కిటికీల్లేవు.. గదుల్లేవ్‌.. దీనికి రూ. 7 కోట్లా

31 Jul, 2021 12:52 IST|Sakshi

టెక్సాస్‌/వాషింగ్టన్‌: అప్పుడప్పుడు సినిమాల్లో కొన్ని చిత్ర విచిత్రమైన ఇళ్లు కనిపిస్తుంటాయి. అందులో ప్రవేశిస్తే తిరిగి బయటపడటం చాలా కష్టం. ఎందుకంటే.. ఆ ఇంటిలోపల అంతా గందరగోళంగా.. అస్తవ్యస్తంగా ఉంటుంది. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. మొత్తంగా చెప్పాలంటే మహాభారతంలోని మయ సభను పోలి ఉంటుంది. ఇలాంటి ఇంట్లో నివాసం ఉంటే ఖచ్చితంగా పిచ్చి పడుతుంది. మరి ఇలాంటి వింత ఇల్లు ఉంటుందా అంటే.. ఉంది.. అది కూడా ఇప్పుడు అమ్మకానికి వచ్చిది. ఖరీదు ఏకంగా 7 కోట్ల రూపాయల పైమాటే. ఇంతకు ఆ ఇల్లు ఎక్కడ ఉంది.. దాని విశేషాలు తెలియాలంటే ఇది చదవండి

అమెరికా టెక్సాస్‌ డల్లాస్‌ పట్టణంలోని ఓ ఇల్లు అమ్మకానికి వచ్చింది. దాని ఖరీదు ఏకంగా 1 మిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. 7,43,79,300 రూపాయలు. ఇంత ఖరీదు ఉందంటే.. తప్పకుండా సకల హంగులతో ఇంద్ర భవనంలా ఉంటుందని భావిస్తే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇంటి లోపలికి వెళ్తే బుర్ర తిరుగుతుంది.

ఎందుకంటే ఇంట్లో బెడ్రూంలుండవు.. కిటికీల స్థానంలో నకిలీవి ఉంటాయి. బయట నుంచి చూస్తే.. పెద్ద పెద్ద గాజు కిటికీలున్నట్లు కనిపిస్తుంది కానీ అలా లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అవేం కనిపించవు. ఇక ఈ ఇంటి మొత్తం మీద ఓ గ్లాస్‌ సెక్యూరిటీ విండో ఉంటుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే పోలీస్‌ స్టేషన్‌, నిర్బంధ కేంద్రాల ప్రవేశ ద్వారం వద్ద ఉండే కిటికీని పోలి ఉంటుంది. ప్రతి గది బూడిద రంగు కార్పెట్‌తో కవర్‌ చేసి ఉంటుంది. ఇల్లు ఓ గోడౌన్‌లాగా కనిపిస్తుంది.

దాదాపు 21 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో నిర్మించిన ఈ ఇంటిని ఈ ఏడాది జిల్లోలో అమ్మకానికి పెట్టారు. ఇక ‘‘ఈ ఇల్లు పెద్ద మొత్తంలో వైన్‌ దాచుకోవడానికి.. ఎక్కువ సంఖ్యలో కార్లను, ఆర్ట్‌ కలెక్షన్‌ను దాచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది’’ అని రాసుకొచ్చారు. ఈ ఇంటిని అనుసంధానిస్తూ రెండు విద్యుత్ గ్రిడ్‌లు, రెండు డీజిల్ ఇంధన ట్యాంకుల ద్వారా నడిచే సహజ వాయువు జనరేటర్ కూడా ఉన్నాయి. ఇంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వీటిపై నెటిజనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇది ఇల్లా.. లేక దెయ్యాల కొంపా’’.. ‘‘నాలుగు గోడలు.. పైన కప్పు.. అంతకు మించి ఈ ఇంటిలో ఎలాంటి ఆకర్షణ లేదు’’... ‘‘ఇలాంటి ఇళ్లల్లో ఉంటే లేనిపోని మానసకి సమస్యలు తలెత్తుతాయి’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 

మరిన్ని వార్తలు