ఎన్నికల్లో ప్రలోభాలకు తావివ్వొద్దు

3 Mar, 2024 09:25 IST|Sakshi

జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రాస్‌

సాక్షి, సిటీబ్యూరో: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా.. నగదు పంపిణీని అరికట్టేందుకు విస్తృతంగా చర్యలు చేపట్టాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్‌కు ముందు చేపట్టాల్సిన చర్యలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జిల్లా నోడల్‌ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం నియంత్రణకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ మద్యాన్ని సీజ్‌ చేయాలని ఎకై ్సజ్‌ అధికారులకు సూచించారు. అన్ని మద్యం షాపుల దగ్గర సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రూ.10 లక్షలు పైబడిన నగదు తరలింపుపై ఫిర్యాదులు అందిన తక్షణమే విచారణ చేపట్టాలని ఆదాయపన్ను శాఖ నోడల్‌ అధికారిని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా నిర్ధ్దిష్టమైన చర్యలు తీసుకోవాలని సెంట్రల్‌ కస్టమ్స్‌ అధికారులను ఆదేశించారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌కు సంబంధించి అనుమానితుల గత కేసులపైనా దృష్టి సారించాలన్నారు. పలు విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌(లా అండ్‌ ఆర్డర్‌) విక్రమ్‌సింగ్‌ మాన్‌ మాట్లాడుతూ.. మూడు కమిషనరేట్ల పరిధిలో 18 ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి, ఎన్నికల వ్యయం నోడల్‌ అధికారి శరత్‌చంద్ర, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలకు ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి శిక్షణ ఇచ్చారు. సీ–విజిల్‌ ద్వారా అందే ఫిర్యా దులను వంద నిమిషాల్లో పరిష్కరించాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు.

బదిలీ చేసి.. తిరిగి రమ్మన్నారు!

చర్చనీయాంశంగా స్నేహ శబరీష్‌ బదిలీ

సాక్షి, సిటీబ్యూరో: గత బుధవారం(ఫిబ్రవరి 28) జరిగిన ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ అడిషనల్‌/జోనల్‌ కమిషనర్‌ స్నేహ శబరీష్‌ కుమురంభీమ్‌–ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు జీఓ విడుదలైంది. అంతలోనే శుక్రవారం(మార్చి 1) తేదీన ఆమెను పాత పోస్టులోనే కొనసాగిస్తున్నట్టు మరో జీఓ వెలువడింది. ఇదే అంశం ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కాగా, జీహెచ్‌ఎంసీ నుంచి మరో ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్‌ ధోత్రేను కుమురంభీమ్‌–ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ చేయడం విశేషం. దీనికి తోడు స్నేహ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్‌(రెవెన్యూ, ఐటీ)గా, శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. అసలే ఆమె పనిచేస్తోంది శేరిలింగంపల్లి జోన్‌ కావడంతో పలు సందేహాలకు తావిచ్చింది. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో తప్ప ఇంకెక్కడకు వెళ్లనని భీష్మించిన అప్పటి జోనల్‌ కమిషనర్‌ మమతను ప్రస్తుతం అందరు గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయ ప్రభావంతో ఆమె తన పంతాన్ని నెగ్గించుకునే వారని వార్తలు వచ్చాయి. తాజాగా ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో ఇలా జరగడం వెనుక మర్మమేమిటన్నది అర్థం కాని విషయం.

whatsapp channel

మరిన్ని వార్తలు