భవిష్యత్‌ను నిర్ణయించేది ఓటే

9 Nov, 2023 07:29 IST|Sakshi

మెరుగైన సామాజిక భవిష్యత్‌ను నిర్ణయించేది ఓటు హక్కు మాత్రమే. మంచి నాయకులను ఎన్నుకోవడానికి సరైన సమయం ఇదే. ఎన్నికల వేళ చేసే ఒకే ఒక్క పొరపాటుతో వ్యక్తిగతంగా, సామాజికంగా భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. ముఖ్యంగా యువత ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటును అమ్ముకోవద్దు. ఓటు విలువను తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలి. సామాజికంగా డబ్బు, కులం తదితర స్థాయిలుగా అసమానతలు నెలకొన్నాయి. కడుపు నిండినోళ్లు, కడుపు మండినోళ్ల మధ్య వ్యవస్థ కొనసాగుతోంది. ఎన్నికై న ప్రజాప్రతినిధులు సామాన్యుల పక్షాన నిలుస్తూ కనీస అవసరాలు సమకూర్చేలా కృషి చేయాలి. సమ న్యాయపాలన చేస్తూ వెనుకబడిన వారి ఉన్నతికి కోసం ప్రయత్నించే వారే అసలైన నాయకులు.
– రఘు కుంచె, సంగీత దర్శకుడు– ప్లే బ్యాక్‌ సింగర్‌

అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలి
అంతర్జాతీయ స్థాయి నగరంగా మారడానికి అన్ని హంగులూ ఉండడంతో ఆ దిశగా హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఆ గుర్తింపు కోసం మౌలిక వసతుల పరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కొన్ని రోడ్లు అద్భుతంగా ఉంటే కొన్ని అధ్వానంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. గుంతల రోడ్లు అనేవి వెతికినా కనపడకుండా ఉండేలా చేయాలి. సిటీ ట్రాఫిక్‌ కూడా పెద్ద సమస్యే. ఫుట్‌పాత్‌ ఆక్రమణలు, రోడ్ల మీద వ్యాపారాలు ట్రాఫిక్‌కి అడ్డంకులు సృష్టిస్తున్నాయి. మరోవైపు పబ్లిక్‌లో కూడా ట్రాఫిక్‌ సెన్స్‌ లోపిస్తోంది. ప్రభుత్వాలు ఒక టాస్క్‌గా తీసుకుని ప్రజల్లో ట్రాఫిక్‌ రూల్స్‌ పట్ల అవగాహన బాగా పెంచాలి. నగరానికి నేచర్‌ లవర్స్‌ రాక పెంచడానికి వన్యప్రాణుల ఉనికి కాపాడడానికి శాంక్చురీస్‌(అభయారణ్యాలు)ని బాగా డెవలప్‌ చేయాలి. 
– ప్రిన్స్‌, టాలీవుడ్‌ నటుడు

మరిన్ని వార్తలు