రెండో దశ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం

3 Mar, 2024 09:25 IST|Sakshi

సర్వేలు మొదలు.. త్వరలో శంకుస్థాపనకు సన్నాహాలు

ఇదీ మెట్రో రెండో దశ

● ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఫలక్‌నుమా వరకు(5.5 కి.మీ.)

● ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్డు వరకు(1.5 కి.మీ.)

● నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రో స్టేషన్‌ వరకు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్డు, మైలార్‌దేవ్‌పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ వరకు(మొత్తం 29 కి.మీ.)

● మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్‌ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు(4 కి.మీ.)

● రాయదుర్గ్‌ మెట్రో స్టేషన్‌ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్‌, నానక్‌రామ్‌గూడ జంక్షన్‌, విప్రో జంక్షన్‌, అమెరికన్‌ కాన్సులేట్‌(ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌) వరకు (8 కి.మీ.)

● మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ మీదుగా పటాన్‌చెరు వరకు(14 కి.మీ.)

● ఎల్‌బీనగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి వనస్థలిపురం, హయత్‌నగర్‌ వరకు(8 కి.మీ.)

సాక్షి, సిటీబ్యూరో: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి రానుంది. ఈక్రమంలో ఎన్నికల కోడ్‌కు ముందే మెట్రో రెండో దశ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముందుగా నాగోల్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు చేపట్టనున్న రెండో దశ మెట్రోకు త్వరలో శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. నగరం నలువైపులా మెట్రో విస్తరణలో భాగంగా రెండో దశ మార్గాలపై సర్వేలు, అధ్యయనాలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు నాగోల్‌ నుంచి ఎయిర్‌పోర్టు మార్గంలో డీపీఆర్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో మొదట ఈ రూట్‌లోనే పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్‌లో పట్టు పెంచుకొనేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మూసీ ప్రక్షాళనతో పాటు, నదీ పరీవాహక ప్రాంత అభివృద్ధి పనులను ప్రారంభించింది. అలాగే మెట్రో రెండో దశకు సైతం త్వరలోనే ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది.

వేగంగా డీపీఆర్‌..

రెండో దశ కింద చేపట్టనున్న 70 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి అధికారులు సమగ్ర ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టు మార్గంలో భూసార పరీక్షలు, మెట్రో అలైన్‌మెంట్‌ మార్గం ఎంపిక తదితర పనులు పూర్తి చేశారు. ఈ 29 కిలోమీటర్ల రూట్‌లో అవసరమైన చోట చేపట్టే భూసేకరణపై దృష్టి సారించారు. ఈక్రమంలో మూడు నెలల్లో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెబుతున్నారు. మెట్రో రెండో దశతో పాటు మూసీ అభివృద్ధికి అవసరమయ్యే నిధుల సేకరణపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. గ్రేటర్‌లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ను బలోపేతం చేసే దిశగా ఈ రెండు ప్రాజెక్టులతో పాటు తాజాగా హెచ్‌ఎండీఏ, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిని కూడా విస్తరించే అంశాలపైనా కసరత్తు చేపట్టింది. మరోవైపు సికింద్రాబాద్‌ నుంచి కరీంనగర్‌ వరకు రహదారి విస్తరణ, ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను ఇచ్చేందుకు అంగీకరించడం తదితర అంశాలు ప్రభుత్వానికి అనుకూలంగా మారనున్నాయి. మెట్రో రెండో దశకు ముహూర్తం ఖరారు చేసి.. నగరవాసులకు మరింత చేరువ కావాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది.

నిధుల సేకరణపై దృష్టి..

70 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రెండో దశకు అయ్యే రూ.18,900 కోట్ల వ్యయంలో కొంత మొత్తాన్ని బ్యాంకులు, జైకా లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి సేకరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈక్రమంలో ఇటీవల సీఎం, మంత్రులు జైకా ప్రతినిధులతో సమావేశమైన సంగతి తెలిసిందే. మెట్రో నిర్మాణ ఒప్పందం మేరకు కేంద్రం 35 శాతం నిధులను భరించాల్సి ఉంటుంది. మరో 20 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. మిగతా మొత్తాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. ప్రస్తుతం జైకా మాత్రమే అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థపైనే ఆశ పెట్టుకొంది. మెట్రోతో పాటు మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి కూడా జైకాతో పాటు బ్యాంకుల నుంచి నిధులు సేకరించే అవకాశం ఉంది.

whatsapp channel

మరిన్ని వార్తలు