10 రెట్లు ఎక్కువ ముప్పు

18 Aug, 2020 02:43 IST|Sakshi

మలేసియాలో కరోనా వైరస్‌లో జన్యుపరమైన మార్పులు

సూపర్‌ స్ప్రెడర్‌గా మారిందన్న శాస్త్రవేత్తలు

కౌలాలంపూర్‌: కరోనా వైరస్‌ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా రూపాంతరం చెందుతూ మరింత సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. మలేసియాలోని వైరస్‌లో మరో కొత్త రకమైన జన్యు మార్పుల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డీ614జీ అని పిలిచే ఈ కొత్త రకం మార్పులతో వైరస్‌ 10 రెట్లు వేగంగా ఇతరులకి సోకుతుందని మలేసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ గుర్తించింది. దీనినే సూపర్‌ స్ప్రెడర్‌గా పిలుస్తారు. (జేఈఈ, నీట్‌ వాయిదాకు సుప్రీం నో!)

భారత్‌ నుంచి వచ్చిన వ్యక్తితో సంక్రమణ
భారత్‌ నుంచి వచ్చిన ఒక రెస్టారెంట్‌ ఓనర్‌ క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో 45 మందికి వైరస్‌ సోకింది. అలా వైరస్‌ బారిన పడిన మూడు కేసుల్లో జన్యుపరమైన మార్పుల్ని గుర్తించినట్టుగా మలేసియా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ నూర్‌ హిషమ్‌ అబ్దుల్లా ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌లో వెల్లడించారు. ఆ వ్యక్తికి అయిదు నెలల జైలు శిక్ష విధించారు. అదే విధంగా, ఫిలిప్పీన్స్‌ నుంచి వచ్చిన ఒక వ్యక్తి నుంచి వైరస్‌ సోకిన వారిలో కూడా జన్యుపరమైన మార్పులున్నట్టు వెల్లడైంది.

ఈ జన్యు మార్పులతో వైరస్‌ ఇతరులపైకి సులభంగా దాడి చేస్తూ , 10 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుంది. కరోనా వైరస్‌లో ఈ కొత్త తరహా మార్పులతో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అబ్దుల్లా తన పోస్టింగ్‌లో హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ప్రజలు పరిశుభ్రంగా ఉంటూ భౌతిక దూరం పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. వైరస్‌ 10 రెట్లు వేగంగా విజృంభిస్తుంది. ఆ చెయిన్‌ని బద్దలు కొట్టాలంటే ప్రజలు సహకరించాలి’’అని అబ్దుల్లా హితవు పలికారు.

వ్యాక్సిన్‌ తయారీ కష్టమా ?
గత ఏడాది డిసెంబర్‌లో చైనాలోని వూహాన్‌లో తొలిసారిగా వైరస్‌ బయటకొచ్చి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందే క్రమంలో జన్యుపరమైన మార్పుల్ని ఇప్పటికే గుర్తించారు. గతంలో ఈ తరహా జన్యు మార్పులు అమెరికా, యూరప్‌లలో గుర్తించారు. తాజాగా మలేసియాలోనూ బయటపడడం ఆందోళన పుట్టిస్తోంది. ఇలా వైరస్‌ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ ఉంటే కరోనాకి వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడంలోనూ, ఔషధ తయారీలోనూ సవాళ్లు ఎదురవుతాయని కొందరు శాస్త్రవేత్తల్లో ఆందోళన నెలకొని ఉంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మాత్రం వైరస్‌లలో జన్యుపరమైన మార్పులు చాలా సహజంగా జరుగుతూ ఉంటాయని, అవేమంత ప్రమాదకరం కాదని ఇప్పటికే వెల్లడించింది. కరోనా వైరస్‌లో చోటు చేసుకుంటున్న జన్యుమార్పులు టీకా తయారీకి ఎలాంటి అవరో«ధం కాదని చెబుతోంది.  

>
మరిన్ని వార్తలు