విశ్వరూప సభకు ప్రధాని రావడం గర్వకారణం

9 Nov, 2023 06:00 IST|Sakshi
మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంద కృష్ణమాదిగ తదితరులు

పంజగుట్ట/జియాగూడ: మాదిగ, మాదిగ ఉపకులాలకు చేయూతనిచ్చేందుకు, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడం గర్వంగా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. 60 సంవత్సరాల నిరీక్షణ, 30 సంవత్సరాల ఉద్యమ సంకల్పం ప్రధాని తీసుకునే నిర్ణయంలో, ఇచ్చే సందేశంపై ఆధారపడి ఉందన్నారు. ఈ నెల 11వ తేదీన సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని జులై 8వ తేదీన వరంగల్‌ సభలో చెప్పారని, అక్టోబర్‌ 2వ తేదీన ఢిల్లీలో అమిత్‌షాను కలిసినప్పుడు ఆయన కూడా సానుకూలంగా స్పందించారని, ఆ హామీని అమలుచేసే దిశగా ఈ సభ ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు మోదీ రావడం గొప్ప విషయమన్నారు. కాగా బుధవారం కార్వాన్‌ నియోజకవర్గం మాదిగల విశ్వరూప సన్నాహాక సభ జియాగూడ ఇంద్రానగర్‌ ఆదిజాంభవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగ్గా..మంద కృష్ణ హాజరై మాట్లాడారు. మాదిగ జాతికి గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అన్యాయం చేస్తూ వచ్చాయన్నారు. ఈ నెల 11న ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతున్నారన్నారు.

మంద కృష్ణమాదిగ

మరిన్ని వార్తలు