వివాహేతర సంబంధమే ప్రాణం తీసిందా?

30 May, 2023 07:22 IST|Sakshi

హయత్‌నగర్‌: అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువకుడి మృతదేహం సోమవారం హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో కలకలం సృష్టించింది. యువకుడిని ఎవరైనా హత్య చేశారా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కుంట్లూర్‌లోని డాక్టర్స్‌ కాలనీ వెంచర్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం వద్ద లబించిన సెల్‌ఫోన్‌ ఆధారంగా అతని స్నేహితుడు చైతన్యపురికి చెందిన సాయి ప్రకాష్‌ను పిలిపించి చూపించగా.. మృతదేహం తన స్నేహితుడు అల్లెవుల రాజేష్‌(24)దిగా గుర్తించాడు. ఘటనా స్థలాన్ని ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు పరిశీలించి ఆధారాలు సేకరించారు. రాజేష్‌ నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్యచేసి ఇక్కడ మృతదేహాన్ని ఇక్కడ పడేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. రాజేష్‌కు ఓ ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆమె కుటుంబ సభ్యులు రాజేష్‌ను మందలించినట్లు తెలిసింది. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పోలీసులు అతని స్నేహితులను పిలిపించి విచారిస్తున్నారు. హాస్టల్‌ సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నాడు..
ములుగు జిల్లా పంచాక్తులపల్లికి చెందిన అల్లెవుల పరశురాం కుమారుడు రాజేష్‌ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని శ్రీ హిందూ కళాశాలలో ఇటీవలే బీటెక్‌ పూర్తి చేశాడు. పైచదువల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనే ఉద్దేశంతో గత మార్చి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ.. దానికి సంబంధించిన పత్రాలను సమకూర్చుకునే పనిలో ఉన్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు చెప్పారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వెళతానని చెప్పిన రాజేష్‌ ఇలా శవమై కనిపించాడని వారు భోరున విలపించారు.

ఇటీవలే నా వద్దకు వచ్చి వెళ్లాడు..
రాజేష్‌ ఇటీవల రెండు రోజులు తన దగ్గర ఉండి వెళ్లాడని స్నేహితుడు సాయిప్రకాష్‌ చెబుతున్నాడు. అనంతరం ఈ నెల 22న ఇబ్రహీంపట్నం వెళ్లాడని, మరునాడు ఇంటికి వెళతున్నాను డబ్బులు వేయమంటె వేశానని సాయిప్రకాష్‌ చెప్పాడు. ఈ నెల 26న ఫోన్‌ చేస్తే రింగయ్యింది కానీ లిఫ్ట్‌ చేయలేదని 27న ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చిందని తెలిపాడు.

మరిన్ని వార్తలు