5

26 May, 2023 04:54 IST|Sakshi
ఎకరాలుంటేనే...
లే అవుట్‌!

సాక్షి, సిటీబ్యూరో: ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలను పరిరక్షించడంతో పాటు 111 జీఓ పరిధిలోని 84 గ్రామాల్లో కాంక్రీట్‌ జంగిల్‌గా అస్తవ్యస్తంగా కాకుండా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ భావిస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారుల కమిటీ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనతో పాటు భవన నిర్మాణ నిబంధనలలో పలు సవరణలు చేయాలని నిర్ణయించింది. సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ), బఫర్‌ జోన్‌లు, గ్రీన్‌ బెల్ట్‌లు, వంద అడుగుల వెడల్పాటి అప్రోచ్‌ రోడ్లు, భూ వినియోగం, పార్కింగ్‌ వంటి పలు కఠినతర నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు.

నిబంధనల్లో సవరణలు?

ఆ 84 గ్రామాలలో కొన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తున్నప్పటికీ.. 111 జీఓ గ్రామాలన్నింటికీ హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) భవన నిర్మాణ నిబంధనలే వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. హెచ్‌ఎండీఏ పరిధిలో లే– అవుట్‌ అనుమతులు జారీ చేయాలంటే కనీసం ఎకరం విస్తీర్ణం ఉండాల్సిందే. కానీ.. 111 జీఓ పరిధిలో మాత్రం ఇలా చిన్నా చితకా వాటికి కాకుండా కనిష్టంగా అయిదెకరాలు, అంతకుమించి ఉండే స్థలాలకు మాత్రమే లేఅవుట్‌ పర్మిషన్లు మంజూరు చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనలలో సవరణలు చేయాలని ఉన్నతాధికారుల కమిటీ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. కొత్తగా రూపుదిద్దుకుంటున్న మాస్టర్‌ ప్లాన్‌లో ఈ కొత్త నిబంధనలను పొందుపరచనున్నారు. రోడ్ల వెడల్పు, లే–అవుట్‌ విస్తీర్ణం, భూ వినియోగం, పార్కింగ్‌ నిబంధనలు తదితర అంశాలలో మున్సిపాలిటీలతో పోలిస్తే హెచ్‌ఎండీఏ నిబంధనలు చాలా కఠినతరంగా ఉండనున్నాయని ఓ అధికారి తెలిపారు.

వంద ఎకరాలకు మించితే..

111 జీఓ పరిధిలో నివాస సముదాయాలతో పాటు వినోద కేంద్రాల నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. 100 ఎకరాలు, 20 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి చేయాలని కమిటీ నిర్ణయించింది. అంతేకాకుండా నీటి వనరులకు 100 మీటర్లు, నాలాకు 50 మీటర్ల దూరంలో ఉంటే నీటిపారుదల, రెవెన్యూ శాఖల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) తప్పనిసరి అని అధికారులు తెలిపారు.

వీటికి అనుమతులు లేవు..

జంట జలాశయాలు కాలుష్యం ప్రధాన ఆందోళనగా ఉన్న నేపథ్యంలో మూసీ పొడవునా, రెండు రిజర్వాయర్ల చుట్టూ మురుగునీటి శుద్ది కేంద్రాలు (ఎస్‌టీపీ)లను నిర్మించనున్నారు. నది సరిహద్దు నుంచి 50 మీటర్ల వరకూ ఏ తరహా నిర్మాణాలకు అనుమతి లేదు. భారీ వాణిజ్య సముదాయాలు, కాలుష్యాన్ని వెదజల్లే పారిశ్రామిక నిర్మాణాలకు అసలు అనుమతులు ఉండవని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. పూర్తి చెరువు సామర్థ్యం (ఎఫ్‌టీఎల్‌), లేక్‌ బెడ్స్‌, 500 మీటర్ల వరకు బఫర్‌ జోన్‌ పరిధిలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతినివ్వరు.

హెచ్‌ఎండీఏలో ఎకరమే..

111 జీఓ పరిధిలో అయిదుండాల్సిందే

భవన నిర్మాణ నిబంధనలలో సవరణలకు కమిటీ నిర్ణయం

నివాసాలు, వినోద కేంద్రాల నిర్మాణాలకే అనుమతులు

భారీ వాణిజ్య సముదాయాలు, కాలుష్య పరిశ్రమలకు అనుమతుల్లేవ్‌

100 ఎకరాలు, 20 వేల చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణ నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి

మరిన్ని వార్తలు