ఫేక్‌ ఐటీ ఐటీ అధికారుల పేరుతో హల్‌చల్‌

28 May, 2023 09:04 IST|Sakshi

హైదరాబాద్: హీరో సూర్య నటించిన ‘గ్యాంగ్‌’ సినిమా తరహాలో కొందరు దుండగులు ఐటీ అధికారులమంటూ కిలో 700 గ్రాముల బంగారాన్ని తస్కరించిన ఘటన శనివారం మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవన్‌ మధుకర్‌ స్థానికంగా సిద్ధివినాయక జ్యువెలర్స్‌ పేరుతో దుకాణంతో పాటు పాట్‌ మార్కెట్‌లోని నవ్‌కార్‌ కాంప్లెక్స్‌లోని 4వ అంతస్తులో బంగారు నగలు మెల్టింగ్‌ కార్ఖానా నిర్వహిస్తున్నారు.

శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో అయిదుగురు గుర్తు తెలియని వ్యక్తులు పాట్‌ మార్కెట్‌లోని కార్ఖానాకు తాము ఐటీ అధికారులమంటూ వచ్చి గుర్తింపు కార్డులు చూపించారు. కార్ఖానాలో ఉన్న బంగారం వివరాలు కావాలని కోరారు. దీంతో వర్కర్లు అక్కడే ఉన్న కిలో 700 గ్రాముల బంగారం బిస్కెట్లను చూపించారు. దీంతో వారు ఆ బంగారాన్ని తీసుకున్నారు.

తమ యజమానితో ఫోన్‌లో మాట్లాడాలని పని చేసే వాళ్లు చెప్పినా వినకుండా వారి ఫోన్లను లాక్కున్నారు. బంగారం బిస్కెట్లు తీసుకున్న నిందితులు గది బయటకు వచ్చి గడియపెట్టి ఉడాయించారు. అనుమానం వచ్చిన వర్కర్లు గదిలోంచి కేకలు వేయడంతో పక్కన ఉన్న వాళ్లు వచ్చి గడియ తీశారు. అనంతరం విషయం యజమానికి తెలియజేయడంతో ఆయన బావమరిది వికాస్‌ కేదేకర్‌ మార్కెట్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు, ఏసీపీ రమేష్‌, డీసీపీ చందనా దీప్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వికాస్‌ కేదేకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అంతా 5 నిమిషాల్లోనే..
ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని, నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని డీసీపీ చందన దీప్తి చెప్పారు. నిందితులు అయిదుగురు నడుచుకుంటూ వచ్చి చోరీ చేశారని, షాపులో పనిచేసే వ్యక్తులు పెద్దగా చదువుకోకపోవడంతో గుర్తింపు కార్డులు పరిశీలించలేదని ఆమె చెప్పారు. ఒక్కో బిస్కెట్‌ 100 గ్రాములు ఉంటుందని మొత్తం 17 బంగారు బిస్కెట్లు తీసుకుని వెళ్లారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆమె చెప్పారు. నిందితులు ఉదయం 11.30 గంటలకు పాట్‌ మార్కెట్‌ నవ్‌కార్‌ కాంప్లెక్స్‌లోని 4వ అంతస్తుకు వచ్చారు. బయట నుంచి నడుచుకుంటూ పైకి వెళ్లిన నిందితులు కార్ఖానాలో పని చేసే నిందితులను బెదిరించి బంగారు బిస్కెట్లను తీసుకుని 5 నిమిషాల్లో బయటకు వచ్చారని ఆమె చెప్పారు.

తెలిసినవారి పనేనా?
పాట్‌ మార్కెట్‌లో వందల సంఖ్యలో బంగారు దుకాణాలు, నగలు తయారు చేసే కార్ఖానాలు, హోల్‌సేల్‌ వ్యాపారులు ఉంటారు. చిన్నచిన్న మడిగెల్లో కోట్ల రూపాయల వ్యాపారాలు నడుస్తుంటాయి. గత కొద్ది నెలల క్రితమే మహారాష్ట్రకు చెందిన రేవన్‌ మధుకర్‌ అనే వ్యక్తి ఇక్కడ బంగారు నగలు కరిగించే కార్ఖానా ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు వ్యక్తులు పనిచేస్తుండగా ఒకరు కర్ణాటక, మిగతా వాళ్లు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు ఉన్నారు. గజిబిజిగా ఉండే ఈ ప్రాంతంలో ఇదే కార్ఖానాను ఎన్నుకుని దొంగతనానికి పాల్పడటం.. తెలిసిన వారి పనే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. షాపు యజమాని కూడా మూడు రోజుల నుంచి మహారాష్ట్రలో బంధువుల వివాహానికి వెళుతూ ఆయన బావమరిది వికాస్‌కు షాపును అప్పగించాడు. దుండగులు హిందీ భాష మాట్లాడుతుండటంతో ఇది తెలిసిన వారే స్కెచ్‌ వేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

అదుపులో పనివాళ్లు
దుకాణంలో పని చేసే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. వీరి ఫోన్ల సంభాషణలపై ఆరా తీస్తున్నారు. నిందితులు ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వెళ్లారు? తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు మహంకాళి ఏసీపీ రమేష్‌, ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపారు.

మరిన్ని వార్తలు