కరాటే కల్యాణిని ‘మా’ సస్పెండ్‌ చేయడం దారుణం

30 May, 2023 08:10 IST|Sakshi
మాట్లాడుతున్న కరాటే కళ్యాణి

పంజగుట్ట: మానవుడి రూపం దేవుడికి ఇవ్వరాదని పోరాటం చేసిన కరాటే కళ్యాణిని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నుంచి సస్పెండ్‌ చేయడం దారుణమని.. మా వెంటనే ఆ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని పలు యాదవ, హిందూ సంఘాలు డిమాండ్‌ చేశాయి. కళ్యాణి ఎన్‌టీఆర్‌ను, సినీ పరిశ్రమను ఎప్పుడూ కించపరచలేదని, శ్రీ కృష్ణునికి ఎన్‌టీఆర్‌ రూపం ఇవ్వరాదనే పోరాటం చేసిందన్నారు.

సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్‌, రామచంద్ర యాదవ్‌, చలకాని వెంకట్‌ యాదవ్‌లు మాట్లాడుతూ... భగవంతునికి మానవరూపం ఇవ్వరాదని ఒక ఆడబిడ్డ పోరాటం చేస్తే సంబంధంలేని ‘మా’ సస్పెండ్‌ చేయడం సరికాదన్నారు.

బలహీనవర్గాలకు చెందిన ఓ మహిళను సస్పెండ్‌ చేయడంతో సినీ పరిశ్రమ ఒక సామాజిక వర్గానికి చెందిందిగా అర్థం అవుతుందన్నారు. వెంటనే సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోకపోతే హైదరాబాద్‌లో ఉన్న 20 లక్షల మంది యాదవులు ఐక్యమై పోరాటం చేస్తామన్నారు. త్వరలోనే మంచు విష్ణును కలిసి ఈ విషయమై చర్చిస్తామని పేర్కొన్నారు. కరాటే కళ్యాణి మాట్లాడుతూ... తాను ఎన్‌టీఆర్‌ను ఎప్పుడూ కించపరచలేదని, తాను కూడా ఎన్‌టీఆర్‌ అభిమానినే అన్నారు. కృష్ణుడి రూపంలో ఎన్‌టీఆర్‌ అనే కాకుండా ఎవరు పెట్టినా ఊరుకునేది లేదన్నారు.

ఈ విషయంపై ‘మా’ షోకాజ్‌ నోటీసులు ఇవ్వడమే వ్యాలిడిటీ కాదు సస్పెన్షన్‌ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాను ఒక యాదవ సంఘం నాయకురాలిగా మాట్లాడానన్నారు. త్వరలో సస్పెన్షన్‌ ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. లేనిపక్షంలో పోరాడతానన్నారు. సమావేశంలో మహేష్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, రమేష్‌ యాదవ్‌, రాధాకృష్ణ, మారుతి రామారావు, నగేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు