‘దుమ్ము’ రేగింది..కర్ణభేరి అదిరింది

14 Nov, 2023 08:02 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో, గోల్కొండ: దీపావళి పండుగ నేపథ్యంలో పలువురు టపాసులు కాలుస్తూ గాయాలపాలయ్యారు. ఆదివారం నగరంతో పాటు శివారు ప్రాంతాలకు చెందిన పలువురు సరోజిని దేవీ కంటి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. మొత్తం 41 మంది బాధితులు ఆసుపత్రికి వచ్చినట్లు సరోజిని దేవీ కంటి ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ రాజలింగం తెలిపారు. వీరిలో చాలా మందికి ప్రథమ చికిత్స చేసి పంపించామన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కంటికి గాయమైన నలుగురు చికిత్స పొందుతున్నారన్నారు. వీరిలో బుద్వేల్‌కు చెందిన సుమన్‌కుమార్‌, నగరానికి చెందిన రాజు, కొంపల్లికి చెందిన జోసెఫ్‌ ఉన్నారు. వీరు ప్రస్తుతం ఆస్పత్రిలో ఇన్‌ పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ...

పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కంటి గాయాల బాధితులు క్యూ కట్టారు. టోల్‌ ఫ్రీ నెంబరుకు పెద్ద సంఖ్యలోనే కాల్స్‌ వచ్చినట్టు ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎల్వీపీ ఆసుపత్రితో పాటు, మ్యాక్సివిజన్‌, మారేడ్‌పల్లిలోని పుష్పగిరి కంటి ఆసుపత్రిలలో టపాసుల కారణంగా కంటిగాయాలకు గురైన రోగుల రద్దీ కనిపించింది. బాధితుల్లో అత్యధికులు టీనేజర్లు, చిన్నారులే ఉన్నారని ఆయా ఆసుపత్రుల ప్రతినిధులు తెలిపారు.

సనత్‌నగర్‌: దీపావళి పండుగ ‘కేక’ పుట్టించింది.. కరోనా తర్వాత నగరంలో అత్యధికంగా ధూళి, శబ్ధ కాలుష్యం నమోదైంది. సూక్ష్మ ధూళి కణాలైన పీఎం (పార్టిక్యులేట్‌ మేటర్‌) 2.5, పీఎం10లు రికార్డు స్థాయిలో వెలువడ్డాయి. సాధారణ రోజుల్లో పీఎం 2.5.. క్యూబిక్‌ మీటర్‌కు సరాసరి 35 మైక్రోగ్రాములుగా నమోదవుతుండగా దీపావళి నేపథ్యంలో క్యూబిక్‌ మీటర్‌కు 119 మైక్రో గ్రాములకు చేరింది. పీఎం 2.5 మామూలుగా 60 మైక్రో గ్రాములు దాటితే డేంజర్‌ బెల్‌ మోగినట్లే. అలాంటిది దివాలీ రోజున దూళి కణాల శాతం భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పీఎం 10 విషయానికొస్తే సాధారణ రోజుల్లో సగటున క్యూబిక్‌ మీటర్‌కు 85 మైక్రో గ్రాములుగా నమోదవుతుండగా పండుగ రోజు 188 మైక్రో గ్రాములకు చేరి వాతావరణాన్ని ధూళితో కమ్మేసింది. సల్ఫర్‌ డయాకై ్సడ్‌ (ఎస్‌ఓ2) సాధారణ రోజుల్లో క్యూబిక్‌ మీటర్‌కు 6.2 మైక్రో గ్రాములుగా నమోదవుతుండగా దీపావళి రోజున ఏకంగా రెట్టింపు స్థాయిలో 12.0కు ఎగబాకింది. ఆకై ్సడ్స్‌ ఆఫ్‌ నైట్రోజన్‌ (ఎన్‌ఓ2) సాధారణ రోజుల్లో 23.4గా ఉండగా, 30.6కు పెరిగింది. అయితే ఎస్‌ఓ2, ఎన్‌ఓ2 ఉద్గారాల పరిమాణాలు సగటున రోజులో ఉండాల్సిన దాని కంటే తక్కువగానే ఉండడం గమనార్హం. అంతగా శీతల వాతావరణం లేనప్పటికీ సూక్ష్మ ధూళి కణాలు భారీగా పెరగడాన్ని బట్టి చూస్తే వాయు కాలుష్యాన్ని వెదజల్లే టపాసులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే ధూళి కణాలు గాలిలో కలవకుండా అక్కడక్కడే చేరి మరింత ఎక్కువగా నమోదై ఉండేవని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు.

చెవులు చిల్లులు..
పారిశ్రామికవాడలో సాధారణ రోజుల్లో కంటే దీపావళి రోజున తక్కువగానే శబ్ద కాలుష్యం నమోదుకాగా వాణిజ్య, నివాస ప్రాంతాల్లో ఎక్కువగా నమోదైంది. పారిశ్రామికవాడలో సాధారణ రోజు ఈ నెల 6న పగటి పూట 68.5 డెసిబల్స్‌ ఉంటే దీపావళి రోజున 59.5 మాత్రమే ఉంది. రాత్రిపూట ఈ నెల 6న 65.05 గా ఉంటే 67.2 డెసిబల్స్‌కు చేరి స్వల్పంగా పెరిగింది.

వాణిజ్య ప్రాంతాల్లో పగటిపూట డెసిబల్స్‌ తగ్గగా, రాత్రిపూట స్వల్పంగా పెరిగాయి. సాధారణ రోజు అంటే ఈ నెల 6న పగటి పూట 68.37 డెసిబల్స్‌గా ఉంటే దివాళీ రోజున 66.30 డెసిబల్స్‌ ఉంది. 6న రాత్రిపూట 65.80 డెసిబల్స్‌గా ఉండగా దీపావళి రోజున 67.2 డెసిబల్స్‌తో స్వల్పంగా పెరిగింది. వాణిజ్య ప్రాంతాల్లో పగటి పూట 65, రాత్రిపూట 55 డెసిబల్స్‌ మించరాదు. కానీ దీపావళి రోజున ఉండాల్సిన పరిమాణం కంటే భారీగా నమోదు కావడం గమనార్హం.

నివాస ప్రాంతంలో సాధారణ రోజు ఈ నెల 6న పగటి పూట 62 డెసిబల్స్‌గా నమోదైతే దీపావళి రోజున 62.43 డెసిబల్స్‌తో అతిస్వల్పంగా నమోదైంది. రాత్రిపూట ఈ నెల 6న 56.60గా ఉంటే దీపావళి రోజున 59.3 డెసిబల్స్‌కు చేరింది. సాధారణంగా నివాస ప్రాంతంలో పగటిపూట 55, రాత్రిపూట 45 డెసిబల్స్‌ను మించరాదు.

మరిన్ని వార్తలు