గోవా టు హైదరాబాద్‌

17 Oct, 2023 07:02 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు

హైదరాబాద్: అక్రమంగా గోవా నుంచి హైదరాబాద్‌కు ఎండీఎంఏ డ్రగ్‌ పిల్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి డ్రగ్‌ పిల్స్‌ (ఎక్టసీ పిల్స్‌) 27, రెండు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొంపల్లి, సుచిత్ర ప్రాంతానికి చెందిన సోలమన్‌ సుసైరాజ్‌ తరచూ గోవా వెళ్లి అక్కడ నివాసం ఉంటున్న ఆఫ్రికా దేశానికి చెందిన ఫేవర్‌ వద్ద డ్రగ్స్‌ కొనుగోలు చేసి పాత బోయిన్‌పల్లికి చెందిన దేవరాయ్‌ క్రిష్ణకాంత్‌కు అప్పగించేవాడు.

అతను వాటిని నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయించేవాడు. సోమవారం సాలమన్‌ గోవా నుంచి ఎండీఎంఏ డ్రగ్‌ పిల్స్‌ను తీసుకువస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు ఎల్‌బీనగర్‌ ప్రాంతంలో క్రిష్ణకాంత్‌తో పాటు అతడిని అరెస్టు చేశారు. వారి నుంచి 27 డ్రగ్‌ పిల్స్‌, రెండు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసిన ఫేవర్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సోలమన్‌ సుసైరాజ్‌ను గతంలో అమీర్‌పేట ఎకై ్సజ్‌ పోలీసులు ఎన్‌డీపీఎస్‌ కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు.

మరిన్ని వార్తలు