మొదటగా రేపు 4వేల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ

15 Jan, 2021 17:43 IST|Sakshi

హైదరాబాద్‌: రేపటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రేపు తెలంగాణలోని 139 కేంద్రాల్లో సుమారు 4వేల మందికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. డీహెచ్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. వారంలో 4 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన నియమ నిబంధనలపై రూల్‌ బుక్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో వ్యాక్సిన్‌ను ఎవరికి ఇవ్వాలో, ఇవ్వకూడదో అన్న అంశంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన విధివిధానలపై ఆయన మాట్లాడుతూ..

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,213 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, అందులో మొదటి విడతగా రేపటి నంచి 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరానికి సంబంధించి రేపు 13 సెంటర్లలో వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. మొదటి ప్రాధాన్యతగా రేపు ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ చేయనున్నట్లు వెల‍్లడించారు. 

వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుందని, అందులో మొదటి డోసు, రెండో డోసు ఒకే రకమైనవిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పంపిణీ కేంద్రాల్లో కేవలం 30 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. వారంలో సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో మాత్రమే వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని నిమ్స్‌లో రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 
 

మరిన్ని వార్తలు