-

గెలిచినా, ఓడినా.. ప్రజల కోసమే పనిచేస్తా 

28 Nov, 2023 11:19 IST|Sakshi

మహిళాభివృద్ధి కోసమే పోటీ చేస్తున్నా..

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం రాజకీయ వారసురాలిగా ఆమె కోడలు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి  ఇప్పుడు హుజూర్‌నగర్‌ నుంచి సీపీఎం అభ్యర్థీగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. మల్లు స్వరాజ్యం రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 40 ఏళ్ల తర్వాత అదే కుటుంబం నుంచి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన   ఇంటర్వ్యూలో ఆమె వివిధ అంశాలపై మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. 

మహిళల సంక్షేమం, అభివృద్ధిపై వివక్ష.. 
మహిళా సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయి. పాలకులెవరైనా కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నామని చెబుతున్నాయే తప్ప ఆచరణలో పట్టించుకోవడం లేదు.  

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. 
మల్లు స్వరాజ్యం కోడలిగా ఆమె చూపిన బాటలో నడుస్తున్నా. ప్రజా పోరాటాలు చేసినా, ప్రజాస్వామిక ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపించవచ్చనే ఆలోచనతోనే ఎన్నికల బరిలో నిలిచాను. గెలిచినా, ఓడినా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతా. మహిళల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా సమానత్వం, మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా. 

అత్తామామల ప్రోద్బలంతోనే.. 
మా అత్తామామ మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనర్సింహారెడ్డి, నా భర్త నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే ఇంతవరకు వచ్చాను. వివాహం అయ్యాక అత్తమామల ప్రోద్బలంతో కుటుంబాన్ని చూసుకుంటూనే చదువుకున్నా. డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశా. 

రాజకీయ అవగాహన ఉంది 
సీపీఎం అనుబంధ ప్రజా సంఘమైన ఐద్వాకు లీగల్‌ సెల్‌ కన్వీనర్‌గా పనిచేశా. ఐద్వా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. తెలంగాణ వచ్చిన తర్వాత ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి సీపీఎం తరఫున పోటీచేశా.

పోరాటమే గెలిపిస్తుంది 
నిత్యం ప్రజల్లో ఉంటూ మహిళలు, కార్మిక సమస్యలపై పోరాడాను. సూర్యాపేట మండలం రాయినిగూడెం ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యాక,  రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు సాధించా.

నల్లగొండలో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల రుణాలు, గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు చేశాను. పోలీసుల లాఠీచార్జ్‌లకు గురయ్యా.. జైలుకు వెళ్లా. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై పోరాడాను, ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నిరంతరం ప్రజల కోసం పోరాడా.. ఆ పోరాటమే నన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందని ఆశిస్తున్నా. 

నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి 
ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉపాధిహామీ పనులను పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసేలా కృషిచేస్తా. మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగుచేస్తున్న మిర్చి, పత్తి పంటలకు వాటికి సరైన మార్కెట్‌ సౌకర్యం లేదు. శీతల గిడ్డంగులు లేవు.

హుజూర్‌నగర్‌లో మహిళా డిగ్రీ కళాశాల కావాలి. మండలానికి ఒక పాలిటెక్నిక్, జూనియర్‌ కాలేజీ ఉండాలి. సాగర్‌ ఎడమ కాలువ చివరి భూములకు నీరందడం లేదు. లిఫ్టులు సరిగా పనిచేయడం లేదు. పోడు భూములకు పట్టాలు లేవు. ఇలా నియోజకవర్గంలో అనేక అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆయా సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషిచేస్తా. - చింతకింది గణేశ్‌ 

మరిన్ని వార్తలు