గ్రేటర్‌లో రూట్‌పాస్‌

26 May, 2023 04:54 IST|Sakshi

ఈ నెల 27 నుంచి అమల్లోకి తీసుకురానున్న ఆర్టీసీ

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఆర్టీసీ ‘జనరల్‌ రూట్‌ పాస్‌’ను ప్రవేశపెట్టనుంది. టి–24, టి–6, ఎఫ్‌–24 వంటి టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్‌ పాస్‌కు రూపకల్పన చేశారు. కేవలం 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలు సాగించే ప్రయాణికులు దీనిని వినియోగించుకోవచ్చు. ఈ నెల 27 నుంచి రూట్‌పాస్‌ అందుబాటులోకి రానుంది. నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్‌ బస్‌ పాస్‌కు రూ.600, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూట్‌ పాస్‌కు రూ.1000 చొప్పన ధర నిర్ణయించారు. దీంతోపాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొదట నగరంలోని 162 రూట్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. రూట్‌ పాస్‌ వినియోగదారులు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఆదివారాలు,ఇతర సెలువు రోజుల్లోనూ ప్రయాణించవచ్చు.

ప్రారంభ ఆఫర్‌...

సాధారణంగా ఆర్టినరీ రూట్‌ పాస్‌కు రూ.800, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూట్‌ పాస్‌కు రూ.1200 ఉంటుంది. కొత్తగా ప్రారంభిస్తున్న దృష్ట్యా రూ.200 రాయితీని కల్పించి.. సిటీ ఆర్డీనరీ రూట్‌ బస్‌ పాస్‌ను రూ.600, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూట్‌ పాస్‌ రూ.1000కే అందిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. గ్రేటర్‌లో ప్రస్తుతం 1.30 లక్షల జనరల్‌ మెట్రో, 40 వేల ఆర్డినరీ పాస్‌లు ఉన్నాయి. రూట్‌పాస్‌లను కూడా ప్రయాణికులు ఆదరించాలని ఆయన కోరారు. రూట్‌ల వివరాలను ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఎండీ పేర్కొన్నారు.

8 కి.మీ పరిధిలో రాకపోకలకు వర్తింపు

ఆర్డినరీ పాసు రూ.600, మెట్రో ఎక్స్‌ ప్రెస్‌కు రూ.1000

మరిన్ని వార్తలు