నో సేఫ్టీ @ స్వప్నలోక్‌

18 Mar, 2023 04:58 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని అత్యంత పురాతనమైన స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అవసరమైన స్థాయిలో ఫైర్‌ సేఫ్టీ మెజర్స్‌ లేవు. కొద్దోగోప్పో ఉన్నవి కూడా పని చేయకుండా నామ్‌ కే వాస్తేగా మారాయి. అత్యాధునిక, అత్యంత ఖరీదైన ఉపకరణాల మాట అటుంచితే కనీసం ఓ సైరన్‌ ఉన్నా విలువైన ఆరు ప్రాణాలు దక్కేవని అధికారులు చెబుతున్నారు.

ఆ వేళల్లోనే ప్రాణనష్టానికి ఆస్కారం...
ఉస్మాన్‌గంజ్‌ కార్తికేయ లాడ్జ్‌, బోయగూడలోని స్క్రాప్‌ దుకాణంలో, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని రూబీ లాడ్జ్‌లాంటి అనేక ప్రమాదాల్లో భారీ ప్రాణనష్టం నమోదైంది. అయితే ఇవన్నీ అర్ధరాత్రి లేదా తెల్లవారుజాముల్లోనే చోటు చేసుకున్నాయి. ఆయా సమయాల్లో వాటిలో ఉండే కస్టమర్లు, కార్మికులు నిద్రలో ఉంటారు. ఫలితంగా అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని అప్రమత్తం కావడానికి, చేయడానికి ఆస్కారం ఉండదు. ఈ కారణంగానే అనేక మంది నిద్రలోనే తుదిశ్వాస విడుస్తుండటంతో మృతుల సంఖ్య ఉండటం, పెరగడం జరుగుతుంటాయి.

స్వప్నలోక్‌లో ఆ సమయం కాకపోయినా...
ఈ సమయాల్లో కాకుండా ఉదయం పూట, పని వేళలతో పాటు సాధారణ సమయాల్లోనూ సిటీలో అగ్నిప్రమాదాలు జరిగాయి. సోమాజీగూడలోని పార్క్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లోనూ 2011లో పట్టపగలు భారీ ఫైర్‌ యాక్సిడెంట్‌ చోటు చేసుకుంది. అప్రమత్తతమైన అధికారులు దాదాపు 50 మందిని రెస్క్యూ చేయగలిగారు. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోనూ గురువారం రాత్రి 7.15 గంటలకే మంటలు రేగాయి. ఈ విషయం కొందరు దుకాణదారులు గుర్తించి బయటకు వచ్చేశారు. దీనిపై అప్రమత్తం చేయడానికి ఫైర్‌ అలెర్ట్‌ సైరన్‌, అలారం ఉండి, ప్రతి ఫ్లోర్‌లోను స్విచ్‌లు ఏర్పాటు చేస్తే పరిస్థితి వేరుగా ఉండేది. పొగలు చుట్టుముట్టక ముందే ఆ ఆరుగురూ కూడా బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకోవడానికి ఆస్కారం ఉండేది.

నోటీసులకు సమాధానమూ ఇవ్వలేదు...
సికింద్రాబాద్‌లోని మినిస్టర్స్‌ రోడ్‌లోని డెక్కన్‌ మాల్‌లో ఈ ఏడాది జనవరిలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో నగరంలో ఉన్న షాపింగ్‌ మాల్స్‌, భారీ భవనాల్లో అగ్నిమాపక, జీహెచ్‌ఎంసీ బృందాలు తనిఖీలకు ఉపక్రమించాయి. వీటిలో భాగంగా స్వప్నలోక్‌నూ సందర్శించిన టీమ్స్‌ భద్రతా లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేశాయి. వాటిని సరి చేయడంపై అసోసియేషన్‌ అవసరమైన స్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగిన ఆరుగురు యువత అశువులు బాశారు. ఈ కాంప్లెక్స్‌కు నోటీసులు ఇచ్చిన అధికారులు సైతం పరిస్థితుల్లో ఏదైనా మార్పు వచ్చిందా? లేదా? అన్నది పట్టించుకోలేదు.

మరిన్ని వార్తలు