పాతబస్తీలో వేడెక్కిన రాజకీయం.. యాకుత్‌పురా చేజారేనా?

25 Nov, 2023 04:44 IST|Sakshi

హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్‌కు ఎంబీటీ పోరు తప్పడం లేదు. ఏకంగా యాకుత్‌పురా అసెంబ్లీ స్థానంలో తీవ్రమైన పోటీ నెలకొనడంతో మజ్లిస్‌కు ఎంబీటీ కొరకరాని కొయ్యగా మారింది. ఈసారి పాతబస్తీకే పరిమితమై కేవలం తొమ్మిది స్థానాల్లో బరిలో దిగినప్పటికీ.. ఒక సిట్టింగ్‌ స్థానంలో ఎంబీటీ, మరో రెండు సిట్టింగ్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ దూకుడు ఆందోళనకరంగా తయారైంది. గతంలో ఏన్నడూ లేని విధంగా మజ్లిస్‌కు గడ్డు పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సిట్టింగ్‌ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించి పాదయాత్ర, స్థానిక సభలతో పరిస్థితి చక్కదిద్దేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

యాకుత్‌పురా చేజారేనా?
ఎంబీటీ దూకుడుతో మజ్లిస్‌కు యాకుత్‌పురా సిట్టింగ్‌ స్థానం చేజారే పరిస్థితి నెలకొంది. మజ్లిస్‌ పక్షాన నాంపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌, ఎంబీటీ పక్షాన ఆ పార్టీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్‌ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఇద్దరి మధ్యే నెలకొన్నట్లు కనిపిస్తోంది. యాకుత్‌పురా సిట్టింగ్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాకు రిటైర్మెంట్‌ ప్రకటించిన మజ్లిస్‌.. నాంపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ అభ్యర్థిత్వాన్ని యాకుత్‌పురాకు బదిలీ చేసి రంగంలోకి దింపింది.

► రెండు దశాబ్దాలుగా యాకుత్‌పురా స్థానాన్ని కై వసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎంబీటీ ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాస్తవంగా గతంలో మజ్లిస్‌ నుంచి చీలిన ఎంబీటీ యాకుత్‌పురా స్థానాన్ని కై వసం చేసుకుంది. ఆ తర్వాత ఎంబీటీ నుంచి ఎన్నికై న ముంతాజ్‌ ఖాన్‌ మజ్లిస్‌లో చేరి వరసగా గెలుస్తూ వచ్చారు. గత పర్యాయం ముంతాజ్‌ ఖాన్‌ చార్మినార్‌ నుంచి పోటీ చేసి ఇటీవల రిటైర్మెంట్‌ తీసుకున్నారు. ఎంబీటీ తన పూర్వవైభవం కోసం యాకుత్‌పురాపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఈసారి ఎలాగైనా పాగా వేసేందుకు పాట్లు పడుతోంది.

నాంపల్లి పదిలమేనా?
మజ్లిస్‌ సిట్టింగ్‌ స్థానమైన నాంపల్లిలో పరిస్థితి నువ్వా.. నేనా? అన్న విధంగా తయారైంది. మజ్లిస్‌ వ్యూహత్మంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేను పక్క సెగ్మెంట్‌కు పంపించి ఇక్కడి నుంచి మాజీ మేయర్‌ మాజీద్‌ హుస్సేన్‌ను రంగంలోకి దింపింది. ఇదే స్థానం నుంచి మూడు పర్యాయాలుగా పోటీ పడుతున్న ఫిరోజ్‌ ఖాన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలో ఉండటంతో తీవ్ర పోటీ తప్పడం లేదు. కాంగ్రెస్‌ దూకుడు కూడా మజ్లిస్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్‌ , మరోవైపు ఫిరోజ్‌ ఖాన్‌కు వ్యక్తిగత ప్రాబల్యం మజ్లిస్‌ ఓట్లకు గండికొట్టే అవకాశాలున్నాయి. మలక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్‌ బలపడింది. స్థిరాస్తి వ్యాపారి అక్బర్‌ ప్రచారం ఉద్ధృతం చేయడం మజ్లిస్‌ను కలవర పెట్టిస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల తన స్థానాన్ని పదిలపర్చుకునేందుకుప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు