రైతు బీమా, రైతు బంధు పేరిట మోసం

27 Feb, 2024 08:00 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి

గచ్చిబౌలి : రైతు బీమా, రైతు బంధు పేరిట ఓ అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (ఏఈఓ) ఘరానా మోసానికి పాల్పడి ప్రభుత్వ ఖజానా నుంచి రూ.2 కోట్లు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలానికి చెందిన అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గోరెటి శ్రీశైలం మండల పరిధిలోని గ్రామాల్లో రైతుల పంటల వివరాలను సేకరించేవారు. సీసీఎల్‌ఏ రైతు బీమా పోర్టల్‌ నుంచి వివరాలు సేకరించి 60 ఏళ్లు దాటిన, అప్పటికే మరణించిన వారి పేరిట నకిలీ డాక్యుమెంట్లతో రైతు బీమాకు దరఖాస్తు చేసేవాడన్నారు. ఇదే తరహాలో 20 మంది రైతుల పేరుతో నకిలీ డెత్‌ సర్టిఫికెట్ల ద్వారా బీమాకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఆయా రైతుల పేర్లతో మంజూరైన రూ. కోటి నిధులను 7 అకౌంట్లలోకి మళ్లించినట్లు తెలిపారు. అంతేగాక పట్టాదార్‌ పాస్‌ బుక్‌ నెంబర్లను ఉపయోగించి రైతులకు మంజూరైన రైతు బంధు నిధులను సైతం స్వాహా చేసినట్లు తెలిపారు. పంటల వివరాలను సేకరిస్తూ రైతులను నమ్మంచి పాస్‌బుక్‌లు, ఆధార్‌ కార్డుల ద్వారా తన సహాయకుడు ఓదేల వీరస్వామితో కలిసి 130 మంది రైతులకు మంజూరైన రైతు బంధు నిధులను 50 ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలిపారు. దీనిపై సమాచారం అందడంతో రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ కొందుర్గు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, పలు బ్యాంకులకు చెందిన 7 డెబిట్‌ కార్డులు, ఫోర్జరీ చేసిన డెత్‌ సర్టిఫికెట్లు, ఎల్‌ఐసీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కాజేసిన సొమ్ముతో కొందుర్గులో 2.35 ఎకరాలు, తుమ్మలపల్లిలో 8.20 ఎకరాల వ్యవసాయ భూమి, కడ్తాల్‌ గ్రామంలో 183 చదరపు గజాల ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. ఏఈఓ శ్రీశైలం భార్య మహేశ్వరికి సైతం ఈ కేసులో ప్రమేయం ఉందని సీపీ వివరించారు. కొందుర్గు పీఎస్‌ నుంచి కేసును ఈఓడబ్ల్యూకు బదిలీ చేశామన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ. 2 కోట్లు స్వాహా

అగ్రికల్చర్‌ ఏఈఓతో పాటు మరొకరి అరెస్ట్‌

whatsapp channel

మరిన్ని వార్తలు