తనయుడి సీటు కోసం పోరాటం.. మైనంపల్లికి సన్‌స్ట్రోక్‌ తప్పదా?

30 Aug, 2023 10:17 IST|Sakshi

హైదరాబాద్: ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోనున్నారనేది ప్రస్తుతం మల్కాజిగిరిలో చర్చనీయాంశంగా మారింది. అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా మల్కాజిగిరి అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన మైనంపల్లి ఈ దఫా తనకు సిట్టింగ్‌ సీటుతో పాటు తన కుమారుడు రోహిత్‌కు మెదక్‌ టికెట్‌ ఆశించారు. రోహిత్‌ కొన్నాళ్లుగా మెదక్‌లో తన సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. మైనంపల్లికి సైతం మెదక్‌ జిల్లాతో సత్సంబంధాలు ఉండటంతో కచ్చితంగా అక్కడి నుంచి రోహిత్‌ పోటీలో ఉంటారంటూ ఇటీవల కాలంలో చెబుతూ వచ్చారు.

అయితే.. బీఆర్‌ఎస్‌ అధిష్టానం సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లికే మాత్రమే టికెట్‌ ఖరారు చేసింది. తన కుమారుడికి టికెట్‌ ప్రకటించకపోవడంపై మైనంపల్లి గుస్సా అయ్యారు. మంత్రి హరీష్‌రావును టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. అధిష్టానం చివరి నిమిషంలోనైనా తన కుమారుడికి టికెట్‌ ఇస్తుందని ఆశిస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని, కొందరి నేతలపై తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో అయిదు రోజుల క్రితం తన నివాసంలో మల్కాజిగిరి, మెదక్‌, సిద్దిపేట నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పర్యటించి ప్రజాభిప్రాయం కూడా సేకరించి వారం రోజుల తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని మీడియా సమావేశంలో మైనంపల్లి ప్రకటించారు. కాగా.. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి మైనంపల్లి హన్మంతరావుకు పిలుపు రాలేదని తెలుస్తోంది. ఆయన కూడా అధిష్టానం వద్దకు వెళ్లివచ్చినట్లు కనిపించలేదు.

అభ్యర్ధి మార్పుపై ఊహాగానాలు
బీఆర్‌ఎస్‌ అధిష్టానం మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లిని మార్చడానికే సిద్ధమైనట్లు ప్రచార మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్‌ఎస్‌ తరఫున మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు.. వీరిలో ఒకరిని ఇక్కడి నుంచి పోటీ చేయిస్తారనే వాదనలు బయలుదేరాయి. ఈ వాదనలను వారిద్దరూ ఖండించినప్పటికీ మైనంపల్లిని తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజెపీలో ఆయనకు చోటు లేదని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక కాంగ్రెస్‌ పార్టీ తండ్రీకొడుకుల్లో ఒక్కరికి మాత్రమే సీటు ఇచ్చేందుకు రెడీ అన్నట్టు తెలుస్తోంది. అది కూడా మల్కాజిగిరి నుంచి కాకుండా మేడ్చల్‌, మెదక్‌ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ టికెట్‌ కేటాయించే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. మైనంపల్లిని మల్కాజిగిరి నుంచి తప్పిస్తే ఇతర నియోజకవర్గాల్లోనూ ఆయన ప్రభావితం చూపుతారన్న విషయాన్ని బీఆర్‌ఎస్‌ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందా? తేడా వస్తే ఎవరినీ లెక్క చేయని ఆ పార్టీ అధినేత ఇవన్నీ పట్టించుకుంటారా? మొత్తంగా తనయుడికి సీటు కోసం యుద్ధం చేస్తున్న మైనంపల్లి విజయం సాధిస్తారా? లేదంటే చివరికి సన్‌ స్ట్రోక్‌ తగిలి ఆయనే దెబ్బతింటారా? అనేది త్వరలోనే తేలనుంది.

మరిన్ని వార్తలు