‘డిజిటల్‌ సర్వే’లో 5వేల మందికి ఉద్యోగావకాశాలు

3 Oct, 2020 18:39 IST|Sakshi

దరఖాస్తు చేసుకోవాలంటే టెన్త్‌ ఉత్తీర్ణత తప్పనిసరి

నెల ‌రోజుల్లో మిలియ‌న్ సర్వేలే ‘టీటా’ టార్గెట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: యువతకు డిజిటల్‌ లిటరసీపై అవగాహన కల్పిస్తూ నైపుణ్యాన్ని మెరుగుపరిచిన తెలంగాణ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) మరో శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడో ఆర్థిక సర్వే(డిజిటల్‌)లో ఎన్యూమరేటర్లుగా దాదాపు ఐదారువేల మందికి అవకాశం కల్పించబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని ‘టీటా’ ప్రెసిడెంట్‌ సందీప్‌ మక్తాల విడుదల చేసి సర్వేను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఐటీ అసోసియేష‌న్ అనుబంధ సంస్థ డిజిథాన్‌తో కలిసి ‘సీఎస్‌సీ’ ఈ స‌ర్వేను నిర్వ‌హిస్తున్నదని తెలిపారు.

సర్వేలో భాగంగా ప‌ది ల‌క్ష‌ల నివాసాల‌కు వాలంటీర్లు వెళ్లి మొబైల్ యాప్‌ ద్వారా వివరాలు సేకరిస్తారని తెలిపారు. గ్రేట‌ర్ ప‌రిధిలో 573 ఇన్వెస్టిగేట‌ర్ యూనిట్లు ఉన్నాయని, ఒక్కో యూనిట్‌కు ప‌ది మంది వ‌ర‌కు ఎన్యూమ‌రేట‌ర్లు అవసరమని ఆయన వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, స్మార్ట్ ఫోన్ వాడకంలో పరిజ్ఞానం కలిగి ఉన్నవారు bit.ly/censussurvey  వెబ్‌సైట్‌లో త‌మ వివ‌రాలు న‌మోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని సందీప్‌ చెప్పారు. ఈ డిజిటల్‌ సర్వేను సీఎస్‌సీ హైదరాబాద్ విభాగం మేనేజ‌ర్ ప‌ర్య‌వేక్షిస్తున్నారని, మరిన్ని వివరాలకు కార్యాలయ వేళల్లో 6300368705/  9542809069/ 7989702090/ 9948185053 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. 

మరిన్ని వార్తలు