Top 10 Largest Horse Breeds: ఈ గుర్రాలు సమ్‌థింగ్‌ స్పెషల్‌!

9 Jul, 2021 07:28 IST|Sakshi

అశ్వ శక్తి

మనుషులకు మచ్చికైన జంతువుల్లో గుర్రాలది ప్రత్యేక స్థానం. పూర్వం వేగ వంతమైన రవాణాకు, యుద్ధాల్లో రథాలను నడిపించేందుకు వీటిని వినియోగించేవారు. చాలా యూరప్‌ దేశాల్లో గుర్రాలను వ్యవసాయ పనులకు కూడా వినియోగిస్తారు. లండన్‌ వీధుల్లో ఇప్పటికీ గుర్రపు బగ్గీలు తిరుగుతూనే ఉంటాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుర్రపు పందేలకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. యంత్రాల శక్తిని కూడా హార్స్‌ పవర్‌లో కొలవడం మనకు అలవాటు.

అలాంటి హయముల్లో ప్రపంచంలోనే పెద్దదిగా గుర్తింపు పొందిన ‘బిగ్‌ జేక్‌ ’ ఇటీవల అమెరికాలోని విస్కాన్సిన్‌లో కన్నుమూసింది. బెల్జియన్‌ జాతికి చెందిన ఈ అశ్వం.. 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 1,136 కిలోల బరువుతో ప్రపంచంలోనే ఎత్తయినదిగా 2010లో గిన్నీస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే పెద్దవైన గుర్రం జాతులు, వాటి వివరాలు ఇక్కడ చూద్దాం.               – ఏపీ సెంట్రల్‌ డెస్క్‌

1. ఇది బ్రిటీష్‌ బ్రీడ్‌

చాలా శక్తిమంతమైనది. అశ్వాల్లోనే పెద్ద జాతిగా పేరొందింది. వీటి సరాసరి ఎత్తు 6 అడుగులు ఉంటుంది. ఇవి 900 నుంచి 1,100 కేజీల వరకు బరువు ఉంటాయి. ప్రపంచంలో ఎత్తయిన అశ్వంగా ఈ జాతికి చెందిన ‘మమ్మోత్‌’ గతంలో రికార్డు నెలకొల్పింది. అది 7.1 అడుగుల ఎత్తుతో 1,500 బరువు ఉండేది. 

2. క్లైడెస్‌డేల్‌

స్కాంట్లాండ్‌కు చెందిన బ్రీడ్‌. ఈ జాతి తురగాల సగటు ఎత్తు 6 అడుగులు ఉంటుంది. సుమారు 820 నుంచి 910 కేజీల వరకూ బరువు పెరుగుతాయి. అరుదుగా ఒక్కో గుర్రం 1,000 కేజీల బరువు వరకూ పెరుగుతుంది. బ్రిటీష్‌ రాయల్‌ అశ్వికదళంలో ఇవి ఎక్కువగా సేవలు అందిస్తాయి. జాతీయ ప్రాముఖ్య దినాలు, ఇతర సందర్భాల్లో జరిగే పరేడ్‌లలో ఇవి పాల్గొంటాయి. ఒక పోలీస్‌ ఆఫీసర్‌తో పాటు 56 కిలోల బరువుండే మ్యూజికల్‌ డ్రమ్స్‌ను మోస్తూ ఇవి పరేడ్‌లో పాల్గొంటాయి. 

3. పెర్చెరాన్‌

పశ్చిమ ఫ్రాన్స్‌లోని హ్యుస్నే నది, పర్వత సానువులు  దీని జన్మస్థానం. ఇది నివసిస్తున్న దేశాల్లోని పరిస్థితుల ఆధారంగా దీని ఎత్తు, బరువు మారుతూ ఉంటాయి. ఫ్రాన్స్‌లో ఇది సుమారు 5.10 అడుగుల నుంచి 6.01 అడుగుల ఎత్తు, 500 నుంచి 1,200 కిలోల బరువు వరకూ ఉంటుంది. అమెరికాలో 6.3 అడుగులు, 1,200 కిలోల వరకూ కూడా పెరుగుతాయి. బ్రిటన్‌లో సుమారు 5.5 అడుగుల ఎత్తు, 810 కిలోల బరువు ఉంటాయి. 

4. బెల్జియన్‌ 

దీనియన్‌ బెల్జియన్‌తో పాటు బ్రబంట్‌ హార్స్, బెల్జియన్‌ హెవీ హార్స్‌ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇటీవల మరణించిన బిగ్‌ జేక్‌ కూడా ఇదే జాతికి చెందినది. దీని జన్మస్థానం ప్రస్తుత బెల్జియంలోని బ్రబంట్‌ ప్రాంతం. వీటి సగటు ఎత్తు 5.7 అడుగులు ఉంటుంది. 900 కిలోలకు పైగా బరువు పెరుగుతాయి. ఈ జాతిలో ఇప్పటి వరకూ అతి పెద్ద హయముగా పేరొందిన బ్రూక్లిన్‌ సుప్రీమ్‌ 1,451 కేజీల బరువుండేది. 6.5 అడుగుల ఎత్తు ఉండేది. ఇది చాలా కాలం క్రితం కన్నుమూసింది.

5. డచ్‌ డ్రాఫ్ట్‌

నెదర్లాండ్స్‌కు చెందిన జాతి ఇది. కోల్డ్‌ బ్లడెడ్‌    తరహా అశ్వం. ఇది చాలా అందంగా ఉంటుంది. దీని కదలికలు చూడ చక్కగా ఉంటాయి. అణకువగా మసలుతుంది. దీనికి నిలకడ శక్తి ఎక్కువ. దీని సగటు ఎత్తు 5.10 అడుగులు ఉంటుంది. బరువు సగటును 750 కిలోల వరకూ పెరుగుతుంది. వీటిలోని ఆడ గుర్రాలు ఎత్తు, బరువు తక్కువగా ఉంటాయి. 

6. అమెరికన్‌ క్రీమ్‌

పేరుకు తగ్గట్టే ఇది అమెరికాకు చెందిన గుర్రం. దీనిని అమెరికన్‌ వైట్‌ హార్స్‌ అని కూడా పిలుస్తారు. గతంలో అమెరికా ఉన్నత శ్రేణి వర్గాలు, అధికారులు ప్రయాణించే బగ్గీలకు వీటిని వినియోగించేవారు. వీటి సగటు ఎత్తు 5.5 అడుగులు ఉంటుంది. బరువు 820 కిలోల వరకూ పెరుగుతుంది. వీటిల్లోని ఆడవి కాస్త చిన్నవిగా ఉంటాయి.

7. రష్యన్‌ హెవీ డ్రాఫ్ట్‌

దీనిని సోవియట్‌ డ్రాఫ్ట్‌ హార్స్‌ అని కూడా పిలుస్తారు. ఈ జాతి బెల్జియం నుంచి రష్యాకు వచ్చింది. వీటి సగటు ఎత్తు 5.3 అడుగులుగా ఉంటుంది. బరువు 850 కేజీల వరకూ పెరుగుతుంది. వీటిలోని ఆడ వాటి బరువు, ఎత్తు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఈ పెద్దదిగా గుర్తింపు పొందిన తురగం 1,000 కేజీల బరువు పెరిగింది. 

8. సఫోల్క్‌

ఇది కూడా బ్రిటీష్‌కు చెందిన బ్రీడే. దీనిని సఫోల్క్‌ పంచ్, సఫోల్క్‌ సోరెల్‌ అని కూడా పిలుస్తారు. ఇది చాలా బలమైనది. శక్తిమంతమైనది. పెద్దగా కనిపిస్తుంది. కఠినమైన శ్రమ చేయడంలో ప్రసిద్ధి పొందింది. దీని సగటు ఎత్తు 5.10 అడుగులు ఉంటుంది. బరువు 900 నుంచి 1000 కేజీలు ఉంటుంది.

9. ఫజోర్డ్‌

నార్వేలోని పశ్చిమ పర్వత సానువులు దీని జన్మస్థానం. శక్తిమంతమైనదే కాకుండా చురుకైనదిగా దీనికి పేరుంది. ఇది పెరిగే ప్రాంతాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి దీని ఎత్తు, బరువుల్లో మార్పు ఎక్కువగా ఉంటుంది. దీని సగటు ఎత్తు 5.5 అడుగులు కాగా, 500 కిలోల వరకూ బరువు పెరుగుతుంది.

10. డోల్‌

ఇది కూడా నార్వేకు చెందిన అశ్వమే. దీనిని డోల్‌హెస్ట్‌ అని కూడా పిలుస్తారు. దీని హృదయం, ఉదర భాగం విశాలంగా ఉంటుంది. ఫజోర్డ్‌ కన్నా వీటి తోకలు కాస్త చిన్నగా ఉంటాయి. దీని సగటు ఎత్తు 5.2 అడుగులు ఉంటుంది. 530 నుంచి 600 కిలోల వరకూ బరువు పెరుగుతుంది.  

మరిన్ని వార్తలు