నిబంధనలు నిప్పులపాలు!.. అంతటా కెమికల్‌ గోడౌన్లే!

14 Nov, 2023 04:32 IST|Sakshi

భయాందోళనల్లో రెడ్‌ హిల్స్‌ ప్రజలు

పట్టించుకోని అధికారులు 

అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు

సాక్షి, సిటీబ్యూరో/నాంపల్లి/హిమాయత్‌నగర్‌: నగరంలో తరచుగా చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు, అశువులుబాస్తున్న అమాయకుల సంఖ్య చూస్తుంటే అగ్నిమాపక నిబంధనల విషయంలో యంత్రాంగాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతుంది. కేవలం బాలాజీ రెసిడెన్సీ మాత్రమే కాదు.. ఇలాంటి అక్రమ గోదాములు, అడ్డగోలు నిర్మాణాలు నగరంలో అనేకం ఉన్నాయి. వీటి విషయం అటు పాలకులు, ఇటు అధికారులు ఎవరికీ పట్టదు. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు మాత్రమే ఒకటి రెండు రోజులు హడావుడి చేస్తారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా భవనాలు నిర్మించుకోవడం, ఆ తరవాత పై స్థాయిలో పైరవీలు చేసి అనుమతులు తీసుకోవడం నగరంలో మామూలైంది. ఇళ్ళ మధ్యలోనూ కెమికల్‌ గోదాములు ఏర్పాటై కొనసాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్ని నిబంధనలు పెట్టినా, చట్టాలు తీసుకువచ్చినా అవన్నీ కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఇలాంటి నిర్మాణాల విషయంలో న్యాయస్థానాలు వరుస పెట్టి మొట్టికాయలు వేస్తున్నా పటిష్ట చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తోంది. ముఖ్యంగా నగరంలో ఉన్న అని భవనాలను సందర్శించి ఫైర్‌ సేఫ్టీ మెజర్స్‌ పరీక్షిస్తామని, నిబంధనల ప్రకారం లేని వాటి యజమానులను చైతన్య పరుస్తామని, ఆ తరవాత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. ఆ తరువాత చల్లబడిపోతున్నాయి.

జనావాసాలకు నిలయమైన రెడ్‌హిల్స్, బజార్‌ఘాట్‌ ప్రాంతాలు పారిశ్రామిక కేంద్రాలుగా మారిపోయాయి. ఒకప్పుడు రెడ్‌హిల్స్‌ డివిజన్‌ అంటే  ఎటు చూసినా ఉద్యానవనాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేది. గతంలో వీఐపీలు పోటీలు పడీ మరీ ఇక్కడ ఇళ్లను కొనుగోలు చేసేవారు. అయితే నేడు అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం అలాంటి వాతావరణం మచ్చుకైనా కానరావడం లేదు. ఎటు చూసినా రసాయన పరిశ్రమలు కనిపిస్తున్నాయి. వీటి నుంచి విషపూరితమైన వ్యర్థాలు, విష వాయువులు వెలువడుతున్నాయి. ఫలితంగా ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా స్థిర నివాసం ఏర్పరచుకున్న వారందరూ తమ ఇళ్ళను అమ్ముకుని వెళ్లిపోతున్నారు. లేదంటే ప్రింటింగ్‌ ప్రెస్‌ పరిశ్రమలకు అద్దెలకు ఇచ్చేస్తున్నారు. నాడు ఇంటి కొనుగోలు కోసం ఎంత పోటీ ఉండేదో.. నేడు అంతే పోటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహణకు ఉంది. ఈ ప్రాంతంలో  ప్రింటింగ్‌ ప్రెస్‌ల నిర్వహణ కోసం పారిశ్రామిక వేత్తలు పోటీపడుతున్నారు.  –నాంపల్లి

దుర్వాసన భరించలేకపోతున్నాం

రెడ్‌హిల్స్‌లో కెమికల్స్‌ వాసనను భరించలేకపోతున్నాం. ఒకప్పుడు ఎటు చూసినా ఆహ్లాదకరమైన గాలి వచ్చేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. భరించలేని విష వాయువులు వస్తున్నాయి. వీటి మధ్యలో నివాసం ఉండలేక అనేక అవస్థలకు గురవుతున్నాం. అనారోగ్యాల బారినపడుతున్నాం. ఊపిరితిత్తుల వ్యాధులతో కాలనీ వాసులు బాధపడుతున్నారు. – బత్తుల రాం ప్రసాద్‌, స్థానికుడు

ఇక్కడే చారిత్రక కట్టడాలు.. ప్రధాన కార్యాలయాలు

ఈ ప్రదేశంలో నాంపల్లి క్రిమినల్‌ కోర్టులు, నిలోఫర్‌, ఎంఎన్‌జె ఆసుపత్రులు, అసెంబ్లీ, డీజీపీ కార్యాలయాలు, ఉద్యానవన శాఖ కార్యాలయాలు, ఫెడరేషన్‌ హౌస్‌, నాంపల్లి రైల్వే స్టేషన్‌ వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ప్రస్తుతం డివిజన్‌లో ఎటు చూసినా ప్రింటింగ్‌ ప్రెస్‌లు కొనసాగుతున్నాయి. వీటి కోసం వాడే రసాయనాలకు భారీ గిరాకి ఉంటోంది. ప్రింటింగ్‌ ప్రెస్‌లో వాడే కెమికల్స్‌ను ఇండ్లలో నిల్వ ఉంచుకుంటూ అవసరానికి తగ్గట్టు సరఫరా చేస్తున్నారు. ఇదే ప్రదేశంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ల కోసం నిల్వఉంచిన కెమికల్స్‌ నిల్వలుఅగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ మంటల్లో 9 మంది మృతి చెందారు.

ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

జనావాస ప్రదేశాల్లో ప్రింటింగ్‌ ప్రెస్‌లు, కెమికల్‌ నిల్వలు ఉంచరాదని స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నిషేధించాల్సిన జీహెచ్‌ఎంసీ, పోలీసు, డీఆర్‌ఎఫ్‌ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నిషేధించాల్సిన అధికారులే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంతోపాటు వాటిలో అడ్డగోలుగా ప్రింటింగ్‌ ప్రెస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికై నా రెడ్‌హిల్స్‌లో అక్రమంగా కొనసాగుతున్న డంపింగ్‌ యార్డులు, వేర్‌ హౌసింగ్‌లను, ప్రింటింగ్‌ ప్రెస్‌ కంపెనీలను నగర శివారుకు తరలించాలని కోరుతున్నారు.

ప్రింటింగ్‌ ప్రెస్‌ల నిర్వహణను నిషేధించాలి

రెడ్‌హిల్స్‌ కాలనీ చుట్టూ ప్రింటింగ్‌ ప్రెస్‌లు వెలిశాయి. వీటిలో వాడే కెమికల్స్‌తో మా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఏదైనా సంఘటన జరిగితే కనిపించే అధికారులు తరువాత కనిపించడం లేదు. ఇష్టానుసారం జీహెచ్‌ఎంసీ అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. కాలనీలో కెమికల్స్‌ను డంపింగ్‌ చేయడం సంబంధిత శాఖ అధికారులకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాం. వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

–ఆబిద్‌, స్థానికుడు

అనునిత్యం ‘అగ్నికీలలు’..

23.10.2002: శాంతి ఫైర్‌ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చిన దొంగ మారుతి నయీం అందులో నగదు లభించపోవడంతో నిప్పు పెట్టాడు. ఈ ఉదంతంలో దీని పై అంతస్తులో ఉన్న కార్తికేయ లాడ్జిలో బస చేసిన వాళ్లు, సిబ్బందితోపాటు 12 మంది చనిపోయారు.

21.10.2006: సోమాజిగూడలోని మీన జ్యువెల్లర్స్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో పెయింటింగ్‌ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రిస్తున్నారు. కింది ఫ్లోర్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో పెయింట్లు కాలి, విడుదలైన విషవాయువుల ప్రభావానికి ముగ్గురు చనిపోయారు.

24.11.2012: పుప్పాలగూడలోని బాబానివాస్‌ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా దాదాపు మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు.

22.02.2017: అత్తాపూర్‌లోని పిల్లర్‌ నెం.253 సమీపంలో ఉన్న చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఒడిస్సాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు చనిపోయారు.

23.02.2022: న్యూ బోయగూడ వద్ద శ్రావణ్‌ ట్రేడర్స్‌ పేరుతో ఉన్న స్క్రాప్‌ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బీహార్‌ నుంచి వచ్చిన వలస కార్మికులు 11 మంది చనిపోయారు.

12.09.2022: సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్‌ స్కూటర్స్‌, రూబీ లాడ్జిలతో కూడిన భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నికీలల కంటే పొగ ప్రభావమే ఎక్కువైంది. ఫలితంగా ఎనిమిది మందిని తమ ప్రాణాలు కోల్పోయారు.

9.01.2023: సికింద్రాబాద్‌లోని మినిస్టర్స్‌ రోడ్‌లో ఉన్న టీ–షర్టుల తయారీ, విక్రయ సంస్థ డెక్కన్‌ కార్పొరేట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సబ్‌–సెల్లార్‌, సెల్లార్‌, జీ ప్లస్‌ ఫైవ్‌ అంతస్తులతో నిర్మితమైన ఈ భవనం మొత్తం అగ్నికి ఆహుతి కాగా ముగ్గురు సజీవ దహనం అయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం ఆనవాళ్ళు కూడా లభించలేదు.

16.03.2023: సికింద్రాబాద్‌లోని ప్రము ఖ వ్యాపార సముదాయం స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 8 గంటల సమయంలో ఐదో అంతస్తులో ప్రారంభమైన మంటలు ఏడు, ఎనిమిదో అంతస్తులకు వ్యాపించాయి. ఈ కాంప్లెక్స్‌లో ఆరుగురు అశువులుబాశారు.

మరిన్ని వార్తలు