మురుగుతోనే దోమలు

27 Sep, 2023 01:06 IST|Sakshi
నివాసాల నడుమ ఖాళీ స్థలాల్లో నీరు, ముళ్ల కంపలు, డ్రెయినేజీల్లో స్తంభిస్తున్న మురుగునీరు, దోమల కాట్లతో రోగాల బారిన పడుతున్నామని నగరవాసులు గ్రేటర్‌ వరంగల్‌ ముఖ్య ప్రజారోగ్య అధికారి (సీఎంహెచ్‌ఓ) ఎం.రాజేశ్‌కు విన్నవించారు. పారిశుద్ధ్యం, దోమల నివారణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నగర సమస్యలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. పలు కాలనీల ప్రజలు తమ సమస్యలను సీఎంహెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సావధానంగా విన్నారు. కాలనీలవారీగా సమస్యలు నోట్‌ చేసుకున్న ఆయన.. సిబ్బందిని సమన్వయంతో అప్రమత్తం చేస్తూ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎంహెచ్‌ఓను నగరవాసులు అడిగిన ప్రశ్నలు.. ఆయన ఇచ్చిన సమాధానాలు ఇలా.. – వరంగల్‌ అర్బన్‌

డ్రెయినేజీలు..

ఖాళీస్థలాల్లో

రోడ్లు వారానికోమారు కూడా ఊడ్చడం లేదు. చెత్త సేకరణ జరగడం లేదు.

– డాక్టర్‌ విజయలక్ష్మి, సుబేదారి

సీఎంహెచ్‌ఓ రాజేశ్‌: స్థానిక జవాన్‌, ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశిస్తా. స్వయంగా వచ్చి పరిశీలించి, రోడ్లు ఊడ్చే విధంగా, ఇంటింటా చెత్త సేకరణ జరిగేలా చూస్తా.

ఇల్లు కట్టుకోని వారితో రోగాలపాలవుతున్నాం. ఖాళీ స్థలాల్లో మురుగునీరు, దోమలతో చిన్న పిల్ల లు, వృద్ధులు వ్యాధులు బారిన పడుతున్నారు.

– ఉదయ్‌ కుమార్‌, గణేశ్‌నగర్‌

సీఎంహెచ్‌ఓ: దోమల నివారణకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి నివారిస్తాం. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేస్తాం. డ్రెయినేజీల్లో నీరు స్తంభించకుండా చర్యలు తీసుకుంటాం.

ఇళ్లల్లో వెలువడిన మల, మూత్రాలను నేరుగా డ్రెయినేజీల్లోకి వదులుతున్నారు. మురుగునీరు స్తంభించి దుర్వాసన వస్తోంది. రోగాల బారిన పడుతున్నాం.

– శ్రీనివాస్‌, రంగంపేట

సీఎంహెచ్‌ఓ: ప్రతి ఇంటికీ తప్పనిసరిగా సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మించుకోవాల్సిందే. లేకపోతే డ్రెయినేజీల్లోకి వదలకుండా సీజ్‌ చేస్తాం. జరిమానాలు విధిస్తాం.

డ్రెయినేజీల్లో, ఖాళీ స్థలాల్లో మురుగునీరు స్తంభించి దోమలతో వేగలేకపోతున్నాం. ఫాగింగ్‌ జాడ పత్తా లేదు.

– మహేశ్‌, సాయిగణేశ్‌నగర్‌

సీఎంహెచ్‌ఓ: ఇటీవల వరదల తర్వాత కాలనీని కలెక్టర్‌, కమిషనర్లతో నేను సందర్శించా. డ్రెయినేజీలు నిర్మిస్తే వరద, మురుగునీరు సాఫీగా వెళ్తుంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. దోమల నియంత్రణకు గ్యాంగ్‌ వర్క్‌ చేయిస్తాం.

కొత్త ఇల్లు కడితే మెటీరియల్‌ను డ్రెయినేజీలో నింపేస్తున్నారు. దీంతో మురుగునీరు రోడ్డుపై పారుతోంది. ఓపెన్‌ ప్లాట్‌లో ముళ్ల పొదలు పెరిగాయి.

– షఫీ, శంభునిపేట

సీఎంహెచ్‌ఓ: డ్రెయినేజీల్లో మెటీరియల్‌ పోస్తే జరిమానాలు విధిస్తాం. ఇలాంటి సమస్యను మా దృష్టికి తీసుకురావాలి. ఓపెన్‌ ప్లాట్‌ యజమానికి నోటీసులు అందిస్తాం.

అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నాం. రోడ్డుపై చెత్త తీసుకెళ్లడం లేదు. ప్రశ్నిస్తే కొట్టేందుకు వస్తున్నారు.

– ఈశ్వర్‌, సోమిడి రోడ్డు

సీఎంహెచ్‌ఓ: ఫిర్యాదు చేస్తే కార్మికులు బెదిరించడం సరికాదు. నేను వచ్చి పరిశీలించి, నిజమైతే కార్మికులు, జవాన్‌పై చర్యలు తీసుకుంటాం. పనిచేయకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు.

ఏళ్ల తరబడి ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి మురుగునీటిలో దోమలు పెరిగి రాత్రి, పగలు కుడుతున్నాయి.

– నవీన్‌, రంగంపేట

సీఎంహెచ్‌ఓ: ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి నోటీసులు జారీ చేస్తాం. శుభ్రం చేసుకోకపోతే బల్దియా శుభ్రం చేయించి ఆస్తిపన్నులో జరిమానా విధిస్తాం. మార్పు రాకపోతే బల్దియా బోర్డు ప్రదర్శిస్తాం.

మెట్టుగుట్ట ఆర్చి రెండో లైన్‌లోని ఖాళీ స్థలాల్లో పాములు, క్రిమికీటకాలతో ప్రమాదాల బారిన పడుతున్నాం. ఎన్నిమార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

– జి.రమణమూర్తి, మెట్టుగుట్ట

సీఎంహెచ్‌ఓ: ఖాళీ స్థలాలను కొని వదిలేసి వెళ్తున్నారు. దీంతో సమీప ఇళ్ల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ యజమానులకు నోటీసులు జారీ చేస్తాం

డ్రెయినేజీల్లో వ్యర్థాలతో మురుగునీరు స్తంభిస్తోంది. వారానికోమారు కూడా పూడికతీయడం లేదు.

– బాలాజీ, కుమార్‌పల్లి మార్కెట్‌

సీఎంహెచ్‌ఓ: వాహనాలకు చెత్తను అందించకుండా కొంతమంది షాపుల యజమానులు డ్రెయినేజీల్లో పారబోస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. రోజూ పూడికతీసే విధంగా చొరవ తీసుకుంటా. షాపుల యజమానులు చెత్తను వాహనాలకు అందించాలి.

డ్రెయినేజీలు దెబ్బతిని మురుగునీరు రోడ్డుపై పారుతోంది. ఏ రోజుకారోజు క్లియర్‌ చేయడం లేదు.

– సయ్యద్‌ తసీన్‌

సీఎంహెచ్‌ఓ: ఇంజనీర్ల దృష్టికి తీసుకెళ్లి, డ్రెయినేజీల మరమ్మతులు చేసేలా చూస్తా. రోజూ కాల్వలు శుభ్రం చేసేందుకు సిబ్బందిని ఆదేశిస్తా.

రోడ్లు ఊడ్చడం లేదు. కాల్వల్లో పూడిక తీయడం లేదు. ఇదేంటంటే కార్మికుల కొరత ఉందంటున్నారు. – విక్రాంతరావు, విష్ణుపురి

సీఎంహెచ్‌ఓ: ప్రతి డివిజన్‌కు 25 నుంచి 30 మంది కార్మికులు పని చేస్తున్నారు. రోడ్లను ఊడ్చడంలో కొంత జాప్యమైనా, కాల్వలు శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.

అర్బన్‌ మలేరియా విభాగం సిబ్బంది నెలకోమారు కూడా ఫాగింగ్‌ చేయడం లేదు. డ్రెయినేజీల్లో రసాయనాలు పిచికారీ చేయడం లేదు. దోమల నియంత్రించలేకపోతున్నారు.

– పాలకుర్తి జగదీశ్వర్‌, జి.సాంబయ్య, మనోహర్‌, రాజ్‌కుమార్‌,పోలెపాక వెంకన్న, వీరస్వామితోపాటు మరికొందరు.

సీఎంహెచ్‌ఓ: కొన్ని రోజులుగా దోమల బెడద పెరిగిన మాట వాస్తవమే. డ్రెయినేజీల్లో ఆయిల్‌బాల్స్‌ వేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

ప్రజల సహకారంతో ఆరోగ్య నగరం : రాజేశ్‌

ప్రతీ ఇంటి నుంచి విధిగా తడి, పొడిచెత్తను వేర్వేరు డబ్బాల్లో నిల్వచేసి స్వచ్ఛ ఆటోలకు అందించాలి. రోడ్లపై, డ్రెయినేజీల్లో, ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. దోమల ఉధృతికి కారణాలవుతున్నాయి. ఓపెన్‌ ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీచేసి, జరిమానాలు విధిస్తాం. అవసరమైతే బల్దియా స్థల స్వాధీన బోర్డులు ఏర్పాటు చేస్తాం. నగరవాసులు ప్రత్యేక శ్రద్ధతో చెత్తను వాహనాలకు అందిస్తే 90 శాతం సమస్యలు పరిష్కారమవుతున్నాయి. అప్పుడే పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన నగరం సాధ్యమవుతోంది. నగరానికి మెరుగైన స్వచ్ఛ ర్యాంక్‌ వస్తుంది.

మరిన్ని వార్తలు