ఎంఐఎంలో వారసులకు చాన్స్?.. రేసులో అక్బరుద్దీన్‌ కుమారుడు!

11 Sep, 2023 16:35 IST|Sakshi

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్‌ ఎమ్మెల్యేల వారసులతో పాటు యువతరానికి పెద్దపీట వేయాలని మజ్లిస్‌ పార్టీ యోచిస్తోంది. సిట్టింగ్‌ స్థానాలతో అదనపు స్థానాలను సైతం తమ ఖాతాల్లో పడే విధంగా వ్యూహ రచన చేస్తోంది. నగరంలో పార్టీకి కంచుకోట లాంటి ఏడు సిట్టింగ్‌ స్థానాలుండగా కొత్తగా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే సిట్టింగ్‌ స్థానాల్లోని ముగ్గురు ఎమ్మెల్యేలు వయోభారం దృష్ట్యా అభ్యర్థిత్వాలు మార్పు అనివార్యం కాగా, మరో స్థానంలో సైతం రాజకీయ పరిస్థితులను బట్టి అభ్యర్థి మార్పు జరిగే అవకాశాలు లేకపోలేదని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది.

మొత్తం మీద ఖాళీ అయ్యే స్థానాల్లో సిట్టింగ్‌ల వారసులతో పాటు కొత్త వారికి కూడా అవకాశం దక్కవచ్చని చర్చ జరుగుతుంది. గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో ఏడుగురు సిట్టింగ్‌లకు అవకాశం లభించగా, అందులో అప్పటి యాకుత్‌పురా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం చార్మినార్‌ స్థానానికి, చార్మినార్‌ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం యాకుత్‌పురా స్థానాలకు మార్చి అవకాశం కల్పించారు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం ముగ్గురు నుంచి నలుగురు సిట్టింగుల అభ్యర్థిత్వాలే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వారసుల అరంగేట్రం?
కొత్తగా పార్టీ సీనియర్‌ నేతల వారసుల పేర్లు తెరపైకి వచ్చాయి. పార్టీ ద్వితీయ అగ్రనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ల కుమారులు కూడా ఈసారి పోటీలో ఉంటారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, యాకుత్‌పురా ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రిలు వయోభారం దృష్ట్యా పోటీపై పెద్దగా అసక్తి కనబర్చడం లేదు. అధిష్టానం మాత్రం మరో పర్యాయం వారి సేవలు వినియోగించుకోవాలని యోచిస్తోంది. ముంతాజ్‌ఖాన్‌ మాత్రం తన కుమారుడికి అవకాశం కల్పించాలని అదిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

నాలుగు స్థానాల్లో..
మజ్లిస్‌ పార్టీ సిట్టింగ్‌ స్థానాలైన ఏడింటిలో నాలుగింటిలో మార్పులు చేయాలని భావిస్తోంది. చాంద్రాయణగుట్ట నుంచి ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఈసారి కూడా పోటీ చేస్తారనడంలో ఎలాంటి అనుమానం లేదు. సిట్టింగ్‌లున్న మలక్‌పేట నుంచి అహ్మద్‌ బలాల, కార్వాన్‌ నుంచి కౌసర్‌ మోయినుద్దీన్‌లు పోటీలో ఉండటం ఖాయమే. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ పరిస్థితులను బట్టి నాంపల్లి నియోజకవర్గం నుంచి జాఫర్‌హుస్సేన్‌ మేరాజ్‌ అభ్యర్థిత్వం మార్పు జరిగితే ఆ స్థానంలో మాజీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజంఖాన్‌ వయోభారం దృష్ట్యా ఆయనను తప్పిస్తే ఆ స్థానం నుంచి అక్బరుద్దీన్‌ కుమారుడు నూరుద్దీన్‌ ఒవైసీ పేరు పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మోజంఖాన్‌ బరిలో ఉంటే నూరుద్దీన్‌ ఒవైసీని చార్మినార్‌ లేదా యాకుత్‌పురా నుంచి పోటీలోకి దింపే అవకాశాలు లేకపోలేదన్న చర్చ సాగుతోంది.

ఆ రెండింటిపై కూడా
పాత నగరంలో చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురాతోపాటు కార్వాన్‌, నాంపల్లి, మలక్‌పేట నియోజకవర్గాల్లో వరుస విజయాలతో కై వసం చేసుకుంటూ వస్తున్న మజ్లిస్‌ ఈసారి రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్‌ అసెంబ్లీ పరిధిలో పార్టీ అధినేత అసదుద్దీన్‌ నివాసం ఉండటంతో ఆ స్థానం కూడా పార్టీ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహ రచన సాగుతున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో గట్టి పట్టు ఉండటంతో బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని యోచిస్తోంది.

మరిన్ని వార్తలు