డింపుల్‌ హయతి ఇంట్లోకి ఇద్దరు అపరిచితులు

26 May, 2023 04:52 IST|Sakshi

అదుపులోకి తీసుకున్న పోలీసులు

బంజారాహిల్స్‌: ఐపీఎస్‌ అధికారితో పార్కింగ్‌ వివాదంలో వార్తల్లోకెక్కిన సినీ నటి డింపుల్‌ జేపీ అలియాస్‌ డింపుల్‌ హయతి ఇంట్లోకి గురువారం ఉదయం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించడంతో ఆందోళకు గురైన ఆమె డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. పోలీసులు ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. జర్నలిస్టు కాలనీ, ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌లో నివసించే డింపుల్‌ హయతి ఇంట్లోకి గురువారం ఉదయం కొప్పిశెట్టి సాయిబాబు, శృతి లిఫ్ట్‌ ద్వారా నేరుగా ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో ఆమె మీరెవరంటూ ప్రశ్నించగా వీరాభిమానులమని చెప్పారు.

వారి వైఖరిపై అనుమానం రావడంతో డయల్‌ 100కు ఫిర్యాదు చేసింది. గత నాలుగైదు రోజులుగా అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే ఐపీఎస్‌ అధికారి రాహుల్‌హెగ్డేతో ఆమె పార్కింగ్‌ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకు ప్రశ్నించగా తాము డింపుల్‌ హయతికి అభిమానులమని ఆమెను కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై డింపుల్‌ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బయటికి వెళ్లేందుకు భయపడుతున్నారు
సినీ నటి డింపుల్‌ హయతిపై డీసీపీ రాహుల్‌ హెగ్డే తప్పుడు ఫిర్యాదు చేశారని తన కారు కవర్‌ తీసేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం జరిగిందని డింపుల్‌ ఆ కవర్‌ తొలగించినట్లుగా సీసీ ఫుటేజీలు బయట పెట్టాలని ఆమె తరపు న్యాయవాది పాల్‌ సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీసీపీ తన డ్రైవర్‌ను కాపాడుకునేందుకు ఇదంతా చేస్తున్నారన్నారు. హీరోయిన్‌ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశిస్తున్నారని దీంతో ఆమె బయటికి వెళ్లడానికే బయటపడుతోందన్నారు. డీసీపీతో పాటు ఆయన డ్రైవర్‌ చేతన్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు