-

‘ప్రైవేటు’ గాలం!

27 Mar, 2023 04:34 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ అడ్మిషన్లు జోరందుకున్నాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నాయి. పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాకముందే కొన్ని కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో 70 శాతానికి పైగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయగా, మరికొన్ని ప్రైవేటు కాలేజీ అడ్మిషన్ల కోసం విద్యార్థుల వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేసి బంగారు భవిష్యత్తు అందిస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. అడ్మిషన్ల కోసం ప్రతిభ పరీక్షలు ప్రత్యేక స్కాలర్‌ షిప్‌తో ఫీజులో రాయితీ ప్రకటిస్తున్నాయి.

ఒక్కసారి కాలేజీని సందర్శించడంటూ పదే పదే టెలికాలర్స్‌ ద్వారా ఫోన్లు చేయించడం షరామామూలుగా మారింది. మరోవైపు పదో తరగతి పరీక్షలకు ఆన్‌లైన్‌ గైడెన్స్‌ అంటూ గాలం వేస్తున్నాయి. వాస్తవంగా 2023–24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల నోటికేషన్‌ విడుదల కాకుండానే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించవద్దని ఇటీవల ఇంటర్మీడిట్‌ బోర్డు హెచ్చరికలు జారీ చేసిన విషయంవిదితమే.

అడ్డుకట్ట పడదా?
● ప్రైవేటు కళాశాలల ఇష్టారాజ్యంపై అడ్డు వేస్తామనే అధికారుల హెచ్చరికలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. కళాశాలల నియంత్రణపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు ప్రతిపాదనలకు కూడా మోక్షం లభించడం లేదు. కాలేజీల ఫీజుల విషయం పక్కకు పెడితే కనీసం ఇంటర్‌ బోర్డు జారీ చేసే అడ్మిషన్ల షెడ్యూల్‌తో సంబంధం లేకుండానే పీఆర్‌ఓ వ్యవస్థ ద్వారా ఆయా కళాశాలలు తమ అడ్మిషన్లను ముందుగానే పూర్తి చేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.

● ప్రతిసారీ ప్రభుత్వ ఆలోచన సైతం ఆచరణలో అమలు కావడం లేదు. తాజాగా ఫలితాల వెల్లడి సమయంలో విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఆయా కళాశాలలు భారీగా ప్రకటనలు ఇస్తూ ఆకర్షించడం సర్వసాధారణంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ర్యాంకుల పేరిట ప్రకటనలు ఇవ్వకూడదు.

● కళాశాలల పేరిట కూడా నేరుగా ప్రకటనలు ఇవ్వడానికి అవకాశం లేదు. ఇవేవీ పట్టించుకోకుండా కళాశాలలు ప్రతిసారీ భారీ ఎత్తున ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు