పాటించని రొటేషన్‌ పద్ధతి

23 Sep, 2023 01:22 IST|Sakshi

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో మేథమెటిక్స్‌ విభాగాధిపతి నియామకం వివాదాస్పదమవుతోంది. ఇప్పటి వరకు ఆవిభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్‌ సోమయ్య పదవీకాలం ఈనెల 5తో ముగిసింది. ఆతర్వాత రొటేషన్‌ పద్ధతిన సీనియార్టీ ప్రకారం.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ భారవిశర్మను నియమించాల్సి ఉంది. కానీ ఆయనను కాదని.. వీసీ రమేశ్‌ అప్రూవల్‌ మేరకు అదే విభాగానికి చెందిన డాక్టర్‌ తిరుమలాదేవిని విభాగాధిపతిగా కేయూ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రావు నియమించారు. తిరుమలదేవి ఇప్పటికే అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆమె విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించారు. దీంతో ఈనెల 21న ఆవిభాగం డాక్టర్‌ ఎల్‌పీ రాజ్‌కుమార్‌ను విభాగాధిపతిగా నియమిస్తూ.. కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య శ్రీనివాస్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాజ్‌కుమార్‌ కూడా వ్యక్తిగత కారణాలు చూపుతూ తాను ఆ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించబోనని రిజిస్ట్రార్‌కు అదేరోజు లేఖను అందించారు.

రొటేషన్‌ పాటించట్లేదు..

కాగా.. రొటేషన్‌ పద్ధతిలో నియామకం జరగలేదనే కారణంతో తిరుమలదేవి, రాజ్‌కుమార్‌ బాధ్యతల్ని నిరాకరించినట్లు వర్సిటీలో చర్చ జరుగుతోంది. అకుట్‌ జనరల్‌ సెక్రటరీ మామిడాల ఇస్తారి కూడా గణిత విభాగంలో రొటేషన్‌ పద్ధతి ప్రకారం డాక్టర్‌ భారవిశర్మను ఎందుకు నియమించలేదని రిజిస్ట్రార్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. కాగా.. రొటేషన్‌ పద్ధతిలో నియమించాల్సిన వివిధ పరిపాలనా పదవులపై యూనివర్సిటీ అధికారుల వైఖరి విమర్కలకు తావిస్తోంది. ఇప్పటికే బాటనీ విభాగంలో విభాగాధిపతిగా కాంట్రాక్టు లెక్చరర్‌ను యూనివర్సిటీ అధికారులు నియమించడంతో రెగ్యులర్‌ ప్రొఫెసర్‌లు ఇద్దరు ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వకపోవడంపై వివాదాస్పదంగా మారింది. అందులో రెగ్యులర్‌ అధ్యాపకురాలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే..

మరిన్ని వార్తలు