భారీగా పెరుగుతున్న నెట్‌ వినియోగం

10 May, 2021 15:12 IST|Sakshi

హైస్పీడ్‌ ఇంటర్నెట్‌కు జై కొడుతున్న నగరవాసులు

మహా నగరంలో నుమారు50 లక్షల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు...

వర్క్‌ ఫ్రం హోంతో పెరిగిన నెట్‌ వినియోగం 

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ ఇండియా బాటలో గ్రేటర్‌ నగరం శరవేగంగా ముందుకు దూసుకెళుతోంది. ఇంటర్నెట్‌ ఆధారిత సమాచార వినియోగంలో ముందుడే గ్రేటర్‌ నెటిజన్లు ఈ విషయంలో మరింత స్పీడు పెంచుతున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభణ కారణంగా మహానగరం పరిధిలోని వందలాది ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీలు వేలాది మందికి వర్క్‌ ఫ్రం హోంకు అనుమతించాయి. మరోవైపు మెజారిటీ నగరవాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. దీంతో ఇంటర్నెట్‌ వినియోగం అధికమైంది. ఉద్యోగులు, విద్యార్దులు, గృహిణులు అనే తేడా లేకుండా అందరికి నెట్ వినియోగం తప్పని సరైంది.

ఈ నేపథ్యంలో సాధారణ స్పీడ్‌ ఉండే ఇంటర్నెట్‌ కంటే, ఇప్పుడు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ వినియోగానికే గ్రేటర్‌సిటేజన్లు మొగ్గుచూపుతున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) తాజా అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా డిజిటల్‌ ఇండియా శకం సృష్టించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు 2021 చివరి నాటికి దేశంలో సుమారు 82 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ఇదే తరుణంలో మహానగరం కూడా ఇదే ట్రెండ్ నెలకొన్నట్లు పేర్కొంది. ఇక నెట్‌వినియోగానికి వస్తే గ్రేటర్ పరిధిలో సుమారు 50 లక్షలమంది నెటిజన్లు ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. మన దేశంలోని చెన్నై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ వంటి మహనగరాల్లో కూడా ఇంతే స్థాయిలో నెటిజన్లు ఉన్నట్లు ఈ అధ్యయనం అంచనా వేసింది. 

హైస్స్‌డ్‌ ఇంటర్నెట్‌కు ఆదరణ
గ్రేటర్‌ నగరంలో నెటిజన్లలో సుమారు 65 శాతం మంది ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లనే ఇష్టపడుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇతర టెలికాం సర్వీసుల కన్నా ఈ కనెక్షన్ల ద్వారా ఇటు ఆర్థికంగా.. అటు సమాచార పరంగా మెరుగైన సర్వీసులు పొందుతున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారట. ఇక స్పీడు విషయానికి వస్తే ప్రధానంగా 60 నుంచి 100 మెగా బైట్స్‌ పర్‌ సెకన్‌ స్పీడున్న ఇంటర్నెట్‌కే మెజార్టీ సిటీజన్లు ఓటేస్తున్నారట. సర్వసాధారణంగా 2.5 మెగాబైట్స్‌ పర్‌ సెకండ్‌ స్పీడు ఉండే నెట్‌ వినియోగానికి ఆదరణ క్రమంగా తగ్గున్నట్లు వెల్లడించింది. 

ఇక హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అంటే 60,100 ఎంబీపీఎస్‌ వేగం ఉన్న నెట్‌.. సాధారణ 2.5 ఎంబీపీఎస్‌ నెట్‌కంటే 400 రెట్లు అధిక సామర్థ్యం,వేగం ఉంటుందని, కావాల్సిన సమాచారం డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు పది నిమిషాల వ్యవధిలో ఏకంగా అత్యంత స్పష్టత,భారీ నిడివిగల 10 హెచ్‌డీ(హై డిఫినిషన్‌) వీడియోలను డొన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇక సమాచారం డౌన్‌లోడ్‌ చేసుకోవడమే కాదు... సంబంధిత సమాచారాన్ని తక్కువ వ్యవధిలో యూఎస్‌బీ డైవ్‌ద్వారా ఇతరులకు షేర్‌, చేయడం కూడా సులభంగా మారిందన్నారు. గ్రేటర్‌లో 5 మెగాబైట్స్‌ పర్‌ సెకన్‌, ఒక గెగా టైట్‌ పర్‌ సెకన్‌ స్పీడున్న నెట్‌వినియోగానికి అయ్యే ఖర్చు ఇతర మెట్రోనగరాలతో పోలిస్తే తక్కువేనని వెల్లడించింది.

చదవండి:

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్

మరిన్ని వార్తలు