కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ సిప్లిగంజ్‌ దరఖాస్తుతో మరింత ఉత్కంఠ

26 Aug, 2023 07:31 IST|Sakshi

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ సీట్ల కేటాయింపులో నగరంలోని రెండు నియోజకవర్గాలను.. అందులోనూ గోషామహల్‌ను ఎందుకు పెండింగ్‌లో ఉంచారన్నది నగరంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగింటినే పెండింగ్‌లో ఉంచారు. ఇందులో రెండు సీట్లు నగరంలోని నాంపల్లి, గోషామహల్‌వే కావడం తెలిసిందే. ఈసారి గోషామహల్‌ను ఎలాగైనా దక్కించుకోవాలనే తలంపుతోనే బీఆర్‌ఎస్‌ ఆచితూచి వ్యవహరిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

► గోషామహల్‌ ఏర్పాటుకు ముందు అది మహరాజ్‌గంజ్‌ నియోజకవర్గంగా ఉండేది. గోషామహల్‌గా ఏర్పాటయ్యాక వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్‌ గెలుపొందారు. 2018 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క నియోజకవర్గం అదే. బీజేపీకి కంచుకోటగా మారిన ఆ నియోజకవర్గంలో ఎలాగైనా బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలనే తలంపుతోనే ఆ నియోజకవర్గాన్ని పెండింగ్‌లో ఉంచినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

► దాదాపు ఏడాది క్రితం రాజాసింగ్‌ను సస్పెండ్‌ చేసిన బీజేపీ.. ఇంతవరకు సస్పెన్షన్‌ ఎత్తివేయలేదు. ఈసారి బీజేపీ మరో అభ్యర్థిని రంగంలోకి దింపుతుందా.. లేక రాజాసింగే వస్తారా అన్నది వెల్లడి కావాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ తొలి జాబితా వెల్లడి కాగానే రాజాసింగ్‌ స్పందిస్తూ.. గోషామహల్‌ పెండింగ్‌లో ఉంచడానికి కారణం ఎంఐఎం అని, ఆ పార్టీ సూచించిన వారికే టికెట్‌ ఇస్తారని ఆరోపించడంతో పాటు రానున్న ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేసేది తానేనని, ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ సాధిస్తానని బహిరంగంగా ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ కన్ను
► కాంగ్రెస్‌ పార్టీ సైతం ఈసారి గోషామహల్‌ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే యోచనలో ఉంది. మహరాజ్‌గంజ్‌ నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1989, 2004లలో రెండు పర్యాయాలు, గోషామహల్‌గా రూపాంతరం చెందాక 2009లో కాంగ్రెస్‌ నుంచి ముఖేశ్‌గౌడ్‌ గెలుపొందారు. కాంగ్రెస్‌ ఓట్లు గణనీయంగా ఉన్న ఆ నియోజకవర్గాన్ని తిరిగి తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ దృష్టి సారించింది. ఈ నియోజకవర్గం నుంచి టికెట్‌ కోసం రాహుల్‌ సిప్లిగంజ్‌ దరఖాస్తు చేసుకోవడంతో ఆయనకు టికెట్‌ ఇస్తే యూత్‌ ఓట్లు గణనీయంగా పడటమే కాకుండా ప్రచారం తిరుగులేని విధంగా ఉండి గెలుపు ఈజీ కానుందని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

► యూత్‌లో ఎంతో క్రేజ్‌ ఉన్న రాహుల్‌ సిప్లిగంజ్‌ ఒక సీజన్‌లో బిగ్‌బాస్‌ విన్నర్‌గా గెలుపొందడంతో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా పాటతో ఆస్కార్‌ దాకా వెళ్లడం తెలిసిందే. పార్టీయే ఆయనను ఆహ్వానించి ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. మంగళ్‌హాట్‌కు చెందిన రాహుల్‌ తన నివాసాన్ని అక్కడి నుంచి మార్చినప్పటికీ అక్కడి బస్తీల్లో అభిమానించేవారు భారీగా ఉన్నారు. అటు మాస్‌.. ఇటు క్లాస్‌ రెండు వర్గాల్లో ఎంతో గుర్తింపు ఉన్న సిప్లిగంజ్‌కు టిక్కెట్‌ ఇస్తే గత వైభవం తిరిగి పొందవచ్చునని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వేచి చూసే ధోరణిలో బీఆర్‌ఎస్‌
​​​​​​​
బీఆర్‌ఎస్‌ తొలుత గోషామహల్‌ టిక్కెట్‌ను నందు బిలాల్‌కు కేటాయిస్తుందని భావించినప్పటికీ, అంతకంటే బలమైన అభ్యర్థి కోసమే వేచి చూస్తున్నట్లు సమాచారం. ఈసారి ఎలాగైనా గోషామహల్‌లో గులాబీ జెండా ఎగురవేసేందుకు చివరి దాకా వేచి చూసి.. మిగతా పార్టీలకంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలనేది బీఆర్‌ఎస్‌ యోచనగా తెలుస్తోంది. అందుకు తగిన అభ్యర్థిని అన్వేషిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌, బీజేపీల అభ్యర్థులు ఖరారయ్యాకే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు