మన కితకితలు మనకు ఎందుకు నవ్వు తెప్పించవంటే..

1 Jun, 2023 11:56 IST|Sakshi

కితకితలు.. ఎవరికైనా ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటాయి. ఎవరైనా కితకితలు పెడుతున్నప్పుడు మనకు విచిత్ర అనుభూతి కలిగి, నవ్వు వస్తుంటుంది. ఇటువంటి సందర్భంలో పగలబడి నవ్విన ఉదంతాలు కూడా ఉంటాయి. సాధారణంగా చిన్నపిల్లలకు పెద్దవాళ్లు కితకితలు పెట్టడం చూస్తుంటాం. అటువంటప్పుడు పిల్లలు ఆనందంతో మెలికలు తిరిగిపోతూ నవ్వుతుంటారు. అయితే ఇక్కడున్న ఒక విచిత్ర విషయాన్ని చాలామంది గమనించివుండరు. ఎవరికి వారు కితకితలు పెట్టుకున్నప్పుడు నవ్వు రాదు.

ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కితకితలు అనుభూతికి రావడంలో మన మెదడులోని రెండు భాగాలు బాధ్యత వహిస్తాయి. వాటిలో మొదటిది కార్టిక్స్‌.. ఇది శరీరపు స్పర్శను అనుభూతి చెందుతుంది. ఇక రెండవది ఎంటీరియా సింగులెట్‌ కార్టిక్స్‌. ఇది ఆనందాన్ని, సెన్సేషన్‌ను అనుభూతి చెందుతుంది. మనకు మనం కితకితలు పెట్టుకున్నప్పుడు మెదడులోని సెరిబెల్మ్‌ భాగానికి ముందుగానే ఈ విషయం తెలిసిపోతుంది. దీంతో అది కార్టిక్స్‌కు ఆ సమాచారాన్ని అందిస్తుంది.

దీంతో కితకితలకు సిద్ధమైన కార్టిక్స్‌ అంతకుముందే విషయాన్ని గ్రహిస్తుంది. ఫలితంగా మనకు మనం కితకితలు పెట్టుకున్నా నవ్వురాదు. ఎటువంటి అనుభూతి కూడా కలుగదు. కితకితలను అనుభూతి చెందేందుకు సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ అనేది తప్పనిసరి. మనకు మనం కితకితలు పెట్టుకున్నప్పుడు మెదడు ముందుగానే శరీరానికి సిగ్నల్‌ పంపుతుంది. అందుకే మన కితకితలు మన అనుభూతికి అందవు. అయితే మనకు ఎవరైనా కితకితలు పెట్టినప్పుడు మన మెదడు ఆ సిగ్నల్‌ను కార్టిక్స్‌కు పంపలేదు. దీంతో మెదడు కితకితల అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండదు.

ఫలితంగా ఎవరైనా కితకితలు పెడితే వెంటనే ఎడతెగకుండా నవ్వువస్తుంది. అయితే ఇతరులు కితకితలు పెడుతుంటే మనం నవ్వడం కొంతవరకూ మంచిదేనని నిరూపితమయ్యింది. అప్పుడప్పుడు మన శరీరంపై ఏదైనా పురుగు లేదా కీటకం పాకినప్పుడు మనకు శరీరం జలదరిస్తుంది. వెంటనే ఆ పురుగును లేదా కీటకాన్ని తీసి బయట పారేస్తాం. మెదడు ఈ విధంగా కూడా మనకు రక్షణ కల్పిస్తుంది.  

మరిన్ని వార్తలు