వివాహేతర సంబంధం.. నగల కోసం ఘాతుకం

6 Jun, 2023 11:00 IST|Sakshi

హైదరాబాద్: ఇంట్లోని ఒంటరి వృద్ధురాలిని హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకెళ్లిన ఘటన సోమవారం హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. నిందితులను కొద్ది గంటల్లోనే పోలీసులు అరెస్టు చేసి.. సొమ్మును స్వాధీనపర్చుకున్నారు. సోమవారం రాత్రి ఎల్‌బీనగర్‌ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ సాయిశ్రీ వివరాలను వెల్లడించారు. తొర్రూర్‌ గ్రామానికి చెందిన సంరెడ్డి సత్యమ్మ (82) ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె పెద్ద కుమారుడు సంరెడ్డి బాల్‌రెడ్డి వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో ఉంటున్నారు.

చిన్న కుమారుడు గోపాల్‌రెడ్డి ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు.ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన ఎండ్ల రాకేష్‌ (28) ఏడాదిన్నర క్రితం హయత్‌నగర్‌ మండలంలోని తొర్రూర్‌కు వచ్చి తన సోదరుడు చంద్రశేఖర్‌ కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో ఉంటున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల బయ్యారానికి చెందిన గుండపాటి లలిత (34) కూలి పనుల కోసం తొర్రూర్‌కు వచ్చి సత్యమ్మ ఇంట్లోని ఓ గదిలో అద్దెకు ఉంటోంది. చంద్రశేఖర్‌ భవన నిర్మాణ పనులకు వచ్చే సమయంలో లలితతో రాకేష్‌కు పరిచయమైంది.

వీరు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో లలిత కోసం వచ్చే రాకేష్‌.. సత్యమ్మతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె వద్ద బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించాడు. నెల రోజుల క్రితం సత్యమ్మ బంగారు ఆభరణాలను దొంగిలించడానికి పథకం పన్నాడు. కానీ.. వీలు కాకపోవడంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.

ముఖంపై దిండు పెట్టి.. ఊపిరాడకుండా చేసి..
సత్యమ్మ పెద్ద కుమారుడు బాల్‌రెడ్డి వియ్యంకుడైన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూతురు వివాహానికి శనివారం వెళ్లి.. ఆదివారం సాయంత్రం తిరిగి వచ్చింది. ఆ సమయంలో ఆమె బంగారు ఆభరణాలు ధరించి ఉండటాన్ని రాకేష్‌ గమనించాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో దొంగతనం చేయాలని ప్లాన్‌ వేసుకున్నాడు. రాత్రిపూట సత్యమ్మ ఇంటి ముందు కూర్చొని ఉండగా రాకేష్‌ నెమ్మదిగా లోపలికి ప్రవేశించి దాక్కున్నాడు. అనంతరం వృద్ధురాలు ఇంటిలోపలికి వెళ్లి మంచం మీద నిద్రించింది.

రాకేష్‌ తలుపులు తెరిచి లలితను ఇంట్లోకి పిలిచాడు.సత్యమ్మ ముఖంపై దిండు పెట్టాడు. కాళ్లు కదలకుండా లలిత పట్టుకుంది. ఊపిరాడకపోవడంతో సత్యమ్మ మృతి చెందింది. ఆమె దగ్గర ఉన్న రెండు వరుసల బంగారు గొలుసు, 7 బంగారు గాజులు, చేతి కడియం, ఉంగరాలు తీసుకుని నిందితులు పారిపోయారు. సోమవారం ఉదయం 10 గంటలకు వరకు సత్యమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పక్కింటివాళ్లు ఇంట్లోకి వెళ్లి చూడగా సత్యమ్మ విగతజీవిగా పడి ఉంది. ఈ విషయాన్ని ఆమె పెద్ద కుమారుడు బాల్‌రెడ్డికి చెప్పారు.

ఆయన హయత్‌నగర్‌ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలాన్ని రాచకొండ పోలీసు కమిషనర్‌ చౌహాన్‌, డీసీపీ సాయిశ్రీ తదితరులు పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌, ఫింగర్‌ ప్రింట్ల ఆధారంగా నిందితులు రాకేష్‌, లలితను అరెస్టు చేశారు. కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులను డీసీపీ అభినందించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, హయత్‌నగర్‌ సీఐ వెంకటేశ్వర్లు, డీఐ నిరంజన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు