గృహజ్యోతి వెలుగులు కొందరికే!

27 Feb, 2024 08:28 IST|Sakshi

తొమ్మిది సర్కిళ్లు...48,03,963 గృహ కనెక్షన్లు

200 యూనిట్లలోపు వాడేవారు 30 లక్షలపైనే

ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు 19.85 లక్షలు

రేషన్‌కార్డు ఉన్నవారు 17.21 లక్షల మంది

ఇప్పటి వరకు రేషన్‌, ఆధార్‌ లింకై న కనెక్షన్లు 11 లక్షలు

నేడు గృహజ్యోతి పథకం ప్రారంభోత్సవం

సాక్షి, హైదరాబాద్: గృహజ్యోతి పథకం కిరాయి ఇళ్లలో కొత్త కిరికిరికి కారణమవుతోంది. ఇంటి యజమానికి, అద్దెదారులకు మధ్య వివాదానికి కారణమవుతోంది. అద్దెకు ఉన్నవారు తమ రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫోన్‌ నంబర్‌ను కరెంట్‌ కనెక్షన్‌కు అనుసంధానం (మ్యాపింగ్‌) చేయాల్సిందిగా కోరుతుండగా, ఇందుకు యజమానులు ససేమిరా అంటున్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వస్తాయనే భావనతో మెజార్టీ ఇళ్ల యజమానులు ఇందుకు అంగీకరించడంలేదు.

ఫలితంగా ఆరు గ్యారెంటీల పథకంలో భాగంగా త్వరలో అమలు చేయబోతున్న గృహజ్యోతి పథకానికి వీరందరికీ అర్హత ఉన్నా..లబ్ది పొందే అవకాశం లేకుండా పోతోంది. గ్రేటర్‌ జిల్లాల పరిధిలోని తొమ్మిది సర్కిళ్లు ఉండగా, వీటిలో 48,03,963 గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే వినియోగదారులు 30 లక్షల మందికిపైగా ఉన్నట్లు అంచనా. అంతేకాదు కొన్ని ఇళ్లలో ఒకే మీటర్‌ ఉండటం, రెండు, మూడు కుటుంబాలు అద్దెకు ఉండటం కూడా ఇబ్బందిగా మారింది. ఈ అంశంపై ఇటు డిస్కం అధికారులు కానీ, అటు ప్రభుత్వం కానీ స్పష్టత ఇవ్వకపోవడం లబ్ధిదారుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

11 లక్షలకు మించలే..
ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ప్రభుత్వం మంగళవారం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించబో తోంది. ఇకపై నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారికి ఉచిత విద్యుత్‌ సహా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ను సరఫరా చేయబోతోంది. ఆయా పథకాలకు రేషన్‌కార్డు/ఆధార్‌కార్డు/ఫోన్‌ నంబర్లను తప్పనిసరి చేసింది. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో భాగంగా మూడు జిల్లాల నుంచి 19.85 లక్షల దరఖాస్తులు గృహజ్యోతి పథకం కింద అందాయి. అయితే వీరిలో 17.21 లక్షల మందికి మాత్రమే రేషన్‌ కార్డులు ఉన్నాయి.

చాలా మందికి రేషన్‌ కార్డులు లేక పోవడంతో వారంతా తమ కనెక్షన్లను ఈ ఉచిత పథకానికి అనుసంధానం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. అంతేకాదు రేషన్‌కార్డు ఉన్నవాళ్లు కిరాయి ఇళ్లలో ఉంటుండటం, ఇంటి యజమానులు వారి వివరాలను డిస్కంకు ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో వారంతా ఈ పథకానికి నోచుకోలేక పోతున్నారు. ఇదిలా ఉంటే విద్యుత్‌ కనెక్షన్లకు ఆధార్‌/రేషన్‌కార్డుల అనుసంధానం ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని డిస్కం ప్రకటించింది. సమీపంలోని ఈఆర్‌ఓ కేంద్రాల్లో కానీ, సెక్షన్‌ ఆఫీసుల్లో కానీ వీటిని నమోదు చేయించుకోవాలని సూచిస్తుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు