భాగ్యనగరంలో వరల్డ్‌ కప్‌ ట్రోఫీ టూర్‌

22 Sep, 2023 08:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పుష్కర కాలం తర్వాత భారత గడ్డపై నిర్వహిస్తున్న వన్డే వరల్డ్‌ కప్‌కు సంబంధించిన సందడి అంతటా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు వేదికల్లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రచార కార్యక్రమాల తర్వాత ఇప్పుడు మన నగరంలో వరల్డ్‌ కప్‌ ట్రోఫీ సందడి చేసింది. క్రికెట్‌ అభిమానులను అలరిస్తూ వచ్చిన ఈ కప్‌ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో అభిమానులకు చేరువగా వచ్చింది.

గురువారంతో నగరంలో ఈ ఐసీసీ ట్రోఫీ టూర్‌ ముగిసింది. బుధవారం అభిమానుల కోసం రామోజీ ఫిల్మ్‌సిటీ, ఇనార్బిట్‌ మాల్‌లలో ట్రోఫీని ఉంచారు. క్రికెట్‌ ప్రేమికులు సెల్ఫీలతో ఆటపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. గురువారం వరల్డ్‌ కప్‌ నిర్వాహకులు నగరంలో మూడు చోట్ల ట్రోఫీని ప్రదర్శించారు. నగరానికి చిరునామా అయిన చారిత్రాత్మక చార్మినార్‌ వద్ద, ఆ తర్వాత హుస్సేన్‌ సాగర్‌ ఐసీసీ ప్రతినిధులు ట్రోఫీని ఉంచి ప్రచారం నిర్వహించారు. అనంతరం వరల్డ్‌ కప్‌లో మూడు మ్యాచ్‌లకు వేదికై న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ట్రోఫీని ప్రదర్శించారు.

ఉప్పల్‌ స్టేడియంలో అక్టోబర్‌ 6, 9, 10 తేదీల్లో మూడు వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. అంతకు ముందు ఈ నెల 29, అక్టోబర్‌ 3 తేదీల్లో వార్మప్‌ మ్యాచ్‌లు కూడా నిర్వహిస్తారు. భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు ఇక్కడ లేకపోయినా.. వరల్డ్‌ కప్‌ పోరు కావడంతో ఇతర టీమ్‌ల మ్యాచ్‌లపై కూడా ఆసక్తి నెలకొంది. వరల్డ్‌ కప్‌ టూర్‌లో భాగంగా ట్రోఫీ నగరం నుంచి చైన్నెకి వెళ్లింది.

మరిన్ని వార్తలు