పాత బట్టలు దానం చేయాలనుకుంటున్నారా?

19 Apr, 2021 07:51 IST|Sakshi

సోషల్‌ స్టార్టప్‌, ‘డొనేట్‌ వస్త్ర’ కార్యక్రమం

పాత బట్టలు సేకరించి దానం చేసే సంస్థ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లో సొంతిల్లు. పెద్ద కంపెనీలో నెలకు లక్షన్నర జీతం. హ్యాపీగా లైఫ్‌ గడిచిపోతుంటే ఎవరికైనా అంతకుమించి ఏం కావాలనిపిస్తుంది. కానీ  సుజీత్, కార్తీక్‌లకు ఇవేవీ సంతృప్తిని ఇవ్వలేదు. పేదవారికి ఏదైనా సాయం చేయాలన్న బలమైన కోరిక వారిని నిలవనివ్వలేదు.. అంతే చేస్తున్న కార్పొరేట్‌ ఉద్యోగానికి గుడ్‌ బై చేప్పేసి పాత బట్టలు సేకరించి, పేదలకు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘డొనేట్‌ వస్త్ర’ పేరుతో సోషల్‌ స్టార్టప్‌ను పెట్టేశారు.వివరాలు వారి మాటల్లోనే ఎలా ప్రారంభమైందో ..

లాక్‌డౌన్‌ సమయంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పేదలకు ఆహార పొట్లాలు అందిస్తున్నాం. ఒక వృద్ద దంపతులు దగ్గరి వచ్చి ‘మేము ఊరి నుంచి వచ్చాం. పాత బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వండి’ అని అడిగారు. ఇంటికెళ్లి బీరువాలోని పాత బట్టలను తీసుకొచ్చి వాళ్లకు ఇచ్చాం. అప్పుడనిపించింది మన దగ్గరే కాకుండా మన స్నేహితులు, బంధువుల దగ్గర ఉన్న పాత బట్టలు కూడా సేకరించి దానం చేస్తే ఎలా ఉంటుందని? ఈ ఆలోచన నుంచి పుట్టిందే ‘డొనేట్‌ వస్త్ర’.  

సోషల్‌ స్టార్టప్‌ ‘డొనేట్‌ వస్త్ర’ సామాజిక కార్యక్రమం

ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు? 
గతేడాది డిసెంబర్‌లో చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ సుజీత్‌ చల్లా, కార్తీక్‌ ఎస్‌పీలు కలిసి డొనేట్‌ వస్త్ర ప్రారంభించారు. సుజీత్‌ కేపీఎంజీలో పరోక్ష పన్నుల విభాగంలో నాలుగేళ్లు పనిచేశాడు. ఆ తర్వాత పీఅండ్‌జీ కంపెనీ ఇండియా ఫైనాన్స్‌ మేనేజ్‌ర్‌గా ఏడాది పాటు పనిచేశాడు. నెలకు లక్షన్నర జీతం. కేపీఎంజీలో జీఎస్‌టీ విభాగంలో ఐదేళ్లు పనిచేశాడు కార్తీక్‌. జీతం నెలకు లక్ష.  ఆ తర్వాత ప్రియాంక, కావ్య, రవి, యశ్వంత్, స్వపంతి, సాహితీ, షణ్ముఖ్, నితేష్‌ రెడ్డి, శ్రావణి, శ్వేత, యష్‌రాజ్, హిమ వీళ్లతో జత కలిశారు. వీరితో పాటు 150 మంది వాలంటీర్లు కూడా ఉన్నారు.  

బట్టలు ఎలా సేకరిస్తారు? 
నగరం నలువైపులా 50 ప్రాంతాల్లో డ్రాప్‌ఔట్‌ పాయింట్స్‌ ఉన్నాయి. పాత బట్టలు ఇవ్వదలిచిన వాళ్లు డొనేట్‌ వస్త్రకు ఫోన్‌ చేస్తే వాళ్లే వచ్చి బట్టలు తీసుకొని వెళ్లిపోతారు. జయేష్‌ రంజన్, గద్వాల విజయలక్ష్మి, కిదంబి శ్రీకాంత్, రేణుదేశాయ్‌ వంటి చాలా మంది ప్రముఖులు డొనేట్‌ వస్త్రకు పబ్లిసిటీ చేస్తున్నారు. దీంతో పాటు ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియాలో కూడా కంపెనీ ప్రచారం నిర్వహిస్తుంది.  

సేకరించి ఏం చేస్తారు? 
సేకరించిన బట్టలను శానిటైజ్‌ చేస్తారు. చిరిగిపోయిన, గుండీలు ఊడిపోయిన వాటిని వాటిని టైలర్లతో కుట్టిస్తారు. ఆ తర్వాత ఉతికి ఆరేస్తారు. తిరిగి వాటిని ఇస్త్రీ చేసి.. మడతపెట్టి ప్యాకింగ్‌ చేస్తారు. వీటిని పేదలకు దానం చేస్తారు.  

ప్రాసెస్‌కు అయ్యే ఖర్చు ఎలా? 
సేకరించిన బట్టలను శానిటైజ్, వాషింగ్, ప్యాకింగ్, రవాణా వంటి ప్రాసెస్‌ ఖర్చులంతా సొంతంగానే పెట్టుకుంటున్నాం. ఒక్క జత బట్టలను ప్రాసెస్‌ చేయడానికి రూ.100 ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు లక్ష రూపాయలు అయ్యాయి. టంబుల్‌ డ్రై అనే లాండ్రీ కంపెనీ మినిమం చార్జీలతో ప్రాసెస్‌ చేసిస్తుంది.   కొంతమంది ఎక్స్‌ట్రీమ్‌ ఫ్యాషన్‌ బట్టలు, లేకపోతే బాగా చినిగిపోయిన దుస్తులు ఇస్తుంటారు. వాటిని ఫైబర్‌గా మార్చి మాస్క్‌లు, బుక్‌ కవర్స్, బ్యాగ్స్, పిల్లో కవర్స్, ఫర్నీచర్‌ కవర్స్‌ వంటి సస్టైనబుల్‌ ఫ్యాషన్‌గా మారుస్తున్నాం. ఇందుకోసం జూబ్లిహిల్స్‌ మార్పు స్టూడియో, సికింద్రాబాద్‌లోని ఏఆర్‌ఏఎల్‌ స్టూడియోలతో ఒప్పందం చేసుకున్నాం.
   
(డొనేట్‌ వస్త్ర కో–ఫౌండర్లు సుజీత్, కార్తీక్‌ (కుడి నుంచి ఎడమ వైపు)  
 
జీహెచ్‌ఎంసీ అవకాశం ఇస్తే.. 
ఇటీవలే జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మిని కలిశాం. మా సోషల్‌ స్టార్టప్‌ గురించి తెలుసుకొని సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. సోషల్‌ మీడియాలో డొనేట్‌ వస్త్ర చాలెంజ్‌ చేసి.. తనకి ట్యాగ్‌ చేయమని సలహా ఇచ్చారు. అలాగే నగరంలోని అన్నపూర్ణ క్యాంటీన్‌ పక్కన డిస్ట్రిబ్యూషన్‌ ఏర్పాట్లు చేసుకోమని సలహా ఇచ్చారు. -సుజీత్‌ చల్లా,  కో-ఫౌండర్, డొనేట్‌ వస్త్ర.  

మరిన్ని వార్తలు