-

చుట్టాల్లా వెళ్లి పట్టేశారు!

24 Feb, 2023 07:46 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నగల తయారీ కేంద్రంలో పని చేస్తూ రూ.కోటి విలువైన వజ్రాభరణాలతో ఉడాయించిన కార్మికులను పట్టుకోవడానికి పోలీసులు వారి చుట్టాలుగా మారారు. ఇలానే పశ్చిమ బెంగాల్లోని హౌరాలో గాలించి నలుగురిని అరెస్టు చేశారు. నిందితులను అక్కడి కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్‌ వారెంట్‌పై సొత్తుతో సహా సిటీకి తీసుకువచ్చినట్లు మధ్య మండల డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. ఏసీపీ పూర్ణచంద్రర్‌తో కలిసి గురువారం వివరాలు వెల్లడించారు.

ఆర్థిక ఇబ్బందులతోనే...
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పరిసర ప్రాంతాలకు చెందిన హిమాన్షు సర్దార్‌, మహదేబ్‌ సర్దార్‌, ఉత్తమ్‌ ఓఝా ఐదేళ్ల క్రితం బతుకు తెరువు కోసం నగరానికి వలసచ్చారు. ఉప్పుగూడలోని లలితబాగ్‌లో ఉంటూ అబిడ్స్‌లోని ఆర్‌వీజే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో కార్మికులుగా పని చేస్తున్నారు. బంగారు, వజ్రాభరణాలు తయారు చేసే ఈ సంస్థకు గోపాల్‌ కృష్ణ డైరెక్టర్‌గా ఉన్నారు. వీరు కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాన్షు, ఉత్తమ్‌ కుటుంబీకులు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో వీరికి పెద్ద మొత్తంలో నగదు అవసరమైంది. ఇదే కార్ఖానాలో పని చేసేందుకు మూడు నెలల క్రితం హౌరాకే చెందిన కార్తీక్‌ బాగ్‌ వచ్చాడు.

కార్తీక్‌ సలహాతో...
అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముగ్గురూ అతడు ఇచ్చిన సలహా నేపథ్యంలోనే తుది మెరుగుల కోసం యజమాని ఇచ్చిన సొత్తుతో ఉడాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న గోపాల్‌ కృష్ణ రూ.కోటి విలువ చేసే 83 తులాల బంగారు ఆభరణాలు, 119 క్యారెట్ల వజ్రాలు, విలువైన రాళ్లు వీరికి అప్పగించాడు. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు వీటిని తీసుకున్న నలుగురూ ఓ పెట్టెలో పెట్టుకుని మధ్యాహ్నం అక్కడినుంచి ఉడాయించారు. గోపాల్‌ కృష్ణ ఫిర్యాదుతో అబిడ్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్‌ బి.ప్రసాదరావు, డీఐ బి.అభిలాషతో కూడిన బృందం వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ ఆధారంగా నిందితులు నలుగురూ ట్యాక్సీ, బస్సుల్లో విజయవాడ వెళ్లి అక్కడ హౌరా వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారు.

ఏ మాత్రం సమాచారం అందకుండా...
దీంతో ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుని గోపాల్‌ కృష్ణ ఇచ్చిన ఆధార్‌ కార్డుల ఆధారంగా గాలింపు చేపట్టారు. పోలీసుల రాకపై ఏ మాత్రం ఉప్పందినా నిందితులు పారిపోతారని భావించిన పోలీసులు ‘చుట్టాలుగా’ మారారు. తాము కార్తీక్‌ ఇంటికి వచ్చిన బంధువులమని, చాలా కాలం తర్వాత రావడంతో ఇల్లు గుర్తించలేకపోతున్నామని, అతడి ఫోన్‌ పని చేయట్లేదని స్థానికులకు చెప్పారు. అప్పటికే అతడు మిగిలిన ముగ్గురు నిందితులతో పాటు వచ్చి ఉండటంతో వీళ్లూ అతడి బంధువులై ఉండవచ్చునని భావించిన స్థానికులు స్పందించారు. ఇలా ఇంటిని గుర్తించిన టీమ్‌ స్థానిక పోలీసులను రప్పించి దాడి చేసింది. నలుగురు నిందితులతో పాటు సొత్తునూ స్వాధీనం చేసుకుంది. ఈ బృందాన్ని అభినందించిన డీసీపీ రివార్డు అందించారు.

మరిన్ని వార్తలు