3,518 మంది హత్యలకు సహకారం.. 75 ఏళ్ల తర్వాత విచారణ

3 Aug, 2021 18:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జర్మనీలో వెలుగు చూసిన ఘటన

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ క్యాంపు వద్ద గార్డుగా పని చేసిన వ్యక్తిని విచారించనున్న కోర్టు

బెర్లిన్‌: అడాల్ఫ్‌ హిట్లర్‌ పేరు చేబితే ఇప్పటికి జర్మనీలో కొందరు వణికిపోతారు. అవును మరి అతడు చేసిన దురాగతాలకు లెక్కే లేదు. జర్మనీ నియంతగా మారిన తర్వాత హిట్లర్‌ యూదులను తీవ్రంగా ద్వేషించాడు. దేశం మొత్తం జల్లెడ పట్టి.. యూదులను ఊచకోత కోశాడు. ఏకంగా కాన్‌సెంట్రేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి.. యూదులను అత్యంత దారుణంగా హత్య చేశాడు. దాదాపు ఏడున్నర లక్షల మంది యూదులు నాజీ శిబిరాలలో రాక్షసంగా మరణించారు అంటే ఎంత దారుణంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు. 

ఇప్పుడు ఈ నియంత పేరు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే.. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన డెబ్భైఐదు సంవత్సరాల తర్వాత జర్మనీ కోర్టు.. మాజీ నాజీ కాన్సంట్రేషన్ గార్డు ఒకరిని విచారిస్తుంది. జర్మనీ చట్టాల ప్రకారం నిందితుడి పేరు వెల్లడించలేదు. సదరు గార్డు 1942 నుంచి 1945 వరకు సచ్సెన్‌హాసన్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో క్యాంప్ గార్డ్‌గా పనిచేశాడు. సదరు గార్డు 3,518 మంది హత్యలకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ అక్టోబర్‌లో ప్రారంభమవుతుందని, సెషన్ రోజుకు రెండున్నర గంటలకు పరిమితం చేస్తామని అధికారులు తెలిపారు.

ప్రాసిక్యూటర్ల ప్రకారం, ప్రస్తుతం 100 ఏళ్ల వయసు ఉన్న ఆ వ్యక్తి 75 ఏళ్ల క్రితం నిర్బంధ శిబిరం వద్ద గార్డుగా పని చేశాడు. ఆ సమయంలో అతడు 3,518 హత్యలకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడైన క్యాంప్‌ గార్డుపై 1942 లో మాజీ సోవియట్ యుద్ధ ఖైదీలను కాల్చడం, విషపూరిత వాయువు జైక్లాన్ బీని ఉపయోగించడంతో సహా ఉరితీయడానికి సహకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. సచ్సెన్‌హాసన్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో కనీసం 2,00,000 మందిని ఖైదు చేయగా.. 20,000 మందిని హత్య చేశారు. ఈ ఆరోపణల విచారణల నేపథ్యంలో ప్రాసిక్యూటర్ నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించాడు, ఆ తర్వాత అతను విచారణకు ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించారు. 

గత నెలలో జర్మనీ కోర్టు 95 ఏళ్ల నాజీ గార్డుని విచారించినట్లు తెలియజేసింది. అక్టోబర్ 1943 నుంచి ఏప్రిల్ 1945 వరకు స్టాలగ్ 6సీ బాథోర్న్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో సదరు వ్యక్తి గార్డుగా పని చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అనేక మంది మాజీ సోవియట్ సైనికులు స్టాలగ్ 6సీ బాథోర్న్ శిబిరంలో పెద్ద సంఖ్యలో మరణించినట్లు నివేదిక తెలిపింది.  తరువాత దీనిని పోలిష్ దళాలు విముక్తి చేశాయి. ఇక ఈ ఏడాది మార్చిలో, ప్రాసిక్యూటర్లు అమెరికా నుంచి బహిష్కరించబడిన 95 ఏళ్ల మాజీ నాజీ డెత్ క్యాంప్ గార్డ్ ఫ్రెడరిక్ కార్ల్ బెర్గర్‌పై కేసును కొట్టేశారు. బెర్గర్‌ను విచారించడానికి తగిన సాక్ష్యాలు లేనందున ఈ కేసును కొట్టేస్తేన్నట్లు కోర్టు తెలిపింది. 

మరిన్ని వార్తలు