేదు..

ప్రతిపాదనలు బుట్టదాఖలు

2020 ఆగస్టులో భారీ వర్షాలతో ట్రైసిటీ అతలాకుతలమైంది. మంత్రి కేటీఆర్‌ వరంగల్‌, హనుమకొండలో పర్యటించిన సందర్భంగా.. నాలాల ఆక్రమణ లను తొలగించి వరద నీరు కాలనీల వైపు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. సర్వే చేసి వాస్తవ నా లాలను గుర్తిస్తే రెండువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మి ంచేందుకు నిధులిస్తామన్నారు. మూడేళ్లు కావస్తు న్నా.. హద్దులు పూర్తి కాలేదు. ఆక్రమణలు పూర్తి స్థా యిలో తొలగించలేదు. అయితే.. వరంగల్‌ భద్రకా ళి చెరువు, హనుమకొండ వడ్డేపల్లి చెరువుల పరి వా హక నాలాల విస్తీర్ణం 12.35 కిలోమీటర్లుగా, రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణాలకు రూ.179.27కోట్ల వ్య యం అవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపితే కాగితాలకే పరిమితమయ్యాయి.

25 కిలోమీటర్లకు 5 కిలోమీటర్లే..

నగరంలో 20 నాలాలు 25 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి. నయీంనగర్‌, బొందివాగు, రంగంపేట, అలంకార్‌ బ్రిడ్జి.. ఈ మూడు నాలాలకు సంబంధించి కేవలం 5 కిలోమీటర్లే కబ్జా, ఆక్రమణ అయినట్లు గుర్తించి 162 తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేశారు. మరో 71 భవనాలు, 4 కమర్షియల్‌ కాంప్లెక్స్‌లకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు.

● భద్రకాళి బండ్‌ నుంచి పోతననగర్‌ వరకు స్మార్ట్‌సిటీనిధుల కింద రూ.10కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మించారు. బొంది వాగు నుంచి భద్రకాళి బండ్‌ వరకు సుమారు 200 మీటర్ల మేరకు నిర్మించలేదు. హంటర్‌ రోడ్డులోని కాలనీలు వరద ముంచెత్తుతోంది. పోతన నగర్‌నుంచి భద్రకాళి, రంగంపేట, అలంకార్‌, పెద్దమ్మగడ్డ, గుండ్లసింగా రం వరకు రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మించాల్సి ఉంది.

● హనుమకొండ వడ్డేపల్లి నుంచి కేయూసీ రోడ్డు మీదుగా ప్రెసిడెన్సియల్‌ స్కూల్‌ వరకు ఇరిగేషన్‌ ద్వారా స్మార్ట్‌సిటీ నిధులు రూ.64కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ పనులు 75శాతం పూర్తి కావచ్చాయి. ప్రభుత్వానికి రూ.176.25కోట్లు ప్రతిపాదించగా.. రూ.57కోట్లు మంజూరు చేసింది. వీటితో సమ్మయ్యనగర్‌ నుంచి నయీంనగర్‌ మీదుగా కాకతీయ కెనాల్‌ వరకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాల్సి ఉంది. హద్దులు ఖరారు చేయకపోవడం, నిర్మాణాలు, ప్రహరీలు కూల్చడంలో నిర్లక్ష్యం కారణంగా పనులు నిలిచిపోయాయి.

మార్కింగ్‌ మాటలే..

హంటర్‌ రోడ్డు బొంది వాగు భద్రకాళి చెరువు కట్ట వరకు అనేక మలుపులున్నాయి. పాతబస్తీలోని సాకరాశికుంట నాలా కనుమరుగైంది. గతంలో నిర్మించిన నాలా అశాసీ్త్రయతతో వరద నీరు సాఫీగా ముందుకు సాగక పలు కాలనీల్లోకి చేరుతోంది. అండర్‌ బ్రిడ్జి రోడ్డు నుంచి రైల్వేట్రాక్‌ వరకు నాలా స్థలంపై భవనాలు నిర్మితమై ఇరుకుగా మారింది. హనుమకొండలో కీలకమైన వడ్డేపల్లి నుంచి ప్రెసిడెన్సియల్‌ స్కూల్‌ వరకు నాలా ఆధునికీకరణ పనులు పూర్తి కావస్తున్నాయి. సమ్మయ్యనగర్‌ నుంచి నయీంనగర్‌ మీదుగా రెడ్డి కాలనీ వరకు 40 అడుగుల నాలా కొన్నిచోట్ల 20 అడుగులకు చేరింది. బంధం చెరువు, కట్టమల్లన్న, సాయినగర్‌ చిన్నవడ్డేపల్లి వరకు ఉన్న నాలా రూపురేఖలు మారిపోయాయి. వాస్తవ హద్దులు గుర్తించి మార్కింగ్‌ వేసిన దాఖలాలు లేవు.

వరంగల్‌ పోతన నగర్‌ నుంచి భద్రకాళి వైపు..

చిన్న వర్షానికే నగరం చిగురుటాకులా వణికిపోతోంది. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల వాసుల గుండెల్లో దడ మొదలవుతోంది. ముంపు కారణంగా ఇళ్లల్లో ఉన్న వస్తువులన్నీ నీళ్లల్లో కలిసిపోయి కట్టుబట్టలతో రోడ్డుపాలవుతున్నారు. వేలాది కుటుంబాలు కన్నీటి సుడులతో పునరావాస కేంద్రాల్లో మగ్గాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. చెరువుల ఆక్రమణ, నాలాల కబ్జా ఇందుకు కారణమని ఏలికలకు.. పాలకులకు తెలిసినా కంటితుడుపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు. ప్రస్తుతం వానలు మొదలయ్యాయి. జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. – వరంగల్‌ అర్బన్‌

నగరంలో యథేచ్ఛగా నాలాల కబ్జా..

ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు

సర్వేతోనే సరి.. హద్దుల ఖరారు ఏదీ?

కంటితుడుపు చర్యలతో రాజకీయం

మూల్యం చెల్లిస్తున్న

ముంపు ప్రాంతాల వాసులు

నాలాలపై రాజకీయం

నాలాల విషయంలో తెర వెనుక బడా వ్యాపారులు, రాజకీయ నాయకులున్నారు. గత ఏడేళ్లుగా నాలాలను విస్తరించకుండా అడ్డుకుంటున్నారు. దీంతో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ఏమీ చేయలేకపోతోంది. ఉన్నతాధికారులు ఆదేశిస్తే గ్రేటర్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భూమి కొలతల శాఖ నాలాలకు సంబంధించిన హద్దులను ఖరారు చేసి ఇవ్వడం లేదని సాగుకు చెబుతున్నారు. ఇలా ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటూ కాలయాపన చేస్తున్నారు.

మరిన్ని వార్తలు