జీహెచ్‌ఎంసీకి రూ.600 కోట్లు

27 Feb, 2024 08:00 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అక్రమ స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం దిశగా హెచ్‌ఎండీఏ కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించిన నేపథ్యంలో హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగం సీరియస్‌గా దృష్టి సారించింది. లే అవుట్‌ల క్రమబద్ధీకరణ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న సుమారు 3.44 లక్షలకు పైగా దరఖాస్తులను పరిష్కరించేందుకు ఎన్నికలకు ముందే ప్రణాళికలను సిద్ధం చేశారు. అర్హులైన దరఖాస్తుదారుల్లో కొందరికి డాక్యుమెంట్‌లను సమర్పించేందుకు, ఫీజులు చెల్లించేందుకు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఎన్నికల కారణంగా ఈ ప్రక్రియ మందగించింది. మరోవైపు సిబ్బంది కొరత వల్ల కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం అమలు నత్తనడకన సాగింది. ప్రస్తుతం ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను వెల్లడించడంతో వీలైనంత తక్కువ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ను అందజేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

లక్షల్లో దరఖాస్తులు..

ప్లాట్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం అప్పటి ప్రభుత్వం 2020లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో హెచ్‌ఎండీఏ పరిధిలోని వివిధ జోన్‌లలో లక్షల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. రూ.1000 దరఖాస్తు రుసుము చెల్లించి చాలా మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించారు. వీటిని పరిశీలించి ప్రొసీడింగ్‌లను ఇచ్చేందుకు అప్పట్లో ప్రభుత్వం కలెక్టర్‌లకు బాధ్యతలను అప్పగించింది. ఈ క్రమంలోనే కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. దరఖాస్తుదారుల వివరాలన్నింటిని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) సేకరించి నిక్షిప్తం చేసింది.ఇలా పెండింగ్‌ జాబితాలో పడిన ఎల్‌ఆర్‌ఎస్‌లను పరిశీలించి అనుమతులను ఇవ్వాలని గత ప్రభుత్వం హయాంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుల రూపంలో ఆదాయ సముపార్జనే లక్ష్యంగా మొదట్లో భారీ లే అవుట్‌లపైన దృష్టి సారించారు. ఎకరం కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న లే అవుట్‌లలో విక్రయించగా మిగిలిన ప్లాట్‌లకు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఇచ్చేందుకు హెచ్‌ఎండీఏకు బాధ్యతలను అప్పగించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం రూ.10 వేలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న లే అవుట్‌ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. దీంతో దరఖాస్తుదారుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఒకవైపు ఈ భారీ లే అవుట్‌లకు ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతులను ఇస్తూనే ఇళ్ల స్థలాలు, ప్లాట్‌లకు కూడా దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు ఇవ్వాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు హెచ్‌ఎండీఏలోని శంకర్‌పల్లి, ఘట్కేసర్‌, మేడ్చల్‌, శంషాబాద్‌ జోన్‌ల నుంచి 2020 లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 3,44,726 దరఖాస్తులు అందాయి. ఇవి కాకుండా మున్సిపాటీల పరిధిలో మరో 1.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. వీటిపైన దరఖాస్తుదారులు ఆయా మున్సిపల్‌ కార్యాలయాల నుంచే ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతులను పొందవచ్చు.

ఆదాయం రూ.1000 కోట్లకు పైగా...

హెచ్‌ఎండీఏ పరిశీలనలో ఉన్న 3.44 లక్షలకు పైగా దరఖాస్తుల నుంచి ప్రభుత్వానికి ఫీజుల రూపంలో రూ.1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభు త్వాన్ని నిధుల లేమి వెంటాడుతున్న దృష్ట్యా వివిధ మార్గాల్లో ఆదాయ సముపార్జనపైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. హెచ్‌ఎండీఏ నుంచి రూ.1000 కోట్లకు పైగా ఆదాయం రావచ్చునని అంచనా వేస్తుండగా మున్సిపాలిటీల ద్వారా అందజేసే ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతుల పైనకూడా మరో రూ.500 కోట్లకు పైగా ఆదా యం వచ్చే అవకాశం ఉండవచ్చునని అంచనా.

ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా రావొచ్చని అంచనా

సాక్షి, సిటీబ్యూరో: ఎల్‌ఆర్‌ఎస్‌ పెండింగ్‌ దరఖాస్తుల క్లియరెన్స్‌తో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు రూ.600 కోట్ల వరకు ఆదాయం రాగలదని అంచనా. 2020 సంవత్సరం ఆగస్ట్‌లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,06,920 మంది వ్యక్తిగత ప్లాట్ల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటి ద్వారా దాదాపు రూ.450 కోట్ల వరకు రాగలవని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అప్పుడు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో మరో రూ.150 కోట్ల వరకు రావచ్చని అంచనా. వెరసి మొత్తం రూ.600 కోట్ల వరకు రావచ్చునని ప్రాథమిక అంచనా. అయితే అందే దరఖాస్తుల్ని బట్టి మాత్రమే ఎంతమేర ఆదాయం రావచ్చుననేది వెల్లడి కానుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు